అక్రమ మైనింగ్‌లో జిలెటిన్ స్టిక్స్?
ABN, Publish Date - Nov 07 , 2024 | 11:19 PM
కురిచేడు మండలంలోని పడమర వీరాయపాలెం పంచాయతీ పరిధిలోని 8వ సర్వే నంబరులో కొంతమంది అక్రమంగా మైనింగ్ చేస్తూ వైట్ క్వార్ట్జ్ వెలికితీస్తున్నారు. పెద్ద రాళ్లను పగులకొట్టేందుకు జిలెటిన్ స్టిక్స్ వాడారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
కురిచేడు, నవంబరు 7(ఆంధ్రజ్యోతి): మండలంలోని పడమర వీరాయపాలెం పంచాయతీ పరిధిలోని 8వ సర్వే నంబరులో కొంతమంది అక్రమంగా మైనింగ్ చేస్తూ వైట్ క్వార్ట్జ్ వెలికితీస్తున్నారు. పెద్ద రాళ్లను పగులకొట్టేందుకు జిలెటిన్ స్టిక్స్ వాడారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ సర్వే నంబరులో 517 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. ఆ భూమిని కొంతమంది ఆక్రమించి సాగు చేసుకుంటున్నారు. మరికొంతమంది వైట్ క్వార్ట్జ్ రాయి తీసేందుకు అక్రమ మైనింగ్‌కు తెరలేపారు. ఎటువంటి అనుమతులు లేకుండా ఎక్స్‌కవేటర్లతో మట్టిని తవ్వి లోపల నుంచి వైట్ క్వార్ట్జ్ రాయి తీస్తున్నారు. ఈ తవ్వకాలలో పెద్దపెద్ద బండరాళ్లు బయటకు వచ్చాయి. వాటిని పగులకొట్టేందుకు, లోపల నుంచి రాళ్లను పగులకొట్టి బయటకు తీసేందుకు జిలెటిన్ స్టిక్స్‌ను వాడినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. జిలెటిన్ స్టిక్స్ పెట్టి పేల్చేందుకు అనువుగా రాళ్లకు రంధ్రాలు వేసిన ఆనవాళ్లు, వాటిని పేల్చేందుకు వినియోగించిన వైర్లు లభ్యమయ్యాయి.
జిలెటిన్ స్టిక్స్ వినియోగం, భద్రపరచడం ప్రమాదకరం
వైట్ క్వార్ట్జ్ రాయి అక్రమ మైనింగ్ ప్రదేశంలో జిలెటిన్ స్టిక్స్ భద్రపరచే విభాగం ఏదీ లేదు. అక్రమ క్వారీయింగ్ చేయడానికి వాటిని వాడినా, వారికి ఎక్కడ లభ్యం అయ్యాయనేది ప్రశ్నార్థకం. ప్రమాదకరమైన పేలుడు పదార్థాలు వినియోగించినా మైనింగ్, రెవెన్యూ అధికారులు ఎటువంటి చర్యలు తీసుకోకపోవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
అక్రమ మైనింగ్ చేస్తే కఠిన చర్యలు
కురిచేడు మండలం పడమర వీరాయపాలెం పంచాయతీ పరిధిలోని 8వ సర్వే నంబరులోని ప్రభుత్వ భూమిలో అక్రమ మైనింగ్ చేస్తూ తెల్లరాయిని వెలికితీస్తున్న విషయం తెలుసుకున్న రెవెన్యూ అధికారులు అడ్డుకుని ఎక్స్‌కవేటర్‌ను, లారీ స్వాధీనం చేసుకున్నారు. మార్కాపురం మైనింగ్ శాఖకు చెందిన అసిస్టెంట్ జియాలజిస్ట్ పోలిరెడ్డి, టెక్నికల్ అధికారి బాలరాజు గురువారం రెవెన్యూ అధికారులతో కలసి అక్రమ మైనింగ్ జరిగిన ప్రదేశాన్ని పరిశీలించారు. అక్కడ ఎంత పరిమాణంలో తెల్లరాయి ఉన్నదీ లెక్కించి కేసు నమోదు చేశారు. లారీ, ఎక్స్‌కవేటర్‌కు రూ.50 వేలు అపరాధ రుసుం విధించారు. అక్రమంగా వెలికి తీసిన వైట్‌క్వాట్జ్ 40 మెట్రిక్ టన్నులు ఉంటుందని లెక్కించి రెవెన్యూ అధికారులకు స్వాధీనం చేశారు. ఆతరువాత ఆ వైట్ క్వాట్జ్‌ను వేలం వేస్తామని పోలిరెడ్డి తెలిపారు. మండలంలో అక్రమ మైనింగ్‌కు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. వారివెంట ఆర్‌ఐ నాగరాజు, వీఆర్వో ఉన్నారు.
Updated Date - Nov 07 , 2024 | 11:19 PM