ఫలించిన ఎమ్మెల్యే ఉగ్ర కృషి
ABN, Publish Date - Nov 27 , 2024 | 11:22 PM
ఎంతో కాలంగా నిషేధిత జాబితాలో ఉన్న ఇళ్లు, స్థలాలకు ఎట్టకేలకు విముక్తి లభించింది. ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డి చొరవతో నిషేధిత జాబితా నుంచి వాటిని తొలగిస్తూ ఉత్తర్వులు వచ్చాయి. ఇప్పటిదాకా దేవదాయశాఖ అధికారుల నిర్లక్ష్యంతో నిషేధిత జాబితాలోకి ఇళ్లు, ఇంటి స్థలాలు, భూములు చేరడంతో స్థానికులు పలు అవస్థలు పడ్డారు. తమ ఇళ్లను, ఇంటి స్థలాలను నిషేధిత జాబితా నుంచి తొలగించాలని గత పాలకుల చుట్టూ ప్రదక్షిణలు చేసినా పట్టించుకొన్న పాపానపోలేదు. రిజిస్ర్టేషన్లు నిలిచిపోవడంతో పాటు లావాదేవీలు జరగక ప్రభుత్వాదాయానికి గండి పడింది.
అభినందిస్తున్న ప్రజలు
పామూరు, నవంబరు 27 (ఆంధ్రజ్యోతి) : ఎంతో కాలంగా నిషేధిత జాబితాలో ఉన్న ఇళ్లు, స్థలాలకు ఎట్టకేలకు విముక్తి లభించింది. ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డి చొరవతో నిషేధిత జాబితా నుంచి వాటిని తొలగిస్తూ ఉత్తర్వులు వచ్చాయి. ఇప్పటిదాకా దేవదాయశాఖ అధికారుల నిర్లక్ష్యంతో నిషేధిత జాబితాలోకి ఇళ్లు, ఇంటి స్థలాలు, భూములు చేరడంతో స్థానికులు పలు అవస్థలు పడ్డారు. తమ ఇళ్లను, ఇంటి స్థలాలను నిషేధిత జాబితా నుంచి తొలగించాలని గత పాలకుల చుట్టూ ప్రదక్షిణలు చేసినా పట్టించుకొన్న పాపానపోలేదు. రిజిస్ర్టేషన్లు నిలిచిపోవడంతో పాటు లావాదేవీలు జరగక ప్రభుత్వాదాయానికి గండి పడింది. గడచిన సార్వత్రిక ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఎమ్మెల్యేగా ఉగ్రనరసింహారెడ్డి గెలుపొందారు. ప్రజల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని ఆయన విషయాన్ని సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. దీంతో బుధవారం నిషేధిత తొలగింపు ఉత్తర్వుల (ఎన్‌వోసీ)ఆర్డర్ కాపీని సంబంధిత శాఖ అధికారుల నుంచి తీసుకొని రావడంతో స్థానికులకు ఊరట లభించింది.
పామూరు పట్టణంలోని గ్రామ కంఠంలో గల 200 సర్వే నెంబర్‌లో 30.71 ఎకరాల భూమి ఉంది. ఆ భూమిలో స్థిరనివాసాలు నిర్మించుకొని సుమారుగా వివిధ సామాజిక వర్గాలకు చెందిన 3 వందల కుటుంబాల వారు జీవిస్తున్నారు. కాగా ఈ సర్వే నెంబర్‌లో శ్రీమదనవేణుగోపాలస్వామి, శ్రీవల్లీ భుజంగేశ్వరస్వామి, శ్రీ వరదరాజులస్వామి, శ్రీ ఆంజనేయస్వామి దేవస్థానాలకు సంబంధించిన భూమి ఉంది. 2016 వరకు రిజిస్ర్టేషన్లు, క్రయవిక్రయాలు సాఫీగా జరుగుతున్న తరుణంలో దేవదాయ శాఖ వారు 200 సర్వేనెంబర్‌ను ఎండో భూమిగా చూపిస్తూ నిషేధిత జాబితాలో చేర్చారు. అప్పటి నుంచి రిజిస్ర్టేషన్ల ప్రక్రియ నిలిచిపోయింది. దాంతో ఆస్తులున్నా అమ్ముకోలేని పరిస్థితి ఏర్పడింది. కొత్తగా గృహాలు నిర్మించుకోవాలనుకున్న వారు రుణాలకోసం బ్యాంకుల దగ్గరకు వెళితే ఆ భూములు ఎండోమెంట్ భూములుగా రికార్డుల్లో నమోదై ఉన్నాయని, తాము రుణాలు ఇవ్వలేమని తిప్పి పంపిస్తున్నారు. దాంతో పిల్లల వివాహాలకు, చదువులకు, ఇతర ఆర్థిక అవసరాలకు పలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో అల్లు వెంకటేశ్వర్లు సహకారంతో పట్టణానికి చెందిన రాచూరి మన్మథరావులు 200 సర్వేనెంబర్‌లోఉన్న మొత్తం భూమిని సబ్ డివిజన్ చేసి ఆ సర్వే నెంబర్‌ను నిషేధిత జాబితా నుంచి విముక్తి కలిగించి ఆన్‌లైన్ చేయాలని కలెక్టర్‌కు, ఎండోమెంట్ కమిషనర్, జిల్లాస్థాయి అధికారుల కార్యాలయాల చుట్టూ తిరిగినా అప్పటి పాలకులు పట్టించుకొన్న దాఖలాలు లేవు. ప్రస్తుత ఎమ్మెల్యే ఉగ్ర సహకారంతో ఎండోమెంట్ అధికారులు ఈ సర్వేనెంబర్‌ను నిషేధిత జాబితా నుంచి తొలగిస్తూ ఎన్‌వోసీ ఆర్డర్ కాపీ జారీ చేయించారు. దాంతో వారం రోజుల నుంచి కనిగిరి సబ్‌రిజిస్ర్టేషన్ కార్యాలయంలో క్రయ విక్రయాలు జరుగుతున్నాయి. దీంతో సమస్య పరిష్కారం కోసం కృషిచేసిన ఎమ్మెల్యే ఉగ్రను స్థానికులు అభినందించడంతో పాటు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Updated Date - Nov 27 , 2024 | 11:22 PM