రెండు కుటుంబాల్లో చీకట్లు ‘ముసి’రాయి
ABN, Publish Date - Oct 31 , 2024 | 02:38 AM
ముసికి అవతలవైపునకు వెళ్లిన గేదెల కోసం ఏరును దాటుతూ ఇద్దరు గల్లంతయ్యారు. గజ ఈతగాళ్ల సాయంతో వారిద్దరి మృతదేహాలను బుధవారం పోలీసులు వెలికితీయించారు.
గేదెల కోసం ఏరుదాటే ప్రయత్నంలో ఇద్దరు గల్లంతు
గజ ఈతగాళ్లతో గాలింపు
మృతదేహాలు వెలికితీత
కారుమంచిలో విషాదం
కారుమంచి (టంగుటూరు), అక్టోబరు 30 (ఆంధ్రజ్యోతి) : ముసికి అవతలవైపునకు వెళ్లిన గేదెల కోసం ఏరును దాటుతూ ఇద్దరు గల్లంతయ్యారు. గజ ఈతగాళ్ల సాయంతో వారిద్దరి మృతదేహాలను బుధవారం పోలీసులు వెలికితీయించారు. ఈ ఘటన మండలంలోని కారుమంచి వద్ద చోటుచేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. కారుమంచికి చెందిన మల్లవరపు సుబ్బారెడ్డి (57), గడియం ఆదిలక్ష్మి (35)కి చెందిన గేదెలు గడ్డి కోసం ముసి (ఏరు) దాటుకొని అవతలవైపు పొలాల్లోకి వెళ్లాయి. వాటిని తిరిగి ఇళ్లకు తోలుకొచ్చేందుకు వరుసకు అన్నాచెల్లెలు అయిన సుబ్బారెడ్డి, ఆదిలక్ష్మి మంగళవారం సాయంత్రం బయల్దేరారు. ఏటి అవతలకు వెళ్లేందుకు వీరిద్దరూ ముసిలోకి దిగారు. అంతకు ముందు ఆదిలక్ష్మి తన భర్తకు ఫోన్ చేసి విషయం చెప్పింది. ఇటీవల కురిసిన వర్షాలకు ముసి నిండుకుండలా మారింది. దీనికితోడు సాగర్ నీటిని విడుదల చేయడంతో ప్రవాహం కూడా ఉంది. ఏట్లో సుబ్బారెడ్డి, ఆదిలక్ష్మి దిగిన మార్గంలో చిన్నగట్టు ఉంది. దాని ఆధారంగా రైతులు ముసి అవతలవైపు పొలాలకు వెళ్లి వస్తుంటారు. సుబ్బారెడ్డి, ఆదిలక్ష్మి కూడా అదేగట్టుపై వెళ్తూ నీటి ఉధృతికి గల్లంతయ్యారు. అయితే ఏటి అవతల జయవరం పొలాల్లో గేదెలు ఉన్నాయని ఆగ్రామానికి చెందిన రైతు ఆదిలక్ష్మి భర్త రఘునాథ్‌రెడ్డికి ఫోన్ చేసి సమాచారం ఇచ్చారు. ఆయన వేరే మార్గంలో వెళ్లి వాటిని తోలుకొని రాత్రికి ఇంటికి చేరుకున్నాడు. అప్పటికీ భార్య రాకపోవడంతో రఘునాథ్‌రెడ్డి ఆమెకు ఫోన్ చేస్తే స్విచాఫ్‌లో ఉంది. ఇరుగుపొరుగు వారితో కలిసి ముసి వద్దకు వెళ్లి వెతికారు. కనిపించకపోవడంతో రాత్రి టంగుటూరు ఎస్సైకి సమాచారం ఇచ్చారు.
గజ ఈతగాళ్లతో గాలింపు
ఎస్సై నాగమల్లీశ్వరరావు మంగళవారం అర్ధరాత్రే ఘటనా స్థలానికి చేరుకుని విచారించారు. ఆ సమయంలో గాలింపు చర్యలు కష్టమని భావించారు. బుధవారం ఉదయం సింగరాయకొండ నుంచి గజ ఈతగాళ్లను పిలిపించారు. వారు ముసిలో దిగి వెతకడం ప్రారంభించారు. కొంత సేపటికి గట్టు పక్కనే నీటి అడుగున కూరుకుపోయి ఉన్న ఆదిలక్ష్మి మృతదేహాన్ని వెలికి తీశారు. మధ్యాహ్నానికి రెండు కిలో మీటర్ల దూరంలో సుబ్బారెడ్డి మృతదేహం లభించింది. ఇద్దరి మృతదేహాలను టంగుటూరు తహసీల్దార్ పరిశీలించారు. శవపంచనామా నిర్వహించి పోస్టుమార్టం కోసం ఒంగోలు రిమ్స్‌కు తరలించారు. ఎస్సై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
గేదెల కోసం అన్నతో వెళ్తున్నానని చెప్పి..
గేదెల కోసం సుబ్బారెడ్డితో కలసి వెళ్లేముందు ఆదిలక్ష్మి తన భర్తకు ఫోన్ చేసింది. మన గేదెలు ముసి అవతలకు వెళ్లాయి. తోలుకొస్తానని చెప్పి జల సమాధి అయ్యింది. ముసి నుంచి ఈతగాళ్లు బయటకు తీసిన ఆదిలక్ష్మి మృతదేహాన్ని చూసి ఆమె భర్త, కుమారుడు, ఇద్దరు కుమార్తెలు గుండెలవిసేలా రోధించారు. సుబ్బారెడ్డికి భార్య, ఒక కుమారుడు ఉన్నారు. ఇంటికి పెద్దదిక్కును కోల్పోయిన వారు బోరున విలపించారు.
Updated Date - Oct 31 , 2024 | 06:46 AM