షెడ్ వేసేద్దాం...
ABN, Publish Date - Nov 20 , 2024 | 01:23 AM
గోకులం షెడ్ల నిర్మాణానికి రైతులు, గొర్రెల కాపరులు పెద్దఎత్తున ముందుకు వస్తున్నారు. కూటమి ప్రభుత్వం పశువుల పాకల పథకాన్ని ప్రకటించిన వెంటనే మంచి స్పందన వచ్చింది. జిల్లాకు కేటాయించిన యూనిట్ల కన్నా ఇంచుమించు రెండున్నర రెట్లు అధికంగా దరఖాస్తులు అధికారులకు అందాయి.
కేటాయింపు కన్నా రెండున్నర రెట్లు ఎక్కువగా దరఖాస్తులు
90శాతం రాయితీ ప్రకటించడంతో పశుపోషకుల ఆసక్తి
ఉపాధి నిధుల అనుసంధానం
వేగంగా నిర్మాణాలు... ఇప్పటికే కొన్ని పూర్తి
సంక్రాంతిలోపు అన్నీ పూర్తికి అధికారుల ప్రయత్నం
గోకులం షెడ్ల నిర్మాణానికి రైతులు, గొర్రెల కాపరులు పెద్దఎత్తున ముందుకు వస్తున్నారు. కూటమి ప్రభుత్వం పశువుల పాకల పథకాన్ని ప్రకటించిన వెంటనే మంచి స్పందన వచ్చింది. జిల్లాకు కేటాయించిన యూనిట్ల కన్నా ఇంచుమించు రెండున్నర రెట్లు అధికంగా దరఖాస్తులు అధికారులకు అందాయి. మొత్తం యూనిట్ విలువలో 90శాతం రాయితీ రూపంలో ఉపాధి హామీ పథకం మెటీరియల్ కోటా నిధుల నుంచి ఇస్తుండటం అందుకు ప్రధాన కారణమైంది. జిల్లాలోని అత్యధిక గ్రామాల్లో నాలుగైదు గేదెలు.. అలాగే 50 నుంచి 100 వరకు గొర్రెలు, మేకలు పెంచుకునే మధ్యతరగతి వారు అధికంగా ఉండటం వల్ల కూడా డిమాండ్ ఏర్పడింది.
ఒంగోలు, నవంబరు 19 (ఆంధ్రజ్యోతి): పశు పోషకులకు కూటమి ప్రభుత్వం దన్నుగా నిలిచే క్రమంలో భాగంగా చేపట్టిన పశువుల షెడ్ల నిర్మాణ పథకానికి జిల్లాలో భారీ డిమాండ్ ఏర్పడింది. పెద్దసంఖ్యలో అందిన దరఖాస్తులను పరిశీలించిన అధికారులు తొలుత వచ్చిన వాటికి ప్రాధాన్యం ఇస్తూ మంజూరు చేయడంతో జిల్లావ్యాప్తంగా పలు గ్రామాల్లో ప్రస్తుతం పశువుల షెడ్ల నిర్మాణాలు జోరుగా సాగుతున్నాయి. పాడి పరిశ్రమకు ఊతం, గొర్రెలు, మేకల పెంపకం చేసే వారికి ఆసరాగా ఉండేందుకు ఎండలు, వర్షాల నుంచి వాటికి రక్షణ ఇచ్చేలా 2014-19 మధ్య టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు మినీ గోకులాల పేరుతో షెడ్ల నిర్మాణ పథకాన్ని ప్రవేశపెట్టింది. జిల్లాలో అలా 2018లో 500 యూనిట్లు మంజూరుచేయగా 300 షెడ్ల నిర్మాణాలు పూర్తయ్యాయి. మిగిలినవి వివిధ దశల్లో ఉన్నాయి. అప్పట్లో కూడా వీటిని ఉపాధి హామీ పథకం అనుసంధాన నిధులతోనే ఇచ్చారు. అయితే పథకం ప్రవేశపెట్టిన కొద్దికాలానికి ఎన్నికలు వచ్చి ప్రభుత్వం మారింది. ఆ లోపు కొంతమేర మాత్రమే లబ్ధిదారులకు బిల్లుల చెల్లింపు జరిగింది. తర్వాత అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం ఆ పథకానికి మంగళం పాడింది. చేసిన నిర్మాణాలకు కూడా బిల్లులు ఇవ్వక లబ్ధిదారులు నష్టపోయారు.
రాయితీ పెంపుతో ఆసక్తి
తిరిగి అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభు త్వం మళ్లీ గోకులాలపై దృష్టి సారించింది. ఈసారి యూనిట్ విలువతోపాటు రాయితీని కూడా పెంచింది. పశువుల పాకలకు యూనిట్ విలువ కనిష్ఠంగా రూ.1,03,500, గరిష్ఠంగా రూ.2,07,000గా నిర్ణయించింది. అందులో కేవలం పది శాతం మాత్రమే లబ్ధిదారుడు తన వాటాగా చెల్లిస్తే మిగిలిన 90శాతం ఉపాధి హామీ పథకం నుంచి ఇస్తారు. అలాగే గొర్రెలు, మేకల షెడ్లకు కనిష్ఠంగా రూ.1.30 లక్షలుగా నిర్ణయించగా అందులో లబ్ధిదారులు 30శాతం తమ వాటాగా చెల్లించాలి. పశుసంవర్థకశాఖ ద్వారా లబ్ధిదారుల ఎంపిక చేస్తే ఉపాధి సిబ్బంది పర్యవేక్షణలో వాటిని నిర్మిస్తారు. జిల్లాలో పాడిపరిశ్రమ అధికంగా ఉన్న నేపథ్యంలో పలు ప్రాంతాల పశుపోషకులు ఈ పథకం వైపు మొగ్గుచూపి తమ వాటా నిధులు చెల్లించి దరఖాస్తు చేశారు.
షెడ్ల నిర్మాణానికి ఆసక్తి
జిల్లాకు 1,075 యూనిట్లు మంజూరు కాగా దాదాపు 231 శాతంతో 2,486 దరఖాస్తులు అధికారులకు అందాయి. అందులో అత్యధికంగా దర్శి నియోజకవర్గం నుంచి ఏకంగా 383 ఽశాతం వచ్చాయి. ఆ నియోజకవర్గానికి 125 యూనిట్లు కేటాయించగా 483 దరఖాస్తులు అందాయి. అలాగే వైపాలెం నియోజకవర్గంలో కేటాయించిన యూనిట్లతో పోల్చితే 281శాతం దరఖాస్తులు రాగా సంతనూతలపాడు నియోజకవర్గంలో 257 శాతం, కొండపి నియోజకవర్గంలో 255 శాతం మేర వచ్చాయి. ఇతర నియోజకవర్గాల్లో 200 శాతం లోపుగానే ఉన్నాయి.
నిర్మాణాలు ప్రారంభం
భారీగా దరఖాస్తులు వచ్చిన నేపథ్యంలో పశుసంవర్థకశాఖ అధికారులు స్థానిక ప్రజాప్రతినిధుల సూచనలకు ప్రాధాన్యం ఇస్తూ లబ్ధిదారులను ఎంపిక చేసినట్లు సమాచారం. అందులో సొంత స్థలాలలో నిర్మాణాలు చేసుకునే అవకాశం ఉన్న వారికి ముందుగా అనుమతులు మంజూరు చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం జిల్లావ్యాప్తంగా పశువుల పాకల నిర్మాణాలు ప్రారంభమై ముమ్మరంగా సాగుతున్నాయి. మిగిలిన వారికి వచ్చే ఏడాది కేటాయించే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది.
Updated Date - Nov 20 , 2024 | 01:23 AM