చర్యలకు సిద్ధం
ABN, Publish Date - Nov 06 , 2024 | 01:15 AM
జిల్లా కేంద్ర సహకార బ్యాంకులో చోటుచేసుకున్న అక్రమాల వ్యవహారంపై చర్యలకు రంగం సిద్ధమవుతోంది. అందుకు సంబంధించి మంగళవారం పలు పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఈ అక్రమాలపై ఏకంగా సెక్షన్ 51 విచారణ వేసే వైపు ఉన్నతస్థాయిలో అడుగులు పడుతున్నాయి.
సీఎంవో ఆదేశాలతో కదిలిన సహకార శాఖ అధికారులు
డీసీసీబీ వ్యవహారంలో రోజంతా హైడ్రామా
సీఈవో రాజీనామా!
సెక్షన్ 51 విచారణ వైపు అడుగులు
ఒంగోలు, నవంబరు 5 (ఆంధ్రజ్యోతి): జిల్లా కేంద్ర సహకార బ్యాంకులో చోటుచేసుకున్న అక్రమాల వ్యవహారంపై చర్యలకు రంగం సిద్ధమవుతోంది. అందుకు సంబంధించి మంగళవారం పలు పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఈ అక్రమాలపై ఏకంగా సెక్షన్ 51 విచారణ వేసే వైపు ఉన్నతస్థాయిలో అడుగులు పడుతున్నాయి. అదేసమయంలో స్థానికంగా బ్యాంకు పర్సన్ ఇన్‌చార్జి నేతృత్వంలోని పాలకమండలి దిద్దుబాటు చర్యలను వేగవంతం చేసింది. వారి ఆదేశాల మేరకు బ్యాంకు సీఈవో కోటిరెడ్డి మంగళవారం రాత్రి రాజీనామా చేసినట్లు తెలిసింది. అయితే ఈ విషయంలో రోజంతా పెద్ద హైడ్రామానే చోటుచేసుకున్నట్లు సమాచారం. బ్యాంకులో అక్రమాలపై విచారణ నేపథ్యంలో సీఈవోను బాధ్యతల నుంచి తప్పించడంతోపాటు సమగ్ర విచారణ కోసం సెక్షన్ 51 విచారణ కోరుతూ కలెక్టర్ రాసిన లేఖలపై సకాలంలో అటు ఉన్నత స్థాయిలో, ఇటు బ్యాంకు పాలక మండలి నుంచి చర్యలు లేని విషయాన్ని ‘ఆంధ్రజ్యోతి’ బహిర్గతం చేసిన విషయం విదితమే. ఇందుకు సంబంధించిన వరుస కథనాలు రాష్ట్ర, జిల్లాస్థాయి అధికారులు, ప్రభుత్వ పెద్దలలో విస్తృత చర్చకు దారితీశాయి. విషయం నేరుగా ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి వెళ్లింది. దీంతో సీఎం కార్యాలయం కూడా దీనిపై దృష్టి సారించింది. అలాగే సోమవారం కూడా డీఆర్సీ సమావేశానికి వచ్చిన ఇన్‌చార్జి మంత్రి ఆనం రామనారాయణరెడ్డి కూడా ఈ వ్యవహారంపై జిల్లా ఉన్నతాఽధికారులతో మాట్లాడి తక్షణ చర్యలకు సూచించారు.
పాలకమండలి సమావేశంలో..
ఆ నేపథ్యంలో మంగళవారం బ్యాంకు పాలకమండలి సమావేశం పర్సన్ ఇన్‌చార్జీ అయిన జేసీ గోపాలకృష్ణ నేతృత్వంలో మంగళవారం బ్యాంకులో జరిగింది. కలెక్టర్ సూచనల మేరకు సీఈవో విషయంపై చర్చ కోసం ఆ మీటింగ్ నిర్వహించినా అందులో తక్షణం ఎలాంటి నిర్ణయం తీసుకోలేకపోయారు. సీఈవోను తొలగించడం కన్నా ఆయనే రాజీనామా చేస్తే బాగుటుందన్న భావనతో పర్సన్ ఇన్‌చార్జీ సూచనలతో బ్యాంకు అధికారులు పలుమార్లు సీఈవోతో సంప్రదింపులు చేసినట్లు సమాచారం. ఈ విషయంలో రోజంతా హైడ్రామా జరగ్గా ఎట్టకేలకు రాత్రి సమయానికి సీఈవో తన రాజీనామాను పీఏసీ చైర్మన్‌కు ఇచ్చినట్లు తెలిసింది. అయితే దానిని ధ్రువీకరించి చెప్పేందుకు బ్యాంకు ప్రస్తుత అధికారులు ధైర్యం చేయడం లేదు. మొత్తం మీద సీఈవో కోటిరెడ్డి రాజీనామా చేసినట్లు సహకార బ్యాంకు ఉద్యోగులలో రాత్రి పొద్దుపోయాక విస్తృత చర్చ సాగింది. ఆ విషయం అలా ఉంచితే బ్యాంకులో అక్రమాలు, కలెక్టర్ రాసిన లేఖలపై ఉన్నతాధికారులు సకాలంలో స్పందించని విషయం సీఎం దృష్టికి వెళ్లింది. దీంతో ప్రస్తుత సహకార శాఖ రాష్ట్రస్థాయి ఉన్నతాధికారులు కదిలారు. బ్యాంకులో అక్రమాలను నిగ్గుతేల్చేందుకు సెక్షన్ 51 విచారణ వైపు మొగ్గుచూపుతున్నట్లు సమాచారం. ఇందుకు సంబంధించి ఉన్నతాధికారులు పలు విషయాలపై మంగళవారం కలెక్టర్ అన్సారియాతో మాట్లాడినట్లు తెలిసింది. ఫిర్యాదులో పేర్కొన్న అంశాలపై ప్రాథమిక నివేదిక ఇవ్వాలని కలెక్టర్‌కు వారు సూచించినట్లు తెలిసింది. ఆ నివేదిక ఆధారంగా సెక్షన్ 51 విచారణ వేసే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం.
Updated Date - Nov 06 , 2024 | 01:15 AM