పొన్నలూరు సొసైటీలో భారీ అక్రమాలు
ABN, Publish Date - Sep 15 , 2024 | 11:34 PM
పొన్నలూరు ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘంలో భారీగా అక్రమాలు, ఆర్థిక అవకతవకలు, పరిపాలనా పరమైన లోపాలు జరిగాయి. సొసైటీలో లావాదేవీలపై 2023-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి నిర్వహించిన ఆడిట్‌లో అవి వెలుగు చూశాయి. ప్రారంభ నిల్వ, అంత్య నిల్వల్లో తేడాలు చూపించి లక్షలాది రూపాయాలు గోల్‌మాల్ చేశారు.
మూడు దశాబ్దాలుగా పెండింగ్ బకాయిలు
అధికారుల నిర్వాకంతో కుదేలు
ఒంగోలు (విద్య), సెప్టెంబరు 15 : పొన్నలూరు ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘంలో భారీగా అక్రమాలు, ఆర్థిక అవకతవకలు, పరిపాలనా పరమైన లోపాలు జరిగాయి. సొసైటీలో లావాదేవీలపై 2023-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి నిర్వహించిన ఆడిట్‌లో అవి వెలుగు చూశాయి. ప్రారంభ నిల్వ, అంత్య నిల్వల్లో తేడాలు చూపించి లక్షలాది రూపాయాలు గోల్‌మాల్ చేశారు. పాలకవర్గాలు, పర్సన్ ఇన్‌చార్జిలు, సహకారశాఖ అధికారులు, సీఈవోల నిర్వాహకంతో సొసైటీ ఆర్థికంగా కుదేలైంది. మూడు దశాబ్దాల క్రితం సొసైటీ నుంచి తీసుకున్న రుణాలు ఇప్పటికీ వసూలు కాకుండా వాయిదా మీరిన బకాయిలుగా మిగిలిపోయాయి. ఈ రుణాలకు సంబంధించి బాండ్ల కాల పరిమితి కూడా ముగియడంతో అవి ఇక వసూలయ్యే అవకాశం కనిపించడం లేదు. దీంతో సొసైటీ నష్టాల ఊబిలో కూరుకుపోయింది.
ఆర్థిక అక్రమాలు ఇవే
సొసైటీ నగదు పుస్తకాల్లో ప్రారంభ, అంత్య నిల్వలు, ఖర్చుల మొత్తాల్లో వ్యాత్యాసంతో రూ.2.35 లక్షలు గల్లంతయ్యాయి.
సీఈవో జీతాన్ని ఏఎ్‌ససీఎఫ్ ఖాతా నుంచి డ్రా చేయాల్సి ఉండగా సొసైటీ నగదు పుస్తకం నుంచి నిబంధనలకు విరుద్ధంగా తీసుకున్నారు. ఈ ఏడాది జనవరి 29న రూ.65వేలు, ఫిబ్రవరి 28న రూ.62,680 డ్రా చేశారు.
సొసైటీ షేర్ ధనంలో రూ.3.71 లక్షలు వ్యత్యాసం ఉంది. షేర్ క్యాపిటల్ లిస్టుకు, సొసైటీ చిట్టా పుస్తకంలో జమల వైపు నమోదు చేసిన దానికి వ్యత్యాసం ఉంది. షేర్ క్యాపిటల్ జాబితాలో సభ్యుల జనరల్ నంబర్ లేకుండానే షేర్ క్యాపిటల్ నమోదు చేశారు.
పీడీసీసీ బ్యాంకు కందుకూరు శాఖకు చెల్లించాల్సిన షేర్ ధనం, చిట్టా పుస్తకంలో ఖర్చుల వైపు చూపించిన మొత్తానికి రూ.59,600 తేడా ఉంది. ఈమొత్తం సొసైటీ నుంచి గల్లంతైంది.
బ్యాంకు కందుకూరు బ్రాంచిలో చెల్లించిన రుణానికి సంబంధించి అసలు, వడ్డీకి సొసైటీ నగదు పుస్తకంలో బ్యాంకుకు చెల్లించిన మొత్తంకు రూ.1.70 లక్షలు తేడా ఉంది.
సొసైటీలో బినామీ రుణాలున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. రైతులకు ఇచ్చిన రూ.8.15 లక్షల స్వల్పకాలిక రుణాలకు సంబంధించి రశీదు పుస్తకాల్లో ఉన్న పేర్లకు, సంఘ చిట్టా పుస్తకంలో నమోదైన పేర్లకు తేడా ఉంది. సొసైటీ వ్యవసాయ రుణాల డీసీబీకి, లోన్ లెడ్జర్‌లో నమోదు చేసిన వివరాలకు కూడా చాలా తేడా ఉంది.
మూడు దశాబ్దాలుగా మొండి బకాయిలు
సొసైటీలో మూడు దశాబ్దాలుగా వసూలు కాకుండా నిలిచిపోయిన బకాయిలు అనేకం ఉన్నాయి. 1992లో బట్వాడా చేసిన రుణాలు కూడా ఇప్పటికీ వసూలు కాకుండా మిగిలిపోయాయి. వీటికి సంబంధించిన బాండ్లకు కూడా కాలపరిమితి ముగిసింది. నిబంధనల ప్రకారం దీర్ఘకాలిక, వ్యవసాయేతర రుణాలకు సంబంధించి బాండు కాలపరిమితి 12 సంవత్సరాలు. అప్పటికి ఆ బకాయిలు వసూలు కాకపోతే వాటిపై చట్టపరమైన చర్యలు తీసుకొనేందుకు ఒక సంవత్సరం గ్రేస్ పీరియడ్ ఇస్తారు ఆతర్వాత ఆ బకాయిలు వసూలు చేసేందుకు సొసైటీకి అధికారం ఉండదు. దీంతో ఆ మొత్తాలను రాని బాకీల పద్దు కింద చే రుస్తారు. స్వల్పకాలిక వ్యవసాయ రుణాలకు అయితే మూడు, నాలుగేళ్లలోపే బాండు కాలపరిమితి ముగుస్తుంది. నిర్ణీత గడువులోపే ఆ రుణాలపై లీగల్ చర్యలు చేపట్టి బకాయిలు రాబట్టాలి. ఆలా చేయని పక్షంలో ఆ బకాయిలను బ్యాంకు మేనేజర్లు, ఫీల్డ్ ఆఫీసర్, సంబంధిత క్లర్క్ సొసైటీల పాలకవర్గం, సీఈవోలను బాధ్యులుగా చేసి వారినుంచి రాబడతారు. సొసైటీ సీఈవో, బ్యాంకు అధికారుల నిర్లక్ష్యం కారణంగా వసూలు కాని బకాయిలపై చట్టపరమైన చర్యలు తీసుకోలేదు. ఇదిలా ఉండగా నకిలీ పాసుపుస్తకాలు, బినామీ రుణాలు, బాండ్లలో అర్హతకు మించి రుణాలు ఇచ్చారన్న ఆరోపణలు ఉన్నాయి. గడువు లోపు చెల్లించని బకాయిలపై లీగల్ చర్యలు చేపడితే ఈ బాగోతాలు బయటపడతాయన్న భయంతోనే మిన్నకుండిపోయారన్న ఆరోపణలు ఉన్నాయి. అయితే ఏటా ఆడిట్ సమయంలో ఈ అవకతవకలన్నింటిని గుర్తించి నివేదికలు ఇవ్వాల్సి ఉంది. కానీ అది కూడా జరగలేదు. ఇందులో సహకార శాఖ అధికారుల వైఫల్యం స్పష్టంగా కనిపిస్తోంది. సహకార సంఘాల చట్టం సెక్షన్ 51 ప్రకారం స మగ్ర విచారణ నిర్వహిస్తే అసలు నిజాలు వెలుగులోకి వస్తాయి.
Updated Date - Sep 15 , 2024 | 11:34 PM