విస్తారంగా పొగాకు సాగు
ABN, Publish Date - Nov 20 , 2024 | 01:21 AM
దక్షిణాదిలో పొగాకు పంట ఈ ఏడాది విస్తారంగా సాగుతోంది. పలు ప్రాంతాల్లో రైతులు ముమ్మ రంగా నాట్లు వేస్తున్నారు. నారు, కూలీల ఖర్చు రెట్టింపు అయినా.. కర్ణాటకలో ప్రస్తుత సీజన్ మార్కెట్ ప్రతికూలంగా సాగుతున్నా ఇక్కడి రైతులు మాత్రం జోరుగానే పంట సాగు చేస్తున్నారు.
దక్షిణాదిలో ఇప్పటికే 40వేల హెక్టార్లలో నాట్లు
నారు రేటు, కూలి ఖర్చు రెట్టింపు
అయినా ముమ్మరంగా నాట్లు
పెరగనున్న విస్తీర్ణం
రెండేళ్ల ధరలు, వాతావరణ అనుకూలతే కారణం
ఒంగోలు, నవంబరు 19 (ఆంధ్రజ్యోతి): దక్షిణాదిలో పొగాకు పంట ఈ ఏడాది విస్తారంగా సాగుతోంది. పలు ప్రాంతాల్లో రైతులు ముమ్మ రంగా నాట్లు వేస్తున్నారు. నారు, కూలీల ఖర్చు రెట్టింపు అయినా.. కర్ణాటకలో ప్రస్తుత సీజన్ మార్కెట్ ప్రతికూలంగా సాగుతున్నా ఇక్కడి రైతులు మాత్రం జోరుగానే పంట సాగు చేస్తున్నారు. ఇప్పటికే దక్షిణాదిలో దాదాపు 40వేల హెక్టార్లలో పొగాకు నాట్లు పూర్తికాగా మరో నెలన్నరకు పైగా సాగుకు అవకాశం ఉండటంతో మరో 40 నుంచి 50వేల హెక్టార్లలో నాట్లు వేసే పరిస్థితి కనిపిస్తోంది.
అందరి చూపు పొగాకు వైపే
ఒంగోలు కేంద్రంగా ఉన్న దక్షిణాదిలోని రెండు రీజియన్లలో 11 పొగాకు వేలం కేంద్రాలు ఉన్నాయి. వీటి పరిధిలో గత ఏడాది సుమారు 57,768 హెక్టార్లలో సాగుకు, 89.98 మిలియన్ కిలోల పంట ఉత్పత్తికి బోర్డు అనుమతి ఇచ్చింది. అయితే రైతులు దాదాపు 72 వేల హెక్టార్లకుపైన విస్తీర్ణంలో సాగుచేసి సుమారు 150 మిలియన్ కిలోల పంటను ఉత్పత్తి చేశారు. అలా భారీగా సాగు, ఉత్పత్తి పెరిగినా అంతర్జాతీయ పరిస్థితులు అనుకూలించి ధరలు బాగానే లభించాయి. ఆ ప్రభావం ప్రస్తుత సీజన్‌లో తీవ్రంగా కనిపిస్తోంది. విస్తారంగా పంట సాగుకు రైతులు ఉపక్రమించారు. రైతుల కోరిక మేరకు ఈ ఏడాది (2024-25) పొగాకు బోర్డు కూడా కొంతమేర అదనంగా సాగుకు, పంట ఉత్పత్తికి అనుమతి ఇచ్చింది. దక్షిణాదిలో ప్రస్తుత ఏడాదికి సుమారు 67వేల హెక్టార్లలో పంట సాగుకు, 105 మిలియన్ కిలోల ఉత్పత్తికి పొగాకు బోర్డు అనుమతి ఇవ్వగా భారీగా పెరిగే పరిస్థితి కనిపిస్తోంది.
అనుకూలంగా వాతావరణం
పశ్చిమ ప్రాంతంలోని తేలిక నేలల్లో సెప్టెంబరులోనే పొగాకు నాట్లు చేపట్టగా నల్లరేగడి నేలల్లో ప్రస్తుతం వేస్తున్నారు. గత ఏడాది భారీగా ధరలు లభించి రాబడి ఉండటంతోపాటు ఈ ఏడాది పొగాకు సాగుకు వాతావరణం బాగా అనుకూలించింది. దీంతో విస్తారంగా సాగు చేస్తున్నారు. ఆయా ప్రాంతాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం చూస్తే పొదిలి వేలం కేంద్రం పరిధిలో 8వేల హెక్టార్లకు పైగా విస్తీర్ణంలో సాగు చేయగా, ఒంగోలు-1 పరిధిలో 4,600, వెల్లంపల్లి కేంద్రం పరిఽధిలో 4 వేలు, కొండపి కేంద్రం పరిధిలో నాలుగున్నర వేలు, టంగుటూరు వేలం కేంద్రం పరిధిలో 2వేలు, ఒంగోలు-2 కేంద్రం పరిధిలో 1,500 హెక్టార్లలో నాట్లు వేశారు. నెల్లూరు జిల్లాలోని కందుకూరు-1, కందుకూరు-2, కలిగిరి, డీసీపల్లి తదితర కేంద్రాలలో మరో 16వేల హెక్టార్లలో సాగు చేశారు. ఇంకా నెలన్నర నుంచి రెండు నెలల పాటు పొగాకు సాగుకు సమయం ఉంది.
రెండింతలైన ఖర్చులు
నల్లరేగడి ప్రాంతంలో ఇప్పుడిప్పుడే నాట్లు ప్రారంభమయ్యాయి. ఆ రకంగా చూస్తే మరో 40వేల హెక్టార్లపైగా విస్తీర్ణంలో నాట్లు పడే అవకాశం కనిపిస్తోంది. భారీగా సాగు పెరగనుంది. ఇదిలాఉండగా సాగు ఆరంభం నుంచే రైతులపై భారం పడుతోంది. గతంలో ఎకరాకు మూటన్నర నారు అవసరం కాగా మూట రూ.1500 నుంచి రూ.2వేల ధర ఉండేది. ఈ ఏడాది అది రూ.4వేలకు చేరింది. నాణ్యత సరిలేక రెండు మూటలు వేయాల్సి వస్తోంది. అలాగే నాట్ల కూలి కూడా గతంలో మనిషికి రూ.300 ఉండగా ప్రస్తుతం రూ.500కు చేరింది. ఇక ప్రస్తుతం కర్ణాటకలో ధరలు తగ్గి గందరగోళంగా ఉంది. అయినా ఇక్కడి రైతులు విస్తారంగా పంట సాగు చేస్తుండటం పట్ల పొగాకు రంగ అనుభవజ్ఞులు, బోర్డు అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పంట సాగు నియంత్రించుకోవాలని సూచిస్తున్నారు.
Updated Date - Nov 20 , 2024 | 01:21 AM