అంతర్రాష్ట్ర దొంగలు అరెస్టు
ABN, Publish Date - Nov 04 , 2024 | 11:45 PM
రాష్ట్రంలో అనేక చోట్ల దొంగతనాలతో పాటు గంజాయి విక్రయాలు చేస్తున్న ఐదుగురిని పొదిలి పోలీసులు అరెస్టు చేసినట్లు ఎస్పీ ఏఆర్. దామోదర్ తెలిపారు. సోమవారం స్థానిక ఎస్పీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు.
ఐదుగురి నుంచి రూ. 23.18 లక్షల సొత్తు, 1.350 గ్రాముల గంజాయి స్వాధీనం
వివరాలు వెల్లడించిన ఎస్పీ దామోదర్
ఒంగోలుక్రైం, నవంబరు 3 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో అనేక చోట్ల దొంగతనాలతో పాటు గంజాయి విక్రయాలు చేస్తున్న ఐదుగురిని పొదిలి పోలీసులు అరెస్టు చేసినట్లు ఎస్పీ ఏఆర్. దామోదర్ తెలిపారు. సోమవారం స్థానిక ఎస్పీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు. ఒడిసా రాష్ట్రానికి చెందిన మహేది హుస్సేన్ , ఒంగోలు విజయ్‌నగర్ కాలనీకి చెందిన షేక్ కృపారావు, తాళ్ళూరు మండలం రామభద్రాపురంనకు చెందిన వడిషన్ వేణుగోపాల్‌రెడ్డి ,చీమకుర్తికి చెందిన షేక్ తరణ్, ఎర్రగొండపాలెంనకు చెందిన అవుల బ్రహ్మయ్యలను పొదిలి సీఐ వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో ఆదివారం సాయత్రం పొదిలిలో అరెస్టు చేసినట్లు తెలిపారు. వీరంతా పొదిలి, టంగుటూరు, వినుకొండ, కందుకూరు, నెల్లూరు, బాపట్ల ,తెనాలి ,అద్దంకి ప్రాంతాలలో అనేక దొంగతనాలు చేసినట్లు అంగీకరించారన్నారు. వీరంతా విశాఖపట్నం నుంచి గంజాయి తెచ్చి పొదిలిలోని బీఎ్‌సఎన్‌ఎల్ కార్యాలయం వెనుక ఉన్న ఖాళీ ప్లాట్లలో కూర్చొని మాట్లాడుకుంటుండగా పొదిలి పోలీసులు వారిని పట్టుకొని విచారించగా అనేక దొంగతనాలు చేసినట్లు అంగీకరించారని ఎస్పీ వెల్లడించారు. ఈమేరకు వారి వద్ద నుంచి 303 గ్రాముల బంగారం, 1.350 గ్రాముల గంజాయి, మోటర్‌బైక్‌తో పాటు రూ. 6,700 నగదు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. వీరు దొంగతనాలు చేయడమే కాకుండా గంజాయి తెచ్చి ఒంగోలు పరిసర ప్రాంతాలలో విక్రయిస్తుంటారని వివరించారు.
దొంగల నేర చరిత్ర ఇదీ
ఒడిసాకుచెందిన మహేది హుసేన్ గంజాయి తెచ్చి విక్రయాలు చేస్తుంటాడు. ఒక దొంగతనం కేసులో నిందితుడు. ఒంగోలుకు చెందిన కృపారావుపై 23 చోరీకేసులు ఉన్నాయి. వడిషన్ వేణుగోపాల్‌రెడ్డిపై 11 కేసులు, తరుణ్‌పై 2 కేసులు,ఆవుల బ్రహ్మయ్య ఒక కేసులో నిందితులుగా ఉన్నారు.
పోలీసులకు అభినందనలు
గంజాయి విక్రయాలుచేస్తూ దొంగతనాలకు పాల్పడుతున్న ఐదుగురు నిందితులను పట్టుకున్న దర్శి డీఎస్పీ బి.లక్ష్మీనారాయణ , పొదిలి సీఐ టి.వెంకటేశ్వర్లు, ఎస్సై వి.వేమన సిబ్బందిని ఎస్పీ అభినందించారు. వారికి ప్రశంసాపత్రాలతో పాటుగా ,రివార్డులను అందజేశారు.
Updated Date - Nov 04 , 2024 | 11:45 PM