సార్.. అంబులెన్స్ కావాలి.. గంట ఆగండి!
ABN, Publish Date - Nov 05 , 2024 | 11:38 PM
అత్యవసరమైతే 108కి ఫోన్ చేస్తే ఆగమేఘాల్లో వచ్చి రోగిని ఆసుపత్రికి తీసుకెళ్తుంది.. ఇది అంబులెన్స్ పని.. కానీ అంబులెన్స్‌కు కావాలని ఫోన్ చేస్తే గంట ఆగాలని అటునుంచి సమాధానం వస్తుంది. దీంతో చేసేది లేక ప్రైవేటు వాహనాలను ఆశ్రయించాల్సిన దుస్థితి ఉంది.
అందుబాటులో లేని 108
సరిపడా వాహనాలు లేక అత్యవసర రోగుల అవస్థలు
రిఫర్‌లతో చేతులు దులుపుకుంటున్న ఏరియా వైద్యశాల వైద్యులు
నిత్యం చీరాల నుంచి 6- 10 కేసులు
మార్గమఽధ్యలోనే కాన్పులు
అధికారులు పట్టించుకోవాలని ఆవేదన
చీరాలటౌన్, నవంబరు5 (ఆంధ్రజ్యోతి) : అత్యవసరమైతే 108కి ఫోన్ చేస్తే ఆగమేఘాల్లో వచ్చి రోగిని ఆసుపత్రికి తీసుకెళ్తుంది.. ఇది అంబులెన్స్ పని.. కానీ అంబులెన్స్‌కు కావాలని ఫోన్ చేస్తే గంట ఆగాలని అటునుంచి సమాధానం వస్తుంది. దీంతో చేసేది లేక ప్రైవేటు వాహనాలను ఆశ్రయించాల్సిన దుస్థితి ఉంది.
చీరాల ఏరియా వైద్యశాల 100 పడకల హాస్పిటల్‌గా రూపాంతరం చెంది నిత్యం రోగులతో బిజీబిజీగా మారింది. ఇక్కడికి మార్టూరు, ఉప్పుగుండూరు, చినగంజాం, పెదగంజాం, నాగులుప్పలపాడుకు చెందిన రోగులు నిత్యం అత్యవసర, సాధారణ వైద్య సేవల కోసం పెద్ద సంఖ్యలో వస్తున్నారు. జాతీయ రహదారితోపాటు వాహనాల రద్దీ పెరగడంతో ప్రమాదాలు అధిక సంఖ్యలో జరుగుతున్నాయి. దీంతో అత్యవసర సేవలకు గిరాకీ బాగానే పెరిగింది. ఏరియా హాస్పిటల్‌కు వచ్చే గర్భిణులు, రోడ్డు ప్రమాదాలకు సంబంధిం చి వైద్యులు ప్రతిసారీ ఇతర ఆసుపత్రిలకు (రిఫర్) పంపిస్తూ చేతులు దులపుకుంటున్నారన్న ఆరోపణలు విన్పిస్తున్నాయి. చేసేది లేక గర్భిణులు సైతం ఒంగోలుకు వెళుతూ మార్గమధ్యలోనే కాన్పు అవుతున్నారు. పీహెచ్‌సీల్లోనే కాన్పులు జరగాలని ఒకపక్క అధికారులు సూచిస్తుంటే, ఏరియా హాస్పిటల్ మా త్రం చిన్నవాటికి కూడా రిఫర్ చేయడంపై రోగులు, వారి బంధువులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రిఫర్ రాయగానే సమస్య పెద్దదని రోగులు ఆందోళన చెందుతూ ప్రాణాలమీదికి తెచ్చుకుంటున్నారు.
అందుబాటులో లేని 108
ప్రస్తుతం చీరాల ఏరియా వైద్యశాల పరిధిలో చీరాలకు ఒకటి, వేటపాలెం 1, కా రంచేడుకు ఒక 108 వాహనాలు ఉన్నా యి. అంతకుముందే హాస్పిటల్‌కు అత్యవసర పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని ఏర్పాటు చేసిన అదనపు వాహనం చాలాకాలంగా మూలనపడింది. అంతకు ముందు మరో వాహనం కూడా మరమ్మతులకు చేరడంతో ప్రస్తుతం హాస్పిటల్‌లో రెండు నిరుపయోగంగా ఉన్నాయి. వాడకంలో ఉన్న వాహనాలు కూడా అంతంత మా త్రంగానే నడుస్తున్నాయి. ఈక్రమంలో అత్యవసర వైద్యం కోసం రోగులు 108ని సంప్రదిస్తే వారికి వినబడే స్వరం ఒక్కటే సుమారు గంట పడుతుంది ఉండగలా...దీంతో ప్రజలు అత్యవసర సమయాల్లో ఆందోళనకు గురవుతున్నారు. మరోవైపు హాస్పిటల్ వైద్యులు నిర్లక్ష్యంతో కొన్నిసార్లు వాహనాలు రిఫర్‌లో ఉంటున్నాయి. ఈక్రమంలో అత్యవసర వైద్యం కోసం ఆశ్రయించిన రోగులకు 108 అంబులెన్స్ సేవలు అందడం లేదు. ఈక్రమంలో వైద్యుల నిర్వాకంపై దృష్టిసారించాలని, మరమ్మతులు చేసి వాహనాలను అందుబాటులోకి తేవాలని రోగుల బంధువులు కోరుతున్నారు.
Updated Date - Nov 05 , 2024 | 11:38 PM