తప్పిన ముప్పు
ABN, Publish Date - Nov 30 , 2024 | 11:50 PM
జిల్లాకు ఫెంగల్ తుఫాన్ ముప్పు తప్పింది. ఆ ప్రభావం చిరుజల్లులకే పరిమితమైంది. రెండు, మూడు రోజుల నుంచి చలి తీవ్రత పెరగడంతోపాటు ఈదురుగాలులు వీస్తుండంతో ప్రజలు అవస్థ పడుతున్నారు. ఫెంగల్ తుఫాన్ ప్రభావం జిల్లాపై అధికంగానే ఉండొచ్చన్న సంకేతాలు తొలుత వాతావరణ శాఖ నుంచి అందాయి. తమిళనాడు తీరంలో చెన్నైకి సమీపంలో తుఫాన్ కేంద్రీకృతమై ఉండటంతో ఆ ప్రభావం జిల్లాపై ఉంటుందని ప్రజానీకం కూడా భావించింది.
కొన్ని ప్రాంతాల్లో జల్లులు
పెరిగిన చలి తీవ్రత
ఒంగోలు, నవంబర్ 29 (ఆంధ్రజ్యోతి) : జిల్లాకు ఫెంగల్ తుఫాన్ ముప్పు తప్పింది. ఆ ప్రభావం చిరుజల్లులకే పరిమితమైంది. రెండు, మూడు రోజుల నుంచి చలి తీవ్రత పెరగడంతోపాటు ఈదురుగాలులు వీస్తుండంతో ప్రజలు అవస్థ పడుతున్నారు. ఫెంగల్ తుఫాన్ ప్రభావం జిల్లాపై అధికంగానే ఉండొచ్చన్న సంకేతాలు తొలుత వాతావరణ శాఖ నుంచి అందాయి. తమిళనాడు తీరంలో చెన్నైకి సమీపంలో తుఫాన్ కేంద్రీకృతమై ఉండటంతో ఆ ప్రభావం జిల్లాపై ఉంటుందని ప్రజానీకం కూడా భావించింది. వాతావరణ శాఖ కూడా శుక్రవారం నుంచి మూడురోజులపాటు విస్తారంగా వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. అయితే తుఫాన్ ప్రభావం జిల్లాపై అంతగా చూపలేదు. పొరుగున ఉన్న నెల్లూరుతోపాటు తిరుపతి, అన్నమయ్య జిల్లాలలో జోరు వానలు కురుస్తున్నా ఇక్కడ మాత్రం జల్లులకే పరిమితమైంది. అవి కూడా శుక్రవారం సాయంత్రం నుంచి తూర్పు, దక్షిణ ప్రాంతాల్లోని ఒంగోలు, కొత్తపట్నం, సింగరాయకొండ, జరుగుమల్లి, మద్దిపాడు, ఎస్.ఎన్.పాడు, ఎన్‌జీపాడు, కొండపి తదితర మండలాల్లోనే పడ్డాయి. తుఫాన్ ప్రభావంతో ఉష్ణోగ్రతలు తగ్గడంతోపాటు చలితీవ్రత పెరిగింది. మూడు రోజులుగా ఇలాంటి వాతావరణమే నెలకొంది. ఈ పరిస్థితి జిల్లా ప్రజానీకాన్ని తీవ్రంగా ఇబ్బంది పెడుతోంది. మరోవైపు వాతావరణంలో వచ్చిన మార్పులతో ఎప్పుడు వర్షం కురుస్తుందోనని తూర్పు, దక్షిణ ప్రాంతాల్లోని పొగాకు, శనగ సాగు చేసే రైతులు ఒకింత ఆందోళన చెందుతున్నారు.
Updated Date - Nov 30 , 2024 | 11:50 PM