భూంఫట్
ABN, Publish Date - Nov 21 , 2024 | 12:00 AM
ముండ్లమూరు మండలంలోని నూ జెండ్లపల్లి చెరువు తొట్టి భూమిఆక్రమణకు గురైంది. కోట్ల విలువ చేసే ప్రభుత్వ భూమి ఇతర చేతుల్లోకి వెళ్లి పోయింది. దీనివెనుక వైసీపీ నాయకుల హస్తముందని బహిరంగంగా విమర్శలు వినిపిస్తున్నాయి.
నూజెండ్లపల్లిలో 40 ఎకరాల చెరువు భూమి ఆక్రమణ
దాని విలువ సుమారు రూ. 4 కోట్లు
వైసీపీ హయాంలో యథేచ్ఛగా రహదారి నిర్మాణం
కబ్జా భూమిలో బోర్లు వేసి వరి, ఇతర పంటల సాగు
చోద్యం చూస్తున్న రెవెన్యూ, పంచాయతీ అధికారులు
ముండ్లమూరు, నవంబరు 20 (ఆంధ్రజ్యోతి) : మండలంలోని నూ జెండ్లపల్లి చెరువు తొట్టి భూమిఆక్రమణకు గురైంది. కోట్ల విలువ చేసే ప్రభుత్వ భూమి ఇతర చేతుల్లోకి వెళ్లి పోయింది. దీనివెనుక వైసీపీ నాయకుల హస్తముందని బహిరంగంగా విమర్శలు వినిపిస్తున్నాయి. కాపాడాల్సిన రెవెన్యూ, పంచాయతీ అధికారులు మామూళ్ల మత్తుకు అలవాటు పడి చోద్యం చూస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. 2019 నుంచి 2024 వరకు వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉండగా కొందరు గ్రామ, మండల వైసీపీ నాయకుల అండదండలతో సుదూర ప్రాంతాలైన విజయవాడ, గుంటూరు ప్రాంతాలకు చెందిన వారు వచ్చి పట్టా భూములు కొనుగోలు చేసి దాని పక్కనే ఉన్న చెరువు తొట్టి భూమిని కలుపుకున్నారు. ఎక్కడి నుంచో వచ్చిన వారు ఆక్రమించుకుంటే మనమెందుకు ఆక్రమించుకోకూడదని ఒక అడుగు ముందుకు వేసి నూజెండ్లపల్లి, సుంకరవారిపాలెం గ్రామాలకు చెందిన కొందరు ఆక్రమణదారులు మిగతా భూమిని ఆక్రమించుకొని యఽథేచ్ఛగా చెరువులో బావులు తవ్వారు. మరి కొందరు ఏకంగా బోర్లు వేశారు. నూజెండ్లపల్లి చెరువు మొత్తం 93.87 ఎకరాల విస్తీర్ణం ఉంది. ఇందులో దాదాపు 35 నుంచి 40 ఎకరాల వరకు ఆక్రమణకు గురైంది. భూములకు విపరీతంగా రేట్లు రావటంతో ఆక్రమణదారుల కన్ను చెరువు తొట్టి భూమిపై పడింది. అద్దంకి పట్టణానికి అతి దగ్గరగా ఉండటం, ప్రస్తుతం అక్కడ ఆక్రమించుకున్న భూమి విలువ ఎకరం రూ. 10 లక్షల నుంచి రూ. 12 లక్షల వరకు ధర పలుకుతోంది. దీంతో ఆక్రమణలకు గురైన భూమి విలువ సుమారు రూ.3 కోట్ల నుంచి రూ.4 కోట్ల వరకు ఉంటుంది.
నూజెండ్లపల్లి చెరువు తొట్టి భూమి సర్వే నెంబరు 163/2లో 5.32 ఎకరాలు, 164/1బీలో 22 సెంట్లు, 164/2బీలో 9.79 ఎకరాలు, 165లో 7.32 ఎకరాలు, 1661బీలో 1.70 ఎకరాలు, 166/1బీ1లో 15 సెంట్లు, 253/1ఏలో 3.46 ఎకరాలు, 253/3ఏలో 7.44 ఎకరాలు, 254/1లో 1.65 ఎకరాలు, 254/2లో 3.03 ఎకరాలు, 254/3లో 1.02 ఎకరాలు, 255లో 8.74 ఎకరాలు, 256/1/ఏ1లో 1.31 ఎకరాలు, 256/1ఏ2లో 3.07 ఎకరాలు, 256/2బీలో 14 సెంట్లు, 260/1లో 14.89 ఎకరాలు, 261/1ఏలో రెండు ఎకరాలు, 261/1బీ1లో 2.19 ఎకరాలు, 261/3బీలో 17 సెంట్లు, 274/3బీలో 39 సెంట్లు, 274/3సీలో 1.23 ఎకరాలు, 281/1లో ఏడు సెంట్లు, 282/1బీలో 1.29 ఎకరాలు, 319/2లో 47 సెంట్లు, 328/2లో ఏడు సెంట్లు, 331/3లో 1.90 ఎకరాల భూమి ఉంది. ఈ భూమిలో 30 నుంచి 40 ఎకరాల వరకు ఆక్రమణకు గురైంది. ప్రస్తుతం ఆ భూముల్లో ఆక్రమణదారులు వరి, జొన్న, కంది పంటలను సాగు చేశారు. గత ఏడాది ఆక్రమణదారులు యఽథేచ్ఛగా నడి చెరువులో రహదారిని సైతం ఆక్రమించారు. చెరువు పంచాయతీ ఆధీనంలో ఉండటంతో పంచాయతీ తీర్మానం లేకుండానే వైసీపీ నాయకులు రహదారి నిర్మాణానికి సహకరించినట్లు సమాచారం. ఏది ఏమైనా కోట్ల రూపాయల విలువ చేసే చెరువు తొట్టి భూమి కాస్త రాబందుల చేతుల్లోకి వెళ్లిందనే విమర్శలు వినిపిస్తున్నాయి.
మా దృష్టికి రాలేదు : ఇన్‌చార్జ్ తహసీల్దార్ శ్రీకాంత్
నూజెండ్లపల్లి చెరువు తొట్టి భూమి ఆక్రమణకు గురైనట్టు తమ దృష్టికి రాలేదని ఇన్‌చార్జ్ తహసీల్దార్ ఆర్. శ్రీకాంత్ తెలిపారు. చెరువును పరిశీలించి ఆక్రమణ దారులకు నోటీసులు ఇస్తామని ఆయన తెలిపారు.
Updated Date - Nov 21 , 2024 | 12:00 AM