సకాలంలో వైద్యం చేద్దాం.. ప్రాణాలను కాపాడుదాం
ABN, Publish Date - Nov 13 , 2024 | 12:26 AM
అనారోగ్యంతో బాధపడే నిరుపేద, మధ్యతరగతి వారికి ఆరోగ్య ప్రదాయినులు ప్రభుత్వ వైద్యశాలలు. అందులో పనిచేసే వైద్యులు కనిపించే దేవుళ్లు. చీరాల ఏరియా వైద్యశాల కార్పొరేట్ హంగులతో సువిశాలంగా ఉంటుంది. రోజుకు సుమారు 500 ఓపీలు వస్తుంటారు.
ఏరియా ఆసుపత్రికి పెరిగిన ఓపీలు
వెంటాడుతున్న వైద్యులు, సిబ్బంది కొరత
అందుబాటులో గుండె పోటుకు అత్యవసర ఇంజక్షన్
కుక్కకాటుకు ప్రత్యేక మందులు
రాజకీయ నాయకుల పరామర్శలతో కొంత ఇబ్బంది
పని ఒత్తిడితో సతమతమవుతున్న వైద్యులు, సిబ్బంది
ఆసుపత్రి అభివృద్ధి కమిటీ దృష్టి సారించాల్సిన అవసరం
చీరాల, నవంబరు 12 (ఆంధ్రజ్యోతి) : అనారోగ్యంతో బాధపడే నిరుపేద, మధ్యతరగతి వారికి ఆరోగ్య ప్రదాయినులు ప్రభుత్వ వైద్యశాలలు. అందులో పనిచేసే వైద్యులు కనిపించే దేవుళ్లు. చీరాల ఏరియా వైద్యశాల కార్పొరేట్ హంగులతో సువిశాలంగా ఉంటుంది. రోజుకు సుమారు 500 ఓపీలు వస్తుంటారు. రోడ్డు ప్రమాదాలు, కొట్లాట కేసులు కూడా అనునిత్యం ఉంటూనే ఉంటాయి. ప్రమాదకరస్థితిలో వచ్చినవారికి సకాలంలో వైద్యం అందించి, వారి ప్రాణాలను కాపాడాలనే లక్ష్యంతో వైద్యులు, సిబ్బంది ఉరుకులు, పరుగులు తీస్తుంటారు. ఈక్రమంలో వారిని పరామర్శించేందుకు వచ్చే రాజకీయనాయకులు, బంధువులు, మీడియా కవరేజీ తదితర అంశాలతో కొన్ని సందర్భాల్లో వైద్యులు, సిబ్బంది ఒత్తిడికి గురవుతుంటారు. ఆ క్రమంలో ముందుగా వైద్యులు ప్రమాదంలో ఉన్నవారికి వైద్యం అందించేందుకు మిగిలినవారు సహకరించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అది స్వీయనియంత్రణతోనే సాధ్యం. ఇదిలావుంటే ఏరియా వైద్యశాలలో వైద్యులు, సిబ్బంది కొరత వెంటాడుతోంది. ఈ నేపథ్యంలో ఆసుపత్రి అభివృద్ధి కమిటీ ఏరియా వైద్యశాలపై ప్రత్యేక దృష్టి సారించి రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించే విధంగా తగిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
అందుబాటులో అరుదైన ఇంజక్షన్‌లు
ఏరియా వైద్యశాలలో గుండెపోటుతో వచ్చిన వారికి అత్యవసర పరిస్థితుల్లో ఉపయోగించే ఇంజక్షన్ (రూ.20వేలు విలువచేసే)లు అందుబాటులో ఉన్నాయి. గత ఏడాది కాలంలో గుండెపోటుతో ప్రాణాపాయ స్థితిలో వచ్చిన 12 మందికి ఆ ఇంజక్షన్‌లను ఇచ్చారు. ఇంకా 7 ఇంజక్షన్లు అందుబాటుల ఉన్నాయి. కుక్కకాటుకు సంబంధించి రూ.3వేల విలువ చేసే ఇంజక్షన్‌లు, పాముకాటుకు అవసరమైన మందులు అందుబాటులో ఉన్నాయి.
ఖరీదైన సీటీ స్కాన్, డయాలసిస్
ఏరియా వైద్యశాలలో ఖరీదైన సీటీ స్కాన్ అందుబాటులో ఉంది. ఇదే స్కాన్ ప్రైవేటుగా చేయించాలంటే ఒక్కో పేషెంట్‌కు రూ.2వేల వరకు ఖర్చవుతుంది. డయాలసిస్ కూడా అందుబాటులో ఉంది. డయాలసిస్ అవసరమైన పేషెంట్లు విడిగా ఆ వైద్యం పొందాలంటే పెద్ద మొత్తంలోనే అవుతుంది. ఆ సేవలను ఇక్కడ ఉచితంగా అందిస్తున్నారు. అయితే డెంటల్ ఎక్స్‌రే మాత్రం అందుబాటులో లేదు.
వెంటాడుతున్న వైద్యులు, సిబ్బంది కొరత
ఏరియా వైద్యశాలలో రోగులను వైద్యులు, సిబ్బంది కొరత వెంటాడుతోంది. అన్నీ ఉన్నా అల్లుడినోట్లో శని అన్నట్లుగా కొన్ని సందర్భాల్లో మెరుగైన వైద్య సేవలు అందించలేక, ఇతర ప్రాంతాలకు రిఫర్ చేస్తున్నారు. వివిధ విభాగాల్లో ఐదుగురు వైద్యుల అవసరం ఉంది. డిప్యుటేషన్ మీద తెనాలికి ఒకరు, ఒంగోలు రిమ్స్‌కు మరొకరిని పంపించారు. ఆర్‌ఎంఈవో పోస్టు ఖాళీగా ఉంది. పెరిగిన రోగుల సంఖ్యకు అనుగుణంగా నర్సుల సంఖ్య పూర్తిస్థాయిలో లేదు. ఖాళీలు భర్తీ చేయాల్సిన అవసరం ఉంది.
కొన్ని సందర్భాల్లో హడావుడితో ఒత్తిడికి గురవుతున్న వైద్యులు
నిత్యం రోడ్డు ప్రమాదాలు, కొట్లాట కేసుల ఏరియా వైద్యశాలకు వస్తూనే ఉంటాయి. కొన్ని సందర్భాల్లో ఆయా క్షతగాత్రులను పరామర్శించేందుకు రాజకీయనాయకులు, మీడియా కవరేజీ, బంధువులు గణనీయంగా ఉండటంతో వైద్యసేవలు అందించేందుకు వైద్యులు, సిబ్బంది ఒకింత ఒత్తిడికి గురవుతున్నారు. ఆయా సందర్భాల్లో ముందుగా వైద్యసేవలు అందించేవిధంగా ఆయా వర్గాలు సహకరించాల్సిన అవసరం ఉందని పలువురు భావిస్తున్నారు.
అవుట్ పోస్టు పోలీసులు లేకుంటే నైట్ డ్యూటీ కష్టమే
ఆసుపత్రిలో పనిచేసే సిబ్బందిలో ఓ వ్యక్తి రాత్రిళ్లు మద్యం సేవించి విధులకు హాజరువుతున్నారు. అతను మరికొందరిని గుంపు చేస్తున్నాడు. ఈ క్రమంలో అవుట్ పోస్టు పోలీసులు లేకుంటే నైట్ డ్యూటీ చేయడం కష్టమని ఆసుపత్రిలో పనిచేసే కొందరు తమ నిస్సహాయతను వ్యక్తం చేస్తున్నారు. దీనిపై ఆసుపత్రి అభివృద్ధి కమిటీ దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. లేదంటే ఆసుపత్రికి అపప్రద వచ్చే అవకాశం ఉంది.
రోగులకు మెరుగైన వైద్యసేవలు అందించాలన్నదే లక్ష్యం
రోగులకు మెరుగైన వైద్యసేవలు అందించాలన్నదే మా లక్ష్యం. అందుకు అనుగుణంగా పనిచేస్తున్నాం. రోజుకు సుమారు 500 నుంచి 700వరకు ఓపీలు వస్తున్నాయి. మందులు పూర్తిస్థాయిలో అందుబాటులో ఉన్నాయి. వైద్యులు, సిబ్బంది కొరత ఉంది. ప్రతి రోజు ప్రమాద కేసులు వస్తూనే ఉంటాయి. కొన్ని సందర్భాల్లో ప్రాణాపాయస్థితిలో వచ్చే వారికి మెరుగైన వైద్యసేవలు అందించే క్రమంలోనే వైద్యుల ఆలోచనలు ఉంటాయి. మిగిలిన విషయాలు పట్టించుకోరు. దాన్ని అర్థం చేసుకుని సహకరించాలి. అప్పుడే సత్ఫలితాలు వస్తాయి. సిబ్బందిలో ఒకతను మద్యం సేవించి డ్యూటీకి వస్తున్నారు. తప్పు చేసిన వారిపై చర్యల కోసం ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తాను. ఈ క్రమంలో అవుట్ పోస్టు పోలీసులు అందించే రక్షణ ఎనలేనిది. ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సమావేశం ఇటీవల జరిగింది. మెరుగైన చర్యలకు కార్యాచరణ జరుగుతోంది. అందరూ సహకరించాలని కోరుతున్నాం.
- డాక్టర్ సుభాషిణి, ఇన్‌చార్జి
సూపరింటెండెంట్, ఏరియా వైద్యశాల, చీరాల
Updated Date - Nov 13 , 2024 | 12:26 AM