Balineni Srinivas: వాళ్లకి లేని బాధ నాకెందుకు.. అధిష్టానం ఏది చెబితే అదే.. బాలినేని యూ టర్న్..
ABN, Publish Date - Jan 31 , 2024 | 01:32 PM
Andhrapradesh: ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డికి ఒంగోలు పార్లమెంటు సీటు విషయంలో మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి విశ్వప్రయత్నాలు చేసిన విషయం తెలిసిందే. గత రెండు రోజులుగా విజయవాడలోనే ఉంటూ అధిష్టానంతో చర్చలు జరిపారు.
ప్రకాశం, జనవరి 31: ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డికి (MP Magunta Srinivasulu reddy) ఒంగోలు పార్లమెంటు సీటు ఇచ్చే విషయంలో మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి (Former Minister Balineni Srinivasreddy) విశ్వప్రయత్నాలు చేసిన విషయం తెలిసిందే. గత రెండు రోజులుగా విజయవాడలోనే ఉంటూ అధిష్టానంతో చర్చలు జరిపారు. అయితే అధిష్టాన పెద్దలతో బాలినేని జరిపిన చర్చల్లో ఫలితం లేకుండా పోయింది. మాగుంటకు టికెట్ ఇచ్చేది లేదని మాజీ మంత్రికి వైసీపీ పెద్దలు తేల్చిచెప్పేశారు. ఒంగోలు పార్లమెంట్ వైసీపీ అభ్యర్థిగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పేరు దాదాపు ఖరారు చేసినట్టు వైసీపీలో ప్రచారం జరుగుతోంది. దీంతో చేసేదేమీ లేక నిరుత్సాహంతో బుధవారం బాలినేని విజయవాడ నుంచి ఒంగోలుకు చేరుకున్నారు.
నా గెలుపు నేను చూసుకుంటా...
ఈ సందర్భంగా మాజీ మంత్రి మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ఒంగోలులో 25 వేల మందికి ఇళ్ళ స్థలాలు ఇవ్వడం నాకు ముఖ్యం. ఎంపీ అభ్యర్థి మాగుంట అయితే అన్ని నియోజకవర్గాల్లో బాగుంటుందని నా పోరాటం. మిగిలిన నియోజకవర్గాల్లో అభ్యర్థులు మాగుంట విషయంలో పట్టీపట్టనట్టు ఉన్నారు. వాళ్ళకి లేని బాధ నాకెందుకు. అధిష్టానం ఏం చెబితే అదే చేస్తాను. మాగుంట టిక్కెట్ విషయం అడిగితే నేను పార్టీ మారుతానని ప్రచారం చేస్తున్నారు. ఎంపీ అభ్యర్థిగా ఎవరు వచ్చినా ఒంగోలులో నా గెలుపు నేను చూసుకుంటాను’’ అని బాలినేని శ్రీనివాస్ తేల్చిచెప్పారు.
చివరకు ఇలా...
అయితే మాగుంటకు ఎంపీ టికెట్ విషయంలో బాలినేని తీవ్రంగా పోరాడినట్లు తెలుస్తోంది. ఒకానొక దశలో మాగుంటకు ఎంపీ టికెట్ ఇవ్వకపోతే బాలినేని పార్టీ మారతారనే ప్రచారం కూడా జోరుగా వినిపించింది. చివరకు మాగుంటకు ఎంపీ టికెట్ ఇచ్చేది లేదని అధిష్టానం చెప్పడంతో బాలినేని యూ టర్న్ తీసుకున్నారు. ‘‘ఒంగోలులో నా గెలుపు నేను చూసుకుంటా.’’ అని బాలినేని చెప్పిన వ్యాఖ్యలతో గత కొద్దిరోజులు ఆయన మార్టీ మారతారంటూ వచ్చిన వార్తలకు తెరపడినట్లైంది.
మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి...
Updated Date - Jan 31 , 2024 | 02:13 PM