అద్దంకి నుంచి దూరమైన ఉపాధి కార్యాలయం
ABN, Publish Date - Nov 13 , 2024 | 12:22 AM
ఉపాధి హామీ పథకం నిధులతో జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున సీసీ రోడ్లు, సైడ్ డ్రైన్‌ల నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. అదే సమయంలో రెగ్యులర్‌గా జరిగే ఉపాధి హామీ పథకం పనులు కూడా ఉన్నాయి. అయితే పర్యవేక్షణకు అధికారులు మాత్రం అంతంతమాత్రంగానే ఉన్నారు.
క్లస్టర్‌ను రద్దు చేసిన వైసీపీ ప్రభుత్వం
ఆ నిధులతో గ్రామాలలో సీసీ రోడ్లు, డ్రైన్‌లు
జిల్లాలో 2 చోట్ల మాత్రమే ఏపీడీ కార్యాలయాలు
చీరాల క్లస్టర్‌కు ఇన్‌చార్జి అధికారే దిక్కు
ఇక పర్యవేక్షణ ఎలా
అద్దంకి, నవంబరు 12 (ఆంధ్రజ్యోతి) : ఉపాధి హామీ పథకం నిధులతో జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున సీసీ రోడ్లు, సైడ్ డ్రైన్‌ల నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. అదే సమయంలో రెగ్యులర్‌గా జరిగే ఉపాధి హామీ పథకం పనులు కూడా ఉన్నాయి. అయితే పర్యవేక్షణకు అధికారులు మాత్రం అంతంతమాత్రంగానే ఉన్నారు. బాపట్ల జిల్లా ఏర్పడిన తరువాత జిల్లాలో బాపట్లతో పాటు చీరాల, అద్దంకి క్లస్టర్‌లు ఉన్నాయి. అయితే గత రెండున్నర సంవత్సరాల క్రితం వైసీపీ ప్రభుత్వం అద్దంకిలో ఉన్న క్లస్టర్‌ను రద్దు చేసి మార్టూరు కేంద్రంగా ఉన్న చీరాల క్లస్టర్‌లో కలిపారు. దీంతో బాపట్ల జిల్లాలో రెండు క్లస్టర్‌లు మాత్రమే ఉన్నాయి. చీరాల క్లస్టర్ పరిధిలో అద్దంకి, పర్చూరు, చీరాల నియోజకవర్గాల పరిధిలోని 13 మండలాలు ఉన్నాయి. అద్దంకి, పర్చూరు నియోజకవర్గాల పరిధిలోని మండలాలలో కూలీల లభ్యత ఎక్కువగా ఉండడంతో ఉపాధి పనులు ఎక్కువగా జరుగుతున్నాయి. అదే సమయంలో జిల్లా వ్యాప్తంగా సుమారు 80 కోట్ల రూపాయల ఉపాధిహామీ పథకం నిధులతో సీసీ రోడ్లు, సైడ్ డ్రైన్‌లు మంజూరు అయ్యాయి. ఆ పనులన్నీ ఉపాఽధి హామీ అధికారులు పర్యవేక్షణ చేయాల్సి ఉంది. అయితే చీరాల క్లస్టర్‌కు రెగ్యులర్ ఏపీడీ కూడా లేరు. దీంతో ఏపీవోను ఇన్‌చార్జి ఏపీడీగా నియమించారు. వైసీపీ ప్రభుత్వం లో రద్దు చేసిన అద్దంకి క్లస్టర్‌ను తిరిగి పునరుద్ధరించడం ద్వారా అద్దంకి నియోజకవర్గం పరిధిలో జరిగే పనుల పర్యవేక్షణ సులువుగా మారే అవకాశం ఉంది. చీరాల, పర్చూరు నియోజకవర్గాల మండలాలు ఒక క్లస్టర్‌గా, అద్దంకి నియోజకవర్గంలోని మండలాలను ఒక క్లస్టర్‌గా ఏర్పాటు చేయాలని, అదే సమయంలో రెగ్యులర్ ఏపీడీని నియమించాలని పలువురు కోరుతున్నారు. ఉన్నతాధికారులు, మంత్రి గొట్టిపాటి రవికుమార్ స్పందించి అద్దంకిలో క్లస్టర్ ఏర్పాటుపై దృష్టి సారించాలని పలువురు కోరుతున్నారు.
Updated Date - Nov 13 , 2024 | 12:22 AM