గ్రానైట్ ఓవర్ లోడ్
ABN, Publish Date - Dec 07 , 2024 | 12:23 AM
బిల్లులున్నప్పటికీ ఓవర్ లోడ్ పేరుతో గురువారం రాత్రి గ్రానైట్ పలకలను తరలిస్తున్న 15 కంటైనర్ లారీను పోలీసులు సంతనూతలపాడులో నిలిపివేశారు. చీమకుర్తి మండలం రాజుపాలెం, బూదవాడ, రామతీర్థం గ్రానైట్ ఫ్యాక్టరీల నుంచి చెన్నై పోర్టుకు అవి వెళ్తున్నాయి.
15 కంటైనర్లు నిలిపివేసిన పోలీసులు
తనిఖీలు చేసిన మైనింగ్‌శాఖ అధికారులు
ఒంగోలు కైం, డిసెంబరు 6 (ఆంధ్రజ్యోతి): బిల్లులున్నప్పటికీ ఓవర్ లోడ్ పేరుతో గురువారం రాత్రి గ్రానైట్ పలకలను తరలిస్తున్న 15 కంటైనర్ లారీను పోలీసులు సంతనూతలపాడులో నిలిపివేశారు. చీమకుర్తి మండలం రాజుపాలెం, బూదవాడ, రామతీర్థం గ్రానైట్ ఫ్యాక్టరీల నుంచి చెన్నై పోర్టుకు అవి వెళ్తున్నాయి. కంటైనర్‌లో 12 నుంచి 13 క్యూబిక్ మీటర్లు అంటే సుమారుగా 4,500 చదరపు అడుగులు తరలించుకోవచ్చు. అయితే 4,200 చదరపు అడుగులకు బిల్లులు తీసుకొని అంతకన్నా అదనంగా తరలిస్తున్నట్లు పోలీసులకు సమాచారమందింది. దీంతో ఒంగోలు రూరల్ సర్కిల్ సీఐ శ్రీకాంత్‌బాబు ఆధ్వర్యంలో ఎస్‌ఎన్‌పాడులో గ్రానైట్ కంటైనర్లను నిలిపివేసి తనిఖీలు చేశారు. బిల్లులు ఉన్నప్పటికి ఓవర్ లోడ్‌తో రవాణా చేస్తున్నారని వెంటనే పరిశీలించాలని మైనింగ్ అధికారులకు లేఖ రాశారు. ఈ మేరకు శుక్రవారం మైనింగ్ అధికారులు లారీలలో ఉన్న గ్రానైట్‌ను తిరిగి తూకం వేయించారు. వారి వద్ద ఉన్న బిల్లులు సక్రమంగా ఉన్నాయా.. అని పరిశీలించారు. బిల్లులు ఉన్నప్పటికి అన్నీ ఓవర్‌లోడ్‌తో ఉన్నట్లు గుర్తించారు. బిల్లులో ఉన్న పలకల బరువుకు, ప్రస్తుతం ఉన్న బరువు తేడా అత్యంత స్వల్పమేనని మైనింగ్ అధికారులు చెబుతున్నారు. ఈ మేరకు వారు ఎలాంటి చర్యలు తీసుకుంటారనేది చూడాల్సి ఉంది. కాగా తనిఖీల వ్యవహారం గ్రానైట్ పరిశ్రమలో చర్చనీయాంశమైంది.
15 లారీలు నిలిపివేశాం : సీఐ శ్రీకాంత్ బాబు
గ్రానైట్ అక్రమ తరలింపుపై తనిఖీలు నిర్వహించి గురువారం రాత్రి సంతనూతలపాడు వద్ద 15 లారీలను నిలిపివేశాం. వారి వద్ద ఉన్న బిల్లులు సక్రమంగా ఉన్నాయా లేదా? అని నిర్ధారణ కోసం మైనింగ్ అధికారులకు లేఖ రాశాం. మైనింగ్ అధికారులు క్లీయరెన్స్ ఇస్తే వదిలేస్తాము.
Updated Date - Dec 07 , 2024 | 12:23 AM