క్రీడాకారులతో ఆడుకున్నారు!
ABN, Publish Date - Nov 10 , 2024 | 11:36 PM
జిల్లాలో క్రీడాకారులకు కొదువ లేదు. గ్రామీణ స్థాయి నుంచి జాతీయ స్థాయి వరకు వివిధ పోటీల్లో రాణించి అనేక మంది మట్టిలో మాణిక్యాల్లా మెరిశారు. పలు పతకాలతో జిల్లా ప్రతిష్ఠను ఇనుమడింపజేశారు. కానీ గత ఐదేళ్ల వైసీపీ పాలనలో క్రీడారంగం మసకబారింది. క్రీడాకారులకు ప్రోత్సాహం లేకపోవడం, అస్తవ్యస్త విధానాలు, అరకొర నిధుల కేటాయింపు అందుకు కారణమైంది. ఆటలపైనా నాటి ప్రభుత్వం ఫీ‘జులుం’ ప్రదర్శించింది. ‘పే అండ్ ప్లే’ విధానాన్ని ప్రవేశపెట్టి క్రీడాకారుల నుంచి రూ.లక్షలు దండుకొంది. ప్రాక్టీ్‌సకు అవసరమైన మైదానాలు అభివృద్ధికి నోచుకోకపోవడంతో క్రీడాకారులు చతికిలపడ్డారు. ఈనేపథ్యంలో కూటమి అధికారంలోకి రావడంతో ఆటల అభివృద్ధిపై ఆశలు పెంచుకున్నారు. ప్రభుత్వం మారి నాలుగు నెలలు కావస్తున్నా పే అండ్ ప్లే విధానం కొనసాగుతుండటంపై క్రీడాకారులు, కోచ్‌లు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
వైసీపీ పాలనలో క్రీడారంగం చతికిల
ఆటగాళ్లపై ఫీ‘జులు’ం
ప్రవేశ, నెలవారీ రుసుం నిర్ణయించి వసూళ్లు
మైదానాల గురించి పట్టించుకోని వైనం
గత టీడీపీ హయాంలో నిర్మించిన స్టేడియాలు నిరుపయోగం
కొన్నిచోట్ల ప్రైవేటు కార్యక్రమాలకు వేదికలుగా మారిన వైనం
పేఅండ్‌ప్లే రద్దు చేయాలని విజ్ఞప్తి
జిల్లాలో క్రీడాకారులకు కొదువ లేదు. గ్రామీణ స్థాయి నుంచి జాతీయ స్థాయి వరకు వివిధ పోటీల్లో రాణించి అనేక మంది మట్టిలో మాణిక్యాల్లా మెరిశారు. పలు పతకాలతో జిల్లా ప్రతిష్ఠను ఇనుమడింపజేశారు. కానీ గత ఐదేళ్ల వైసీపీ పాలనలో క్రీడారంగం మసకబారింది. క్రీడాకారులకు ప్రోత్సాహం లేకపోవడం, అస్తవ్యస్త విధానాలు, అరకొర నిధుల కేటాయింపు అందుకు కారణమైంది. ఆటలపైనా నాటి ప్రభుత్వం ఫీ‘జులుం’ ప్రదర్శించింది. ‘పే అండ్ ప్లే’ విధానాన్ని ప్రవేశపెట్టి క్రీడాకారుల నుంచి రూ.లక్షలు దండుకొంది. ప్రాక్టీ్‌సకు అవసరమైన మైదానాలు అభివృద్ధికి నోచుకోకపోవడంతో క్రీడాకారులు చతికిలపడ్డారు. ఈనేపథ్యంలో కూటమి అధికారంలోకి రావడంతో ఆటల అభివృద్ధిపై ఆశలు పెంచుకున్నారు. ప్రభుత్వం మారి నాలుగు నెలలు కావస్తున్నా పే అండ్ ప్లే విధానం కొనసాగుతుండటంపై క్రీడాకారులు, కోచ్‌లు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
ఒంగోలు (కార్పొరేషన్), నవంబరు 10 : క్రీడాకారులతో గత వైసీపీ పాలకులు ఆటలాడుకున్నారు. క్రీడల అభివృద్ధిని విస్మరించారు. ఆటలనే ఆదాయమార్గంగా మార్చుకున్నారు. ‘పే అండ్ ప్లే’ విధానాన్ని తీసుకొచ్చి ప్రవేశ, ప్రాక్టీసు ఫీజులు వసూలు చేశారు. కోచ్‌లకు టార్గెట్లు నిర్ణయించి ఆమేరకు క్రీడాకారులను రప్పించాలని హుకుం జారీ చేశారు. ఆటగాళ్ల నుంచి వసూలు చేసిన నిధులకు లెక్కాపత్రం లేదు. ప్రభుత్వం నుంచి ప్రోత్సాహం లభించక, అవసరమైన మైదానాలు లేక ఐదేళ్లుగా జిల్లాలో క్రీడారంగం పరాజయం బాటన నడిచింది.
యూజర్ చార్జీల పేరుతో శాప్ వసూళ్ల పర్వం
వైసీపీ అధికారంలోకి రాకముందు వరకు టీడీపీ పాలనలో క్రీడారంగం విజయం వైపు దూసుకెళ్లింది. గ్రామీణ క్రీడాకారులను ప్రోత్సహించడంతోపాటు, నియోజకవర్గాల వారీగా మినీ స్టేడియాల నిర్మాణానికి చర్యలు చేపట్టింది. జిల్లా కేంద్రమైన ఒంగోలులో దాదాపు రూ.2కోట్లకు పైగా ఖర్చు చేసి స్టేడియం నిర్మించారు. అయితే వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ మైదానంలో అడుగు పెట్టాలంటే ఓ రేటు, అడ్మిషన్ పొందాలంటే మరో రేటు, శిక్షణ పొందాలంటే నెల వారీ ఫీజు చెల్లించాల్సి వచ్చింది. గత ప్రభుత్వంలో శాప్ యూజర్ చార్జీలు అంటూ ఇలాంటి అడ్డగోలు నిర్ణయాలు తీసుకోవడంతో క్రీడారంగం ఓటమిపాలైంది.
పోటీలు, పతకాలు కరువు
జిల్లాలోని పలు పాఠశాలల విద్యార్థులు, ప్రభుత్వ హాస్టల్స్‌లో ఉండే బాల, బాలికలు వారికి సమీపంలో ఉన్న మైదానాల్లో శిక్షణ పొందుతుంటారు. వ్యాయామోపాధ్యాయులు క్రీడలపట్ల ఆసక్తి కలిగిన విద్యార్థులకు శిక్షణ అందించి ఎంపిక చేస్తారు. అత్యధికశాతం మంది గ్రామీణ ప్రాంత, పేద, క్రీడాకారులే ఉంటారు. అయితే 2019 సంవత్సరం వరకు వారు పైసా చెల్లించకుండానే అందుబాటులో ఉన్న మైదానాలు, కోచ్‌లు, ఆట పరికరాలతో శిక్షణ పొందిన గ్రామీణ స్థాయి నుంచి జాతీయ స్థాయికి ఎదిగారు. అయితే ఆతర్వాత అధికారంలోకి వచ్చిన వైసీపీ పాలకులు వారితో ఇష్టారాజ్యంగా ఆడుకున్నారు. అవసరమైన నిధులు కేటాయించకుండా పోటీల నిర్వహణకు దాతల సహకారంతో నిర్వహించుకోవాలని, క్రీడాకారుల నుంచి ఫీజులు వసూలు చేయాలని ఉత్వర్వులు జారీ చేశారు. దీంతో నాలుగున్నరేళ్లుగా పోటీలు లేకపోవడంతో పతకాలు కూడా కరువయ్యాయి.
ప్రైవేటు కార్యక్రమాలకు వేదికగా మినీ స్టేడియం
జిల్లాలో క్రీడాకారులను ప్రోత్సహించేందుకు 2014లో అప్పటి టీడీపీ ప్రభుత్వం మినీ స్టేడియంల నిర్మాణాలు చేపట్టింది. ఒంగోలులో క్రీడామైదానం కోసం ఒంగోలుకు చెందిన పర్వతరెడ్డి ఆనంద్ రూ.1కోటి విరాళంగా ఇవ్వగా, ఆతర్వాత ప్రభుత్వం అదనంగా రూ.కోటికిపైన కేటాయించింది. అయితే షటిల్ బ్యాడ్మింటన్, టెన్నిస్, ఫుట్‌బాల్, వాలీబాల్, అథ్లెటిక్స్‌లో శిక్షణకు అవసరమైన చర్యలు చేపట్టి అందుబాటులోకి తీసుకొచ్చింది. అయితే ప్రస్తుతం అది పేరుకు మాత్రమే అన్నట్లు ఉంది. మైదానంలో పోటీల నిర్వహణకు పలు క్రీడా సంఘాలు విన్నవించుకున్నప్పటికీ సంబంధిత శాఖ అధికారులు, చీఫ్ కోచ్‌లు ఫీజులు డిమాండ్ చేస్తున్నారు. దీంతో చేసేదేమీ లేక నగరపాలక సంస్థ పాఠశాలలకు చెందిన క్రీడామైదానాలలో నిర్వహించుకుంటున్నట్లు పలువురు కోచ్‌లు, వ్యాయామోపాధ్యాయులు వాపోతున్నారు. ఇదిలా ఉంచితే ఈ మైదానం ఇప్పుడు ప్రైవేటు కార్యక్రమాలకు వేదికగా మారింది. అత్యధిక జనాభా పట్టే ఆ మైదానంలో ఒకరోజుకు సుమారు రూ.20వేల నుంచి 25వేలు వసూలు చేస్తుండటంపై క్రీడా సంఘాలు విస్మయం వ్యక్తం చేస్తున్నాయి.
కోచ్‌లపై అదనపు భారం
క్రీడాప్రాధికార సంస్థకు చెందిన కోచ్‌లు నిత్యం సంబంధిత ఆటల్లో శిక్షణ ఇవ్వాలి. పే అండ్ ప్లే విధానంతో ఫొటోలు అప్‌లోడ్, యాప్‌లలో సాధించిన ప్రగతిని ఉదయం, సాయంత్రం తెలియజేయాల్సి వస్తోంది. దీనికితోడు క్రీడాకారుల వద్ద నుంచి ఫీజులు వసూలు చేయడంతోపాటు, పాఠశాలలు, కళాశాలలు నగదు చెల్లించి తిరిగి క్రీడాకారుల స్టేడియానికి వచ్చేలా మరో అదనపు పనిభారాన్ని మోపారు. దీంతో వారు తలలు పట్టుకుంటున్నారు. ఫీజు చెల్లించలేని విద్యార్థుల ఫీజులను కూడా కోచ్‌లు భరించాల్సిందేనని ఇక్కడి జిల్లా క్రీడాప్రాధికార సంస్థ అధికారులు ఆదేశించడంతో అదనపు భారం మోయాల్సి వస్తోంది. ఈ నేపథ్యంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో క్రీడాభివృద్ధిపై ఆశలు పెంచుకున్నారు. కానీ ఇప్పటి వరకూ పే అండ్ ప్లే విధానాన్ని రద్దు చేయకపోవడంపై వారు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. వెంటనే ఆ విధానాన్ని తొలగించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఆటల అభివృద్ధికి తోడ్పాటు అందించడంతోపాటు, మైదానాల మెరుగుపై ప్రత్యేక దృష్టి సారించాలని క్రీడాకారులు, కోచ్‌లు, విద్యార్థులు కోరుతున్నారు.
Updated Date - Nov 10 , 2024 | 11:36 PM