దీపం-2పై అపోహలు వీడాలి
ABN, Publish Date - Nov 07 , 2024 | 11:21 PM
ప్రజలు దీపం-2 పథకం గురించి అపోహలు వీడాలని జిల్లా జాయింట్ కలెక్టర్ ఆర్.గోపాలకృష్ణ అన్నారు.
మార్కాపురం, నవంబరు 7 (ఆంధ్రజ్యోతి): ప్రజలు దీపం-2 పథకం గురించి అపోహలు వీడాలని జిల్లా జాయింట్ కలెక్టర్ ఆర్.గోపాలకృష్ణ అన్నారు. స్థానిక సబ్ కలెక్టర్ కార్యాలయంలో గురువారం సాయంత్రం డివిజన్ స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై స్థానిక అఽధికారులకు దిశానిర్ధేశం చేశారు. అనంతరం విలేకర్లతో జేసీ గోపాలకృష్ణ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం దీపం-2 పథకాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిందన్నారు. కానీ చాలామంది దీపం-2 పథకానికి ఎవరు అర్హులో అనే విషయంపై అపోహ పడుతున్నారని అన్నారు. ఈ పథకం లబ్ధి పొందెందుకు గ్యాస్ కనెక్షన్‌కు ఆధార్, రేషన్‌కార్డు అనుసంధానం చేసి ఉండాలన్నారు. యాక్టివ్ గ్యాస్‌కనెక్షన్ ఉన్న వాళ్లంతా అర్హులేనన్నారు. అంతేకాక ఈ-కేవైసీ తప్పక చేయించుకోవాలన్నారు. జిల్లాలో 4.80 లక్షల యాక్టివ్ గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయన్నారు. దీపం-2 పథకం కింద ఇప్పటి వరకు 1,05,298 మంది బుక్ చేసుకున్నా రన్నారు. వాటిల్లో 65,690 మందికి గ్యాస్ సిలిండర్‌లు డెలివరి చేశారన్నారు. వారిలో 32,398 మందికి బ్యాంకు అకౌంట్లలో మొత్తం రూ.2.62 కోట్లు జమ చేశారన్నారు. గ్యాస్ సిలిండర్ బుక్ చేసుకున్న వెంటనే పట్టణాల్లో 24 గంటలు, గ్రామీణ ప్రాంతాల్లో 48 గంటల్లోగా డెలివరి చేస్తారన్నారు. డెలివరి జరిగిన 24 గంటల తర్వాత బ్యాంకు అకౌంట్లలో డబ్బులు జమవుతాయన్నారు. ఎలాంటి సాంకేతిక సమస్యలున్నా పరిష్కరిచేందుకు పౌరసరఫరాలశాఖ 1967 టోల్ ఫ్రీ నెంబర్ తీసుకొచ్చిందన్నారు. అంతేకాక జిల్లా ప్రజల కోసం కలెక్టర్ ఆదేశాల మేరకు టోల్ ఫ్రీ నెంబర్‌ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. జిల్లా ప్రజలు 8008901457 నెంబర్‌కు ఫోన్ చేసి సందేహాలను నివృత్తి చేసుకోవచ్చన్నారు.
ప్రతి అర్జీని పరిష్కరించేందుకు చర్యలు
ప్రజా సమస్యల పరిష్కార వేదిక (మీ కోసం) ద్వారా వచ్చే ప్రతి అర్జీని పరిష్కరిచేందుకు ప్రత్యేక చర్యలు తీసు కుంటు న్నట్లు జేసీ గోపాలకృష్ణ తెలిపారు. చాలా మండలాల నుంచి తమ సమస్యలు పరిష్కారం కావడం లేదని ఫిర్యాదు లు అందుతున్నాయన్నారు. అటువంటి వాటిపై డివిజన్ కేంద్రాల్లో ఆడిటింగ్ నిర్వహిస్తున్నామన్నారు. ఆడిటింగ్ టీంలో డిప్యూటీ కలెక్టర్ స్థాయి అధికారి, డిప్యూటీ తహసీల్దార్, ఇద్దరు ఆర్‌ఐలు, నలుగురు వీఆర్‌వోలు, ఒక సీనియర్ అసిస్టెంట్, వార్డ్ వెల్ఫేర్ అసిసెంట్‌లతో ఒక టీం ఏర్పాటు చేస్తామన్నారు. ప్రతి అర్జీదారున్ని పిలిపించి వారితో మాట్లాడి పరిష్కారం చూపేందుకు చొరవ తీసుకుంటున్నామన్నారు. అంతేకాక అధికారుల పనితీరు సరిగాలేకుంటే అర్జీపై క్షేత్ర స్థాయిలో కూడా విచారిస్తామన్నారు. సమావేశంలో సబ్ కలెక్టర్ వెంకట్ త్రివినాగ్, అన్ని మండలాల తహసీల్దార్లు పాల్గొన్నారు.
Updated Date - Nov 07 , 2024 | 11:21 PM