అపార్ అవస్థలు
ABN, Publish Date - Nov 04 , 2024 | 12:17 AM
విద్యార్థుల అపార్ (ఆటోమేటెడ్ పర్మినెంట్ అకడమిక్ అకౌంట్ రిజిస్ట్రీ) ఐడీ రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఉపాధ్యాయులకు తలనొప్పిగా మారింది. పాఠశాల అడ్మిషన్ రిజిస్టర్, ఆధార్, యుడై్‌సలో విద్యార్థులకు సంబంధించి ఒకే సమాచారం ఉండాలన్న నిబంధన కొత్త సమస్యలను తెచ్చిపెట్టింది.
ముందుకు సాగని విద్యార్థుల రిజిస్ట్రేషన్ ప్రక్రియ
సచివాలయాల్లో ఆధార్ కేంద్రాల చుట్టూ ప్రదక్షిణలు
తలలు పట్టుకుంటున్న టీచర్లు
ఒంగోలు విద్య, నవంబరు 3 (ఆంధ్రజ్యోతి) : విద్యార్థుల అపార్ (ఆటోమేటెడ్ పర్మినెంట్ అకడమిక్ అకౌంట్ రిజిస్ట్రీ) ఐడీ రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఉపాధ్యాయులకు తలనొప్పిగా మారింది. పాఠశాల అడ్మిషన్ రిజిస్టర్, ఆధార్, యుడై్‌సలో విద్యార్థులకు సంబంధించి ఒకే సమాచారం ఉండాలన్న నిబంధన కొత్త సమస్యలను తెచ్చిపెట్టింది. తొలుత 9,10 తరగతుల వారికి మాత్రమే అపార్ ఐడీ అన్న ప్రభుత్వం తాజాగా 1 నుంచి 10వ తరగతి వరకూ చేయమనడంతో టీచర్లకు సమస్య మొదలైంది. విద్యార్థుల వివరాలు పాఠశాల రికార్డుల్లో ఒక రకంగా ఉండగా ఆధార్‌లో మరో విధంగా ఉంది. పుట్టిన తేదీ వివరాలు సచివాలయంలో ఇంకో రకంగా ఉన్నాయి. కొందరు విద్యార్థుల ఇంటి పేరు కూడా ఆధార్‌లో పూర్తిగా లేదు. ఈ సమాచారం సరిపోలక అపార్ రిజిస్ట్రేషన్ కోసం టీచర్లు అనేక ఇబ్బందులు పడుతున్నారు. కంప్యూటర్‌లో విద్యార్థుల వివరాల్లో అక్షరం తేడా వచ్చినా అవి ఆమోదించకపోవడంతో తలలు పట్టుకుంటున్నారు.
అపార్ అంటే..
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన జాతీయ విద్యా విధానం 2020లో భాగంగా ప్రతి విద్యార్థికి అపార్ ఐడీ అవసరమని తేల్చిచెప్పింది. ఇప్పటికే విద్యార్థులకు పిన్ నంబర్లను కేటాయించగా కొత్తగా అపార్‌ను ప్రవేశపెట్టింది. ఈ నంబరు సృష్టించేందుకు క్షేత్రస్థాయిలో ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, విద్యార్థులు నానా తిప్పలు పడుతున్నారు. అపార్ పేరుతో ఆన్‌లైన్‌లో ప్రతి విద్యార్థికి ఒక నంబరును కేటాయిస్తారు. అందులోనే ఆ విద్యార్థికి సంబంధించి విద్యా విషయాలు, నైపుణ్యాలు పొందుపరుస్తారు. ఈ నంబరు కోసం ఆన్‌లైన్‌లో రిజిస్టర్ చేయించుకొనేందుకు మూడు రకాల రికార్డుల్లో విద్యార్థుల వివరాలు ఒకే విధంగా ఉండాలి. అయితే ప్రస్తుతం ఆ పరిస్థితి లేకపోవడంతో అపార్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ ముందుకు సాగడం లేదు.
ఒకే విద్యార్థికి మూడు రకాల వివరాలు
ప్రస్తుతం పాఠశాలల్లో 1నుంచి 10వ తరగతి వరకు చదువుతున్న వారిలో కొందరి వివరాలు గందరగోళంగా ఉన్నాయి. ఒక విద్యార్థికి మూడు రకాల పుట్టిన తేదీలు ఉండటం సమస్యగా మారింది. ప్రాథమిక పాఠశాలలో విద్యార్థి 1వ తరగతిలో చేరేటప్పుడు తల్లిదండ్రులు చెప్పిన విధంగా ప్రధానోపాధ్యాయులు పుట్టిన తేదీ, ఇతర వివరాలను అడ్మిషన్ రిజిస్టర్‌లో నమోదు చేస్తారు. వాటినే హైస్కూలులో 6వ తరగతిలో చేరినప్పుడు అక్కడి అడ్మిషన్ రిజిస్టర్‌లోనూ కొనసాగిస్తారు. పంచాయతీ, మునిసిపాలిటీల్లో పిల్లల జనన రిజిస్టర్‌లో మరో పుట్టిన తేదీతో వారి వివరాలు నమోదవుతున్నాయి. ఆధార్ నంబరులో విద్యార్థుల పుట్టిన తేదీ లేకుండా కేవలం సంవత్సరం మాత్రమే నమోదై ఉంది. ఈనేపథ్యంలో పుట్టిన తేదీల్లో దేన్ని ప్రామాణికంగా తీసుకోవాలో అర్థంకాక ఉపాధ్యాయులు గందరగోళానికి గురవుతున్నారు. ప్రస్తుత నిబంధనల ప్రకారం 9వ తరగతి వరకు పుట్టిన తేదీ మార్చే అధికారం డీఈవోలకు ఉంది. పదో తరగతి వారికి అయితే ఆర్‌జేడీ చేయాలి. అయితే ఆ వివరాలు మార్పుల కోసం అటు కార్యాలయాలు, అటు సచివాలయాల్లోని ఆధార్ కేంద్రాల చుట్టూ తల్లిదండ్రులు, టీచర్లు ప్రదక్షిణలు చేస్తున్నారు.
Updated Date - Nov 04 , 2024 | 12:17 AM