ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

రీసర్వే సంకటం

ABN, Publish Date - Nov 30 , 2024 | 01:36 AM

రీసర్వే ప్రక్రియ పూర్తయినగ్రామాల్లో రైతులకు కొత్త కష్టాలు వచ్చిపడ్డాయి. ఆ కార్యక్రమంతో భూములపై పారదర్శకత వస్తుందని, వివాదాలు సమసిపోతాయని గత వైసీపీ ప్రభుత్వ పెద్దలు హడావుడి చేయగా, వాస్తవంలో మాత్రం అందుకు విరుద్ధమైన పరిస్థితులు నెలకొన్నాయి. అంతా అస్తవ్యస్తంగా తయారైంది.

కారుమానుపల్లి గ్రామ సభలో అర్జీలు స్వీకరిస్తున్న అధికారులు (ఫైల్‌)

ఆయా గ్రామాల్లో వేధిస్తున్న సమస్యలు

మూడేళ్లుగా నిలిచిపోయిన రిజిస్ట్రేషన్‌లు

క్రయవిక్రయాలు ఆగిపోవడంతో అవస్థలు పడుతున్న గ్రామస్థులు

పథకాలకు దూరమవుతున్న రైతులు

బ్యాంకుల్లో రుణాలు కూడా పొందలేని దుస్థితి

గ్రామసభలు నిర్వహించినా పరిష్కారం శూన్యం

ఈ రైతు పేరు రాయ ఈశ్వరరెడ్డి. తర్లుపాడు మండలం కారుమానుపల్లి గ్రామానికి చెందిన ఈయనకు వారసత్వంగా రెండెకరాలు వచ్చింది. ఆ భూమిలో మూడేళ్ల నుంచి మిరప సాగు చేశారు. కాలం కలిసి రాకపోవడంతో రూ.2లక్షల మేర నష్టపోయారు. అప్పులు తీర్చేందుకు పొలం అమ్ముదామని ప్రయత్నిస్తే ఎవరూ కొనడం లేదు. రీసర్వే జరిగిన గ్రామం కావడంతో రిజిస్ట్రేషన్లు నిలిచిపోయాయి. అటు పొలం అమ్ముకోలేక, ఇటు అప్పులు తీర్చలేక తీవ్ర మనోవేదనలో కొట్టుమిట్టాడుతున్నారు.

ఈయన పేరు పిన్నిక శ్రీనివాసులు. మార్కాపురం మండలం శివరాంపురంలో ఈయనకు 2.10 ఎకరాల పొలం ఉంది. ఆ గ్రామంలో పైలట్‌ ప్రాజెక్టుగా తొలుత రీసర్వే చేశారు. ఆయన పొలం పక్కనే ఉన్న బంధువులకు చెందిన ఎకరం భూమిని రెండేళ్ల క్రితం కొన్నాడు. రిజిస్ట్రేషన్‌ చేయించుకొనేందుకు కార్యాలయానికి వెళ్తే చుక్కెదురైంది. మీ గ్రామంలోని భూములు ఆన్‌లైన్‌లో చూపడం లేదు కాబట్టి రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ కష్టమని అధికారులు చెప్పారు. కొన్న భూమిని రిజిస్ట్రేషన్‌ చేయించుకోలేక శ్రీనివాసులు అవస్థలు పడుతున్నారు.

ఇదీ జిల్లాలో రీసర్వే చేసిన గ్రామాల్లో పరిస్థితి. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో నిర్వహించిన భూముల రీసర్వే ప్రక్రియ నేడు ప్రజలకు శాపంగా మారింది. నాలుగు దశల్లో చేపట్టిన ఈ కార్యక్రమంతో రైతుల కష్టాలు తీరకపోగా పలు నూతన సమస్యలు ఎదురవుతున్నాయి. మూడు సంవత్సరాల నుంచి అవన్నీ అపరిష్కృతంగానే ఉన్నాయి. ఏ మాత్రం తేడా ఉన్నా ఆయా భూములు ఆన్‌లైన్‌లో కనిపించడం లేదు. దీంతో రిజిస్ర్టేషన్లు కావడం లేదు. అలాగే పథకాలకు ఇబ్బందిగా మారింది. రుణాలు అందడం లేదు. ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం స్పందించి వెంటనే సమస్యను పరిష్కరించాలని రైతులు కోరుతున్నారు.

మార్కాపురం, నవంబరు 28 (ఆంధ్రజ్యోతి): రీసర్వే ప్రక్రియ పూర్తయినగ్రామాల్లో రైతులకు కొత్త కష్టాలు వచ్చిపడ్డాయి. ఆ కార్యక్రమంతో భూములపై పారదర్శకత వస్తుందని, వివాదాలు సమసిపోతాయని గత వైసీపీ ప్రభుత్వ పెద్దలు హడావుడి చేయగా, వాస్తవంలో మాత్రం అందుకు విరుద్ధమైన పరిస్థితులు నెలకొన్నాయి. అంతా అస్తవ్యస్తంగా తయారైంది. ఏమీ చేయలేక అధికారులు ఆన్‌లైన్‌ను ఆపేశారు. దీంతో భూముల క్రయవిక్రయాలు నిలిచిపోయాయి. భూములు అమ్ముకోవాలనుకునే వాళ్లు, ఇప్పటికే విక్రయించిన వాళ్లు రిజిస్ట్రేషన్‌లు నిలిచిపోవడంతో అవస్థలు పడుతున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కొన్ని సడలింపులు ఇచ్చి రీసర్వే జరిగిన గ్రామాల్లో రిజిస్ట్రేషన్లకు అనుమతులిచ్చింది. కొద్దిరోజులపాటు మాత్రమే రిజిస్ట్రేషన్లు చేశారు. అయితే ఇతర జిల్లాల్లో యథావిధిగానే జరుగుతున్నా, రెండు మాసాల నుంచి మన జిల్లాలో మాత్రం రిజిస్ట్రేషన్లు నిలిపేశారు. పలు రకాలైన సాంకేతిక కారణాలను చూపి ఆ శాఖాధికారులు క్రయవిక్రయదారులకు మొండిచేయి చూపుతున్నారు. దీంతో జిల్లాలో రీసర్వే జరిగిన గ్రామాల్లోని ప్రజలు లబోదిబోమంటున్నారు.

ఎల్‌పీ నంబర్లపై నిలిచిన రిజిస్ట్రేషన్‌లు

రీసర్వే జరిగిన గ్రామాల్లో సర్వే నంబర్లకు బదులు నూతనంగా ఎల్‌పీ(ల్యాండ్‌ పార్శిల్‌) నంబర్‌ను గత ప్రభుత్వం ఆన్‌లైన్‌లలో ఉంచింది. ఈ నూతన ప్రక్రియతో పలు రకాలైన చిక్కులు ఏర్పడ్డాయి. ఒక సర్వే నంబర్‌లో పలు సబ్‌ డివిజన్‌లు ఉన్నా చాలాచోట్ల అన్నింటికీ కలిపి ఒకే ఎల్‌పీ నంబర్‌ కేటాయించారు. అందులో ఒకరు భూమి అమ్ముకోవాలన్నా, అందరి భూ విస్తీర్ణం చూపుతోంది. దీంతో రిజిస్ట్రేషన్ల సమయంలో అయోమయ పరిస్థితులు తలెత్తుతున్నాయి. గతంలో మాదిరి సర్వే నంబర్లపై రిజిస్ట్రేషన్‌లు చేయాలంటే వెబ్‌ల్యాండ్‌లో నిషేధిత భూముల జాబితాలో ఆయా నంబర్లను చూపుతున్నారు. దీంతో ఏ సమస్య లేని భూముల్లో కూడా రిజిస్ట్రేషన్లు చేయడం కుదరడం లేదు. రిజిస్ట్రేషన్‌ ప్రక్రియలో భాగంగా స్లాట్‌ బుక్‌ చేసుకున్న తర్వాత ఎల్‌పీ నంబర్‌ నమోదు చేస్తే రిజెక్ట్‌ చేస్తోంది. సాంకేతిక సమస్యలను పరిష్కరించేందుకు ఎవరూ చొరవ చూపకపోవడంతో రీసర్వే గ్రామాల్లోని ప్రజలు ఏం చేయాలో తెలియక తీవ్ర ఆవేదనకు గురికావాల్సి వస్తోంది.


బ్యాంకుల్లో రుణాలకు చుక్కెదురు

రీసర్వే గ్రామాల ప్రజలు భూమి తనఖా పెట్టి బ్యాంకుల్లో రుణాలు తీసుకోవాలన్నా కుదరడం లేదు. బ్యాంకులో రుణం పొందాలంటే పట్టాదారు పాస్‌బుక్‌తోపాటు 1బీ, అడంగల్‌ తప్పనిసరి. పాస్‌బుక్‌ ఉన్నా వెబ్‌ల్యాండ్‌ నుంచి 1బీ, అడంగల్‌లు రావడం లేదు. చివరికి కొందరు బ్యాంకర్లు చొరవ తీసుకుని తహసీల్దార్‌ నుంచి మాన్యువల్‌గా తెచ్చుకోండి రుణాలిస్తామన్నా.. రెవెన్యూ అధికారులు అందుకు సహకరించడం లేదు. అంతేకాక ఇప్పటికే రుణాలు తీసుకొని ఉన్న రైతులు కూడా పలు రకాలైన అవస్థలు పడుతున్నారు. ప్రతి సంవత్సరం రైతులు వడ్డీ చెల్లించి రుణాలను రీషెడ్యూల్‌ చేసుకునే వెసులుబాటు ఉంది. కానీ ఎప్పటికప్పుడు 1బీ, అడంగల్‌లు బ్యాంకుకు సమర్పించాలి. వెబ్‌ల్యాండ్‌ నుంచి అవి రాకపోవడంతో రుణాలను రీషెడ్యూల్‌ చేసుకోలేని పరిస్థితి ఏర్పడింది. దీంతో చాలామంది ఏళ్లుగా తీసుకున్న రుణాలకు వడ్డీలు కూడా చెల్లించకపోవడంతో డిఫాల్టర్ల జాబితాలో చేరుతున్నారు.

గ్రామసభలు పెట్టినా ఫలితం శూన్యం

రీసర్వే చేసిన గ్రామాల్లో ఎక్కువగా తప్పులు దొర్లాయి. ప్రజల నుంచి ఈ విషయమై రెవెన్యూ అధికారులకు పెద్దఎత్తున ఫిర్యాదులు అందాయి. దీంతో నూతన ప్రభుత్వం గత నెలలో గ్రామసభలు నిర్వహించి అర్జీలు స్వీకరించింది. ప్రతి గ్రామంలోనూ సుమారు 80శాతం మేర తప్పులు దొర్లాయని వాటిని సరిచేయాలని ప్రజలు అర్జీలు అందజేశారు. అంతవరకు బాగానే ఉన్నా తప్పులను సరిచేయడానికి వెబ్‌ల్యాండ్‌ సైట్‌ ఓపెన్‌ కావడం లేదు. తహసీల్దార్‌లకు లాగిన్‌ ఇవ్వకపోవడంతో అర్జీలను పరిష్కరించలేని దుస్థితి ఏర్పడింది. ప్రభుత్వం ఈ విషయంపై దృష్టిసారించి రీసర్వే జరిగిన గ్రామాల ప్రజల కష్టాలను పరిష్కరించాలని కోరుతున్నారు.

Updated Date - Nov 30 , 2024 | 01:36 AM