నూతన ఒరవడికి శ్రీకారం
ABN, Publish Date - Dec 02 , 2024 | 11:08 PM
రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీబాల వీరాంజనేయ స్వామి జన్మదినాన్ని పురస్కరించుకొని మండల టీడీపీ నాయకులు నూతన ఒరవడికి శ్రీకారం చుట్టారు.
మంత్రి స్వామి పుట్టినరోజును పురస్కరించుకొని టీడీపీ నేతల వినూత్న కార్యక్రమం
సొంత నిధులతో ఆర్‌అండ్‌బీ రోడ్డుకు ఇరువైపులా చెట్ల తొలగింపు
మర్రిపూడి, డిసెంబరు 2 (ఆంధ్రజ్యోతి) : రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీబాల వీరాంజనేయ స్వామి జన్మదినాన్ని పురస్కరించుకొని మండల టీడీపీ నాయకులు నూతన ఒరవడికి శ్రీకారం చుట్టారు. ఫ్లెక్సీలు వేయడం, కేకులు కట్ చేయడం కన్నా ప్రజా సమస్యలు పరిష్కరించాలని నిర్ణయించుకొన్నారు. మంత్రి ఆదేశాల మేరకు వినూత్న కార్యక్రమాన్ని చేపట్టారు. టంగుటూరు - పొదిలి ఆర్‌అండ్‌బీ రహదారికి ఇరువైపులా చిల్లచెట్ల తొలగింపు చేపట్టారు. గత కొంతకాలంగా చిల్లచెట్ల కారణంగా రాకపోకలకు ఇబ్బంది కలుగుతోంది. కొమ్మలు గీసుకుపోయి ప్రయాణికులు గాయాలపాలవుతున్నారు. ఎదురుగా వచ్చే వాహనాలు కనిపించక ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. ఈ నేపథ్యంలో గుండ్లసముద్రం నుంచి కూచిపూడి వరకు రోడ్డుకు ఇరువైపులా ఉన్న చిల్లచెట్లను సొంత నిధులతో తొలగించాలని టీడీపీ నేతలు నిర్ణయించుకున్నారు. ఈమేరకు సోమవారం తెలుగు రైతు జిల్లా అధికార ప్రతినిధి రేగుల వీరనారాయణ, జడ్పీటీసీ మాజీ సభ్యుడు తుళ్లూరి నరసింహారావు ఆధ్వర్యంలో ఎక్స్‌కవేటర్లతో చిల్లచెట్ల తొలగింపునకు శ్రీకారం చుట్టారు. 15 కిలో మీటర్ల మేర తొలగించనున్నారు. దీనిపై ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇదేస్ఫూర్తితో గోతులమయమైన రహదారికి తాత్కాలిక మరమ్మతులు చేపట్టాలని వారు కోరుతున్నారు.
Updated Date - Dec 02 , 2024 | 11:08 PM