కదలం.. మెదలం!
ABN, Publish Date - Sep 05 , 2024 | 01:21 AM
నగరంలో చీపురు పట్టేవారు కరువయ్యారు. ఎక్కడి చెత్త అక్కడే ఉంటోంది. ఎటుచూసినా పరిస్థితి అధ్వానంగా కనిపిస్తోంది. దీనికితోడు వరద బాధిత ప్రాంతాల్లో యుద్ధప్రాతిపదికన పారిశుధ్యం మెరుగు కోసం 300 మందికిపైనే కార్మికులను విజయవాడకు పంపారు.
విజయవాడకు వెళ్లిన 300 మంది శానిటరీ వర్కర్లు
కొందరు ఆర్డరు లేకుండా అటెండర్లుగా ఆఫీసులో తిష్ఠ
వారికి అధికారులు, వైసీపీ కార్పొరేటర్ల ఆశీస్సులు
ఎక్కడి చెత్త అక్కడే.. మెరుగుపడని పారిశుధ్యం
పూడుకుపోయిన డ్రైనేజీలు.. రోడ్లపైనే మురుగు
వర్షాలతో వెంటాడుతున్న వ్యాధుల భయం
ఆందోళనలో ప్రజలు
పూర్తిస్థాయి విధుల్లో ఉంటేనే ప్రజారోగ్యానికి భరోసా
‘ఒంగోలులో పారిశుధ్యం సరిగా లేదు. ఎవరు ఎక్కడ పనిచేస్తున్నారో తెలియదు. ఇకపై నిర్లక్ష్యం వీడాలి. అప్రమత్తంగా ఉండాలి. వర్షాలు కురుస్తున్నాయి. వ్యాధులు ప్రబలే ప్రమాదం ఉంది. ప్రతి ఒక్కరూ అలసత్వం వీడి పనిచేయాలి. పారిశుధ్యం మెరుగుపరచాలి. ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూడాలి. లేకుంటే చర్యలకు సిఫార్సు చేస్తా.
- బుధవారం కార్పొరేషన్ అధికారులతో నిర్వహించిన సమీక్షలో ఎమ్మెల్యే దామచర్ల
‘పారిశుధ్యం మెరుగుకే మొదటి ప్రాధాన్యం. నగరం పరిశుభ్రంగా ఉంటేనే ప్రజలకు మంచి సేవలు అందించినట్లు. అందుకే ఒంగోలును అందమైన నగరంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తా. వ్యాధులు ప్రబలకుండా జాగ్రత్తలు తీసుకుంటాం. డ్రైనేజీ వ్యవ స్థను మెరుగుపరుస్తాం. కార్మికులంతా పనిలో ఉండాల్సిందే.’
- ఇవీ నగర కమిషనర్ వెంకటేశ్వరరావు ఇటీవల బాధ్యతలు స్వీకరించినప్పుడు చెప్పిన మాటలు
నగరంలో చీపురు పట్టేవారు కరువయ్యారు. ఎక్కడి చెత్త అక్కడే ఉంటోంది. ఎటుచూసినా పరిస్థితి అధ్వానంగా కనిపిస్తోంది. దీనికితోడు వరద బాధిత ప్రాంతాల్లో యుద్ధప్రాతిపదికన పారిశుధ్యం మెరుగు కోసం 300 మందికిపైనే కార్మికులను విజయవాడకు పంపారు. పేరుకు కార్పొరేషన్ అయినా, హోదాకు అనుగుణంగా పనిచేసేవారు కరువయ్యారు. కొందరు కార్మికులుగా చేరి, ఆతర్వాత పెత్తనం చేయడానికి మేస్త్రీలుగా అవతారమెత్తారు. మరికొందరు పనిచేయకుండా ముఖంచాటేస్తూ, పలుకుబడితో కార్యాలయంలో ఆర్డర్ లేకుండానే అనధికార అటెండర్లుగా కొనసాగుతున్నారు. దీంతో నగరంలో పారిశుధ్యం పరిస్థితి అగమ్యగోచరంగా మారింది.
ఒంగోలు (కార్పొరేషన్), సెప్టెంబరు 4 : నగరంలో పారిశుధ్యం పడకేసింది. వర్షాల సీజన్‌లో అస్తవ్యస్తంగా తయారవుతోంది. నగరపాలక సంస్థ యంత్రాంగం అప్రమత్తంగా ఉండి యుద్ధప్రాతిపదికన మెరుగైన చర్యలు చేపట్టాల్సి ఉంది. అయితే గత ప్రభుత్వ నీలినీడలు కార్పొరేషన్‌ను వెంటాడుతూనే ఉనా యి. సిబ్బందిని ఇంకా ఆ జాడ్యం వీడలేదు. ఇటీవల భారీవర్షాల కార ణంగా నీటమునిగిన విజయవాడలో సహాయక చర్యల కోసం ఒంగోలు నుంచి 300 మంది వరకు పారిశుధ్య కార్మికులు, ముప్పై మంది శానిటరీ సెక్రటరీలు, మరికొందరు ఇన్‌స్పెక్టర్లు వెళ్లారు. అయితే ఉన్న అరకొర సిబ్బందిలో కొందరు అధికారుల ఇళ్లల్లో పనిచేస్తుండగా, మరికొందరు మేయర్ గృహంలో కార్మికులుగా కొనసాగుతున్నారు. దీంతో ప్రస్తుతం వీధులు ఊడ్చేవారు కరువయ్యారు. గత రెండు రోజులుగా నగరంలో చెత్త ఎత్తేవారు కనిపించకపోవడంతో కుప్పలు పేరుకుపోతున్నాయి. మరోవైపు కురుస్తున్న వర్షాల కారణంగా వ్యాధుల భయం వెంటాడుతోంది. గత ప్రభుత్వ హయాంలో కార్మికులుగా చేరిన కొందరు కార్యాలయం నుంచి కాలు బయటపెట్టం అంటూ తిష్ట వేసి కూర్చు న్నారు. కార్యాలయంలో అవసరం లేకపోయినా అనధికారికంగా కొనసాగుతున్న వీరిని అధికారులు తిరిగి పనిలోకి పంపితే తప్ప, నగరంలో కొంతమేర అయినా పారిశుధ్యం మెరుగుపడే పరిస్థితి కనిపించడం లేదు.
రెండేళ్లుగా కార్పొరేషన్ కార్యాలయంలో తిష్ట
బాలినేని శ్రీనివాసరెడ్డి ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో తన అనుచరుల కోసం ఇష్టారాజ్యంగా ఉద్యోగాలకు సిఫారసులు చేశారు. ఆప్కాస్ కింద 56మందికి ఉద్యోగాలు ఇచ్చారు. శానిటరీ, ఇంజనీరింగ్ విభాగాల్లో పనిచేస్తున్న వీరికి నెలనెలా రూ.21వేల వేతనం చెల్లిస్తున్నారు. మరోవైపు కొవిడ్ సిబ్బంది కింద మరో 100 మందికిపైగా ఉద్యోగాలు ఇవ్వగా నెలకు ఒక్కొక్కరికి రూ.18వేలు చెల్లిస్తున్నారు. అయితే వీరిలో ముప్పై మంది మాత్రం పనిలోకి వెళుతుండగా, మిగిలిన వారు నేటికీ వైసీపీ కార్పొరేటర్ల అండదండలతో కార్యాలయం వదిలివెళ్లడం లేదు. ఇదిలా ఉంచితే వీరు కార్యాలయంలో కూడా చీపురు పట్టరు. ఫైళ్లు అందించరు. వారిని చూసి రెగ్యులర్ ఉద్యో గులు సైతం విస్తుపోతు న్నారు. వైసీపీ ప్రభుత్వ హయాం లో పారిశుధ్య కార్మికులుగా ఉద్యోగాలు పొందిన వారికి కార్పొరేషన్ నిధుల నుంచి టంచన్‌గా జీతాలు చెల్లిస్తున్నారు. కానీ టీడీపీ కూటమి ప్రభుత్వం వచ్చినా వీరిని మాత్రం కార్యాలయం నుంచి కదలించేవారు లేరని చెప్పుకుంటున్నారు. దీంతో నిత్యం పనిచేసే వారిపైనే భారం పడుతోంది. ఇప్పటికైనా పారిశుధ్య విభాగంలో పూర్తిస్థాయిలో కార్మికులను విధుల్లోకి పంపితేనే నగరంలో పారిశుధ్యం మెరుగుపడదని నగరవాసులు అభిప్రాయపడుతున్నారు.
పనిచేసే వారు తక్కువ.. పెత్తనం చేసేవారు ఎక్కువ
ఒక్కో సెక్షన్‌లో కనీసం ముగ్గురు అటెండర్లు ఉండటం ఏ ప్రభుత్వ కార్యాలయంలో కనిపించని పరిస్థితి. అది ఒక్క ఒంగోలు కార్పొరేషన్ కార్యాలయంలోనే ప్రత్యేకంగా కనిపిస్తోంది. గత వైసీపీ ప్రభుత్వ పాలనలో రాజకీయ పలుకుబడితో కార్మికులుగా చేరిన కొందరు ఆపార్టీ కార్యకర్తలు చీపురు పట్టుకోరు. ఇదిలా ఉంచితే కార్యాలయంలో కూడా వీరు చేసే పని పెద్దగా ఏమీ లేదని అధికారులే వెల్లడించడం గమనార్హం. ‘వచ్చామా.. పోయాయా..’ అన్నట్లు ఉంది అనధికార అటెండర్లు వ్యవహారశైలి. వీరి తీరుతో కార్పొరేషన్ కార్యాలయంలో పనిచేసే వారు తక్కువ, పెత్తనం చేసేవారు ఎక్కువ అనే పరిస్థితి నెలకొంది. కాగా గత వైసీపీ పాలనలో ఆడిందే ఆట పాడిందే పాటగా కొనసాగిన పారిశుధ్య కార్మికులు.. ప్రభుత్వం మారినా తీరు మాత్రం మార్చుకోలేదు. వీరికి కార్యాలయంలోని కొందరు అధికారుల ఆశీస్సులతోపాటు, వైసీపీ కార్పొరేటర్ల అండదండలు పుష్కలంగానే ఉన్నాయి. అందుకే ఆర్డరు కాపీలు కూడా లేకుండా రెండేళ్లుగా వారిని కార్యాలయంలో కుర్చీ వేసి మరీ మర్యాద చేసి నెలనెలా జీతాలు ఇస్తున్నారు.
పారిశుధ్యం మెరుగు పడేనా?
ఒకవైపు నగరంలో పారిశుధ్య సమస్య వేధిస్తుండగా, అందుకు అనుగుణంగా కార్మికులు లేరు. వైసీపీ అండదండలతో పలు సెక్ష న్లలో పెత్తనం చేస్తున్న 19మంది కార్మికులను తిరిగి చెత్త సేకరణకు పంపాలి. అలాగే ఆప్కాస్ కింద ఉద్యోగాలు పొంది, కార్యాలయానికి రాని వారిని తొలగించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ముఖ్యంగా అకౌంట్ సెక్షన్‌లో ముగ్గురు ఉద్యోగులు ఉండగా, వారికి ఒకొక్కరికి ఒక్కో అటెండర్ ఉండటం చూస్తుంటే వైసీపీ కార్పొ రేటర్ల పెత్తనం కార్పొరేషన్‌లో ఏస్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు.
వెంటాడుతున్న వైరల్ ఫీవర్లు
వర్షాకాలం అంటేనే వ్యాధుల భయం వెంటాడుతోంది. ఖాళీస్థలాలు, నీటి కుంటలలోకి నీరు చేరి జ్వరాలు ప్రబలుతున్నాయి. దోమల వ్యాప్తికి అనుకూలమైన వాతావరణం కావడంతోడెంగ్యూ, మలేరియా తదితర విషజ్వరాలు ఇప్పటికే అధికమయ్యాయి. ఆస్పత్రులు జ్వరబాధితులతో కిటకిటలాడుతున్నాయి. ఇలాంటి సమయంలో డివిజన్లలో తిరిగి నీటి న్విలలు లేకుండా, ఇళ్ల మధ్య మురుగు కనిపించకుండా, ఖాళీ స్థలాల్లో చెత్తచెదారం లేకుండా చూడాలి. ఒంగోలు కార్పొరేషన్ పరిధిలో అలాంటి వాతావరణం కనిపిం చడం లేదు.
Updated Date - Sep 05 , 2024 | 01:21 AM