చేరికల జోరు.. ప్రచార హోరు
ABN, Publish Date - Apr 11 , 2024 | 02:14 AM
జిల్లాలో తెలుగుదేశం పార్టీ కూటమి అభ్యర్థుల ప్రచారం ఉధృతంగా సాగుతోంది. ఒకవైపు ఇంటింటి ప్రచారం, మరోవైపు వైసీపీని వీడి పార్టీలోకి భారీగా వస్తున్న శ్రేణులకు సాదర స్వాగతాలు, ఇంకోవైపు కార్యకర్తలతోనూ, వివిధ సామాజికవర్గాలతోనూ ఆత్మీయ సమావేశాలు ఊపందుకున్నాయి.
ఉధృతంగా కూటమి అభ్యర్థుల ప్రచారం
వైసీపీని వీడి భారీగా టీడీపీలోకి వస్తున్న శ్రేణులు
పలుచోట్ల విభిన్న వర్గాలతో ఆత్మీయ సమావేశాలు
కార్యకర్తలకు నేతల దిశానిర్దేశం
ఒంగోలు, ఏప్రిల్ 10 (ఆంఽధ్రజ్యోతి): జిల్లాలో తెలుగుదేశం పార్టీ కూటమి అభ్యర్థుల ప్రచారం ఉధృతంగా సాగుతోంది. ఒకవైపు ఇంటింటి ప్రచారం, మరోవైపు వైసీపీని వీడి పార్టీలోకి భారీగా వస్తున్న శ్రేణులకు సాదర స్వాగతాలు, ఇంకోవైపు కార్యకర్తలతోనూ, వివిధ సామాజికవర్గాలతోనూ ఆత్మీయ సమావేశాలు ఊపందుకున్నాయి. అలాగే ఎక్కడికక్కడ స్థానికంగా పార్టీ కార్యాలయాలు ప్రారంభిస్తూ అభ్యర్థులు వేగంగా ముందుకు సాగుతున్నారు. జిల్లావ్యాప్తంగా బుధవారం ఎనిమిది అసెంబ్లీ నియోజకవర్గాలు అలాగే ఒంగోలు, బాపట్ల పార్లమెంట్ ఎంపీ అభ్యర్థులు తమ పరిధిలో విభిన్న కార్యక్రమాల్లో కనిపించారు. రాష్ట్రంలో జగన్ ప్రభుత్వ ఐదేళ్ల అరాచకం, అవినీతి పాలన, రాష్ట్ర భవిష్యత్-చంద్రబాబు ముఖ్యమంత్రి కావాల్సిన అవసరం, ఆయావర్గాల సంక్షేమానికి టీడీపీ కూటమి ప్రకటించిన మేనిఫెస్టోలోని అంశాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్తున్నారు. అదే సమయంలో ఆయా ప్రాంతాల్లో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో తీసుకోవాల్సిన చర్యలపై కార్యకర్తలకు దిశానిర్దేశం చేస్తున్నారు. టీడీపీ కూటమిలోని జనసేన, బీజేపీ శ్రేణులు ఆ కార్యక్రమాల్లో భాగస్వామ్యం అవుతున్నాయి.
ఒంగోలులో భారీగా చేరికలు
ఒంగోలు టీడీపీ అభ్యర్థి దామచర్ల జనార్దన్ సమక్షంలో వైసీపీ నుంచి పెద్దసంఖ్యలో శ్రేణులు వచ్చి పార్టీలో చేరారు. ఆయన నివాసం వద్ద కొత్తపట్నం మండలం పిన్నివారిపాలెం, వజ్జిరెడ్డిపాలెం, అలాగే నగరంలోని 10వ డివిజన్ అగ్రహారంనకు చెందిన పలువురు టీడీపీలో చేరారు. 37వ డివిజన్ వైసీపీ కార్పొరేటర్ చెన్నుపాటి వేణుగోపాల్‌తోపాటు ఆయన సోదరులు ప్రసాదరావు, హరిబాబు, శ్రీనివాసరావులు అలాగే దాదాపు వందమందికిపైగా వారి వర్గం టీడీపీ తీర్థంపుచ్చుకున్నారు. వేణుగోపాల్ నివాసానికి వెళ్లిన జనార్దన్ వారిని పార్టీలోకి సాదరంగా ఆహ్వానించగా ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి, ఇతర ముఖ్యనేతలు పాల్గొన్నారు. రాత్రికి 50వ డివిజన్‌లో ప్రచార కార్యక్రమం నిర్వహించారు.8 సంతనూతలపాడు అభ్యర్థి బీఎన్.విజయకు మార్ బుధవారం ఉదయం మంగమూరు రోడ్డులో పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు. అనంతరం స్థానిక కర్నూలు రోడ్డులోని ఫంక్షన్ హాలులో బాపట్ల పార్లమెంట్ టీడీపీ అభ్యర్థి టి.కృష్ణప్రసాద్‌తో కలిసి నియోజకవర్గ కార్యకర్తల సమావేశంలో పాల్గొన్నారు. రాత్రికి బసవన్న పాలెంలో ఇంటింటి ప్రచార కార్యక్రమం నిర్వహించారు.
కొండపి ఎమ్మెల్యే డాక్టర్ డీఎన్‌బీవీ స్వామి, పార్టీ యువనేత దామ చర్ల సత్యలు సాయంత్రం టంగుటూరులో ఎంపీ మాగుంటతో కలిసి ఇఫ్తార్ విందులో పాల్గొన్నారు. అనంతరం వావిలేటిపాడు వద్ద వేలాది మందితో నిర్వహించిన నియోజకవర్గ స్థాయి మాదిగ ఆత్మీయ సమావేశంలో పాల్గొన్నారు.
కనిగిరి అభ్యర్థి డాక్టర్ ముక్కు ఉగ్రనరసింహా రెడ్డి సమక్షంలో లక్ష్మీనరసాపురంలో భారీగా వైసీపీ వర్గీయులు టీడీపీలో చేరారు. దర్శి ఎమ్మెల్యే వేణుగో పాల్ సోదరుడు రవి కూడా చేరిన వారిలో ఉండగా సాయం త్రం నియో జ కవర్గస్థాయి కార్యకర్తల సమావేశం నిర్వహించి రాత్రికి ఇంటింటి ప్రచారం చేశారు.
దర్శి అభ్యర్థి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి, మాజీ ఎమ్మెల్యే పాపారావు, ఇతర నేతలతో కలిసి దర్శి పట్టణంలో విస్తృత ప్రచారం నిర్వహించారు.
మార్కాపురం అభ్యర్థి కందుల నారాయణరెడ్డి సమక్షంలో చినమనగుండంకు చెందిన 30 కుటుంబాల వారు టీడీపీలో చేరారు. నాలుగు మండలాల్లోనూ కందులతోపాటు కుటుంబ సభ్యులు ప్రచారం చేశారు.
గిద్దలూరు అభ్యర్థి ముత్తుముల అశోక్‌రెడ్డి సమక్షంలో మునిసిపల్ కోఆప్షన్ సభ్యుడు జనార్దన్ టీడీపీలో చేరారు. రాత్రికి గిద్దలూరు మండలంలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు.
ఎర్రగొండ పాలెం టీడీపీ అభ్యర్థి ఎరిక్షన్‌బాబు సమక్షంలో అక్కపాలెంకు చెందిన 15 కుటుంబాల వారు వైసీపీ నుంచి టీడీపీలో చేరారు. అలాగే సాయంత్రం గ్రామాల్లో ఇంటింటి ప్రచారంలో ఎరిక్షన్‌బాబు పాల్గొన్నారు.
Updated Date - Apr 11 , 2024 | 02:14 AM