ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

ముఖ హాజరు తంటా

ABN, Publish Date - Dec 03 , 2024 | 01:40 AM

గ్రామ, వార్డు సచివాలయాల్లో పనిచేసే ఉద్యోగులు ఇక రోజూ రెండుసార్లు ముఖ హాజరు వేయాల్సిందే. ఆ మేరకు ప్రభుత్వం నిర్ణయించింది. సోమవారం నుంచే అమలు చేసింది. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఏర్పాటైన గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల్లో ఎక్కువ మంది విధులకు ఎప్పుడు వస్తున్నారో తెలియని పరిస్థితి ఏర్పడింది.

ఒంగోలులో ముఖ హాజరు నమోదు చేస్తున్న సచివాలయ సిబ్బంది

రోజుకు రెండుసార్లు వేయాల్సిందే!

సచివాలయ ఉద్యోగుల్లో ఆందోళన

ఒకపూట వేస్తే అది సెలవు లెక్కే

విధులకు డుమ్మాకొడుతున్న వారి ఆటలకు చెక్‌

జిల్లావ్యాప్తంగా అమలు ప్రారంభం

ఒంగోలు కలెక్టరేట్‌, డిసెంబరు 2 (ఆంధ్రజ్యోతి) : గ్రామ, వార్డు సచివాలయాల్లో పనిచేసే ఉద్యోగులు ఇక రోజూ రెండుసార్లు ముఖ హాజరు వేయాల్సిందే. ఆ మేరకు ప్రభుత్వం నిర్ణయించింది. సోమవారం నుంచే అమలు చేసింది. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఏర్పాటైన గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల్లో ఎక్కువ మంది విధులకు ఎప్పుడు వస్తున్నారో తెలియని పరిస్థితి ఏర్పడింది. గతంలో వలంటీర్లను ఏర్పాటు చేయడంతో వారి ద్వారానే సచివాలయ ఉద్యోగులు పనిచేయిస్తూ కాలం వెల్లబుచ్చారు. అయితే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సచివాలయ వ్యవస్థపై దృష్టిసారించింది. ప్రజాప్రతినిధులు, అధికారులు తనిఖీలకు వెళ్లిన సమయంలో ఆయా గ్రామ, వార్డు సచివాలయాల్లో ఉద్యోగులు ఉండటం లేదు. ఈ విషయాన్ని ఎవరైనా ప్రశ్నిస్తే గ్రామంలో లేదా వార్డులో పరిశీలనకు వెళ్లారు, మండల కేంద్రానికి వెళ్లారు అంటూ రకరకాల కారణాలు చెప్పి తప్పించుకుంటున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సచివాలయ ఉద్యోగుల ద్వారా సామాజిక పింఛన్ల పంపిణీతోపాటు ప్రభుత్వం అమలు చేసే సంక్షేమ పథకాల అమలు, పలురకాల విధులను కేటాయించింది. వాటితోపాటు ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం పూట ఇతర ఉద్యోగుల తరహాలో ముఖహాజరు తప్పనిసరిగా వేయాలని ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటివరకు సచివాలయాల్లో ఇష్టారీతిన వ్యవహరించిన ఉద్యోగులు తాజా ఉత్తర్వులతో ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. సాధారణంగా ఒకపూట ముఖ హాజరు వేసి సాయంత్రం ఇంటికి వెళ్లే సమయంలో మరొకసారి హాజరు వేయాల్సి ఉంది. కానీ సచివాలయ ఉద్యోగులకు మాత్రం ఉదయం పదిన్నర లోపు, సాయంత్రం ఐదు గంటలకు తప్పని సరిగా ముఖహాజరు వేస్తేనే ఆ రోజు విధుల్లో ఉన్నట్లు లెక్క. ఒకపూట వేయకపోయినా ఆ రోజు సెలవు కింద పరిగణిస్తారు. ఈ ముఖ హాజరు కూడా ఆ సచివాలయ పరిధిలోని 500 మీటర్ల లోపే వేయాల్సి ఉంది. ఎక్కడో కూర్చొని హాజరు వేయాలనుకుంటే ఇక కుదరదు. జిల్లాలో ఉన్న 712 సచివాలయాల్లో 6,300 మందికిపైగా ఉద్యోగులు పనిచేస్తున్నారు. ఒక్కో సచివాలయంలో సరాసరిన పది విభాగాల ఉద్యోగులు ఉన్నారు. వారందరూ ఇప్పుడు తప్పనిసరిగా ముఖహాజరు వేయాల్సి రావడంతో వారిలో ఆందోళన నెలకొంది.


ఇష్టారాజ్యం ఇక కుదరదు

ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం పనిచేయాల్సిన సచివాలయాల్లో కొన్ని విభాగాల ఉద్యోగులు ఇప్పటి వరకూ విధులకు ఎప్పుడు హాజరువుతారో కూడా తెలియదు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం సచివాలయ వ్యవస్థను గాడిలో పెట్టేందుకు నిర్ణయం తీసుకోవడం వారికి మింగుడు పడటం లేదు. కాగా కొన్ని విభాగాలకు చెందిన సచివాలయ ఉద్యోగులు విధులకు ఉదయం ఆరు గంటలకే వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. అటువంటి ఉద్యోగుల విషయంలో ఇంకా ప్రభుత్వం నిర్ణయం తీసుకోలేదు. వ్యవసాయ సహాయకులు, గ్రామ సర్వేయర్లు, ఏఎన్‌ఎం, వీఆర్వో లాంటి వారు నిరంతరం ప్రభుత్వ కార్యక్రమాల నిర్వహణలో ఉండాలి. వారు ఉదయం వెళితే సాయంత్రం వరకు విధుల్లో ఉండాల్సి వస్తుంది. అలాంటి వారి పట్ల ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందోనని ఆ విభాగాల ఉద్యోగులు వేచిచూస్తున్నారు.

Updated Date - Dec 03 , 2024 | 02:10 AM