త్వరలో వెలిగొండను పూర్తిచేస్తాం
ABN, Publish Date - Nov 04 , 2024 | 11:50 PM
జిల్లా అభివృద్ధికి దోహదపడే వెలిగొండ ప్రాజెక్టును త్వరితగతిన పూర్తిచేస్తామని ఇన్‌చార్జి మంత్రి ఆనం రామనారాయణరెడ్డి పేర్కొన్నారు. ప్రజలకు సాగు, తాగునీటికి ఇబ్బందులు లేకుండా అవసరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు.
జిల్లా అభివృద్ధిపై సానుకూల దృక్పథంతో చర్చించాం
సాగు, తాగునీటికి ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకుంటాం
భూముల అక్రమాలపై సిట్ నివేదిక వచ్చాక చర్యలు
జిల్లాలో ఆలయ భూములను కాపాడే దిశగా చర్యలు
జిల్లా ఇన్‌చార్జి మంత్రి రామనారాయణరెడ్డి
ఒంగోలు కలెక్టరేట్, నవంబరు 4 (ఆంధ్రజ్యోతి) : జిల్లా అభివృద్ధికి దోహదపడే వెలిగొండ ప్రాజెక్టును త్వరితగతిన పూర్తిచేస్తామని ఇన్‌చార్జి మంత్రి ఆనం రామనారాయణరెడ్డి పేర్కొన్నారు. ప్రజలకు సాగు, తాగునీటికి ఇబ్బందులు లేకుండా అవసరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. డీఆర్సీ సమావేశం అనంతరం కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సమావేశాన్ని జిల్లా అభివృద్ధికి దోహదపడే విధంగా రాజకీయాలకతీతంగా నిర్వహించామన్నారు. ప్రధానంగా వెలిగొండ, రామతీర్థం, గుండ్లకమ్మ ప్రాజెక్టులకు సంబంధించిన పలు అంశాలను ఎమ్మెల్యేలు సమావేశం దృష్టికి తెచ్చారన్నారు. వెలిగొండను మరోసారి తాను సందర్శించి దాన్ని సకాలంలో పూర్తిచేసేందుకు తీసుకోవాల్సి న అంశాలను తెలుసుకొని ప్ర భుత్వం దృష్టికి తీసుకెళ్తానని తెలిపారు. వెలిగొండ పూర్తయితే నెల్లూరు జిల్లాలోని ఉదయగిరి, ఆత్మకూరు నియోజకవర్గాలకు నీరందుతుందన్నా రు. ప్రకాశం జిల్లా పూర్తిగా వర్షాధారంపై ఆధారపడి ఉం దని, రైతులందరూ అభివృద్ధి చెందాలంటే వెంటనే ప్రాజెక్టులనుపూర్తిచేయాల్సిందేనన్నారు.
ఒంగోలు జాతి పశు సంపదను కాపాడుతాం
అంతరించిపోతున్న ఒంగోలు జాతి పశుసంపదను కాపాడుకునే దిశగా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. చదలవాడ పశుక్షేత్రంపై చర్చించి అందుకు అవసరమైన నిధులు సమకూర్చుతామని హామీ ఇచ్చారు. జిల్లాలో ఒక్కో మండలానికి 50 గోకులాలను మంజూరుచేయాలని సమావేశంలో ఆదేశాలు జారీచేశామని తెలిపారు. రాష్ట్రంలో అవు నెయ్యికి డిమాండ్ ఉందన్నారు. జిల్లాలో అవులను పెంచేందుకు చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. గోవులను పెంచుకోనేందుకు మరింత సబ్సిడీ ఇచ్చే విధంగా ప్రభుత్వంతో చర్చిస్తామన్నారు. తమిళనాడు నుంచి హైస్పీడు మరబోట్లు వల్ల వలలు దెబ్బతింటున్నాయని, అలాగే మత్స్యసంపదను తమిళనాడుకు తరలించుకెళ్తున్న వ్యవహారంపై చర్చించామన్నారు. దీనిపై సమగ్ర నివేదికను ప్రభుత్వానికి పంపించి తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.
సిట్ నివేదిక రాగానే చర్యలు
జిల్లాలో కొన్నిప్రాంతాల్లో భూముల రికార్డులు మారయని, దీనిపై ఇప్పటికే సిట్ విచారణ జరిగిందని ఆనం తెలిపారు. ఆ నివేదిక వారంరోజుల్లో అందుతుందని, ఆ వెంటనే చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. దేవదాయశాఖ పరిధిలో జిల్లాలో 890 ఆలయాలు, ధార్మిక సంస్థలు మొత్తం 1001 ఉన్నాయన్నారు. ఈ ఆలయాన్నింటికీ కమిటీలు వేస్తామని వెల్లడించారు. శ్రీవాణి ట్రస్టు కింద 65 ఆలయాలు మంజూరయ్యాయని, ఆ పనులు వివిధ దశలలో ఉన్నాయన్నారరు. ఆలయాల ఆస్తులను కాపాడుకునేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని స్పష్టం చేశారు. జిల్లాలో ఆలయాలకు చెందిన 17వేల ఎకరాలు లీజుకు ఇవ్వగా 14వేల ఎకరాలు అన్యాక్రాంతమైందన్నారు. సమావేశంలో మంత్రి డాక్టర్ స్వామి, ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి, కలెక్టర్ తమీమ్ అన్సారియా పాల్గొన్నారు. సమావేశంలో జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ, ఎస్పీ దామోదర్, మార్కాపురం సబ్ కలెక్టర్ సహదీత్ వెంకటత్రివినాగ్, డీఆర్వో చిన్న ఓబులేషుతో పాటు వివిధ శాఖల అధికారులు ఉన్నారు.
రోడ్ల కోసం మరో రూ.11కోట్లు
జిల్లాలో గోతులు లేని రహదారులను ఏర్పాటు చేయడమే లక్ష్యంగా మొదటి విడతలో రూ11.50 కోట్లతో పనులు చేపట్టారన్నారు. రెండో విడతలో మరో రూ.11 కోట్లు రానున్నాయని ఇన్‌చార్జి మంత్రి ఆనం వెల్లడించారు. పంచాయతీరాజ్ రోడ్లను కూడా అదేవిధంగా అభివృద్ధి చేయాలని సమావేశంలో నిర్ణయం తీసుకున్నామని వివరించారు. గత వైసీపీ ప్రభుత్వం గోతులను వారసత్వ సంపదగా ఇచ్చిందన్నారు. వాటిని తమ బాధ్యతగా తీసుకొని అన్ని రోడ్లువేసే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు. ఒంగోలులో మూడు రోజులకు ఒకసారి మంచినీరు ఇస్తున్నారని, ప్రతిరోజూ నీరు ఇవ్వడమే ప్రభుత్వ సంకల్పమని చెప్పారు. అందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. హైవేల పరిఽధిలోని దోర్నాల నుంచి శ్రీశైలం వెళ్లే రహదారి సరిగా లేదని చర్చకు వచ్చిన వెంటనే నివేదిక ఇవ్వాలని ఆదేశించామన్నారు. అవసరమైతే ఆ రోడ్డు నిర్మాణంపై విజిలెన్స్, ఏసీబీ విచారణ చేసేందుకు కూడా చర్యలు తీసుకుంటామన్నారు.
Updated Date - Nov 04 , 2024 | 11:50 PM