వ్యాపార కేంద్రాలుగా సెల్లార్లు
ABN, Publish Date - Nov 13 , 2024 | 01:00 AM
మార్కాపురం పట్టణంలోని ప్రధాన వీధుల్లో సెల్లార్ ఉన్న ఏ బహుళ అంతస్థుల భవనంలో కూడా వాహనా లు పార్క్ చేసేందుకు ఉపయోగించడంలేదు.
మార్కాపురం, నవంబరు 12, (ఆంధ్రజ్యోతి) : మార్కాపురం పట్టణంలోని ప్రధాన వీధుల్లో సెల్లార్ ఉన్న ఏ బహుళ అంతస్థుల భవనంలో కూడా వాహనా లు పార్క్ చేసేందుకు ఉపయోగించడంలేదు. వాటిని అద్దెలకిచ్చి యజమానులు సొమ్ము చేసుకుంటున్నారు. వాస్తవానికి మార్కాపురం మున్సిపాలిటీ పరిధిలో ఎక్కడా సెల్లార్‌లు నిర్మించుకోవడానికి అనుమతులు లేవు. భవనాలు నిర్మించేటప్పుడే పట్టణ ప్రణాళిక విభాగ సిబ్బందికి జేబులు తడిపి అనధికారికంగా సెల్లార్లు నిర్మించారు. సెల్లార్‌లు నిర్మించిన తర్వాత వాటిని అద్దెకిస్తున్నా మున్సిపాలిటీ అఽధికారులు పట్టించుకోవడంలేదు. దీంతో నిత్యం రద్దీగా ఉండే ప్రాంతాల్లో వాహనాలను రోడ్లపై నిలుపుతుండటంతో ట్రాపిక్ సమస్య తీవ్రంగా ఉంటోంది. ముఖ్యంగా రాజాజీ వీధి, రథం బజార్, నెహ్రూబజార్, దోర్నాల బస్టాండ్ ప్రాంతం, కంభం రోడ్డుల్లో ట్రాపిక్ సమస్యలు ఎక్కువ. ఆయా ప్రాంతాల్లో ప్రస్తుతం సుమారు 25 వరకు బహుళ అంతస్థుల భవనాల్లోని సెల్లార్లను వ్యాపార కార్యకలాపాలకు ఉపయోగిస్తున్నట్లు తెలుస్తోంది.
ట్రాఫిక్ సమస్యతో పోలీసుశాఖపై తీవ్ర ఒత్తిడి
మున్సిపాలిటీ పట్టణ ప్రణాళిక విభాగం కాసుల కక్కుర్తి కారణంగా పట్టణంలో ట్రాఫిక్ సమస్య తీవ్రమైంది. దీంతో పోలీసు శాఖపై ఆ ప్రభావం పడుతోంది. ఆయా ప్రాంతాల్లో ట్రాఫిక్‌ను క్రమబద్ధీ కరించాలంటే వారికి తలకు మించిన భారమౌతోంది. ప్రస్తు తం కొన్ని ప్రాంతాలను వన్ వేలుగా ఏర్పాటు చేసి వాహ నాలను దారి మళ్లిస్తున్నారు. అయినా ఉదయం 10 గంటల నుంచి 12 గంటల వరకు, సాయంత్రం 5 గంటల నుంచి 7 గంటల వరకు వాహనాల రద్దీ ఎక్కువగా ఉంటోంది. దీంతో ట్రాఫిక్ అప్పుడ ప్పుడూ స్తంభిస్తోంది. హోమ్‌గార్డులు నిరంతరాయంగా కష్టపడితే మినహా ఆయా ప్రాంతా ల్లో ట్రాపిక్ కష్టాలను కొంతమేరకైనా తగ్గే పరిస్థితి లేదు.
సెల్లార్లపై చర్యలు తీసుకోకుంటే కష్టమే
మార్కాపురం పట్టణ నానాటికీ పెరుగుతోంది. అంతే కాక వాహనాల సంఖ్య కూడా ఏటికేడు విపరీతంగా పెరుగుతోంది. ప్రతి ఇంటికి ఒకటి రెండు వాహనాలు తప్పనిసరయ్యాయి. వ్యక్తిగత వాహనాలకు తోడు ప్రయాణికులను తోలే ఆటోలు, ట్రాలీ ఆటోలు కూడా రద్దీ ప్రాంతాల్లో తిరుగుతుంటాయి. ఈ క్రమంలో కొన్ని సమయాల్లో ట్రాఫిక్ స్తంభిస్తోంది. ప్రస్తుతం పట్టణం లోని ప్రధాన వీధుల్లోని సెల్లార్లను పార్కింగ్ ప్రాంతాలుగా ఉపయోగిస్తే ట్రాఫిక్ సమస్యకు అడ్డుకట్ట పడుతుంది. ఆ దిశగా మున్సిపాలిటీ, పోలీసు అధికారులు చర్యలు తీసుకోవాల్సి ఉంది.
సెల్లార్లలో వ్యాపారాలు నిర్వహిస్తే చర్యలు
సెల్లార్లలో వ్యాపారాలు నిర్వహించడానికి ఎట్టి పరిస్థితుల్లోనూ వీలులేదు. పట్టణంలోని సెల్లార్లు ఉన్న అన్ని భవనాల యజమాలను ఇప్పటికే హెచ్చరించాం. అసలు వాటిని నిర్మించుకోవడానికి అనుమతులే లేవు. పట్టణం మొత్తమే కాక వ్యాపార కార్యకలాపాలు ఎక్కువగా జరిగే ప్రాంతాల్లోని వాటిపై ప్రధానంగా దృష్టిసారించాం. త్వరలో వాటిని తొలగించే ప్రక్రియను ప్రారంభించనున్నాం. ఎవరైనా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తప్పవు.
నారాయణరావు, కమిషనర్, మార్కాపురం మున్సిపాలిటీ
Updated Date - Nov 13 , 2024 | 01:00 AM