అండగా ఉండండి.. మంచి బహుమతులిస్తా
ABN , Publish Date - Feb 16 , 2024 | 11:56 PM
గ్రామ వలంటీర్లు తనకు అండగా ఉండాలని, త్వరలోనే మంచి బహుమతులు ఇస్తానని రాష్ట్ర పురపాలకశాఖ మంత్రి, వైసీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి ఆదిమూలపు సురేష్ అన్నారు. శుక్రవారం స్థానిక మండల కార్యాలయాల ఆవరణలో కొండపి, మర్రిపూడి, పొన్నలూరు మండలాల వలంటీర్లతో ఏర్పాటు చేసిన ఆత్మీయ సమావేశంలో ఆయన మాట్లాడారు.

వలంటీర్లతో సమావేశంలో మంత్రి సురేష్
ప్రశంసా పత్రాలు, మెడల్స్ అందజేత
సీఎం మిమ్మల్నే నమ్ముకున్నారన్న నాయకులు
కొండపి, ఫిబ్రవరి 16 : గ్రామ వలంటీర్లు తనకు అండగా ఉండాలని, త్వరలోనే మంచి బహుమతులు ఇస్తానని రాష్ట్ర పురపాలకశాఖ మంత్రి, వైసీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి ఆదిమూలపు సురేష్ అన్నారు. శుక్రవారం స్థానిక మండల కార్యాలయాల ఆవరణలో కొండపి, మర్రిపూడి, పొన్నలూరు మండలాల వలంటీర్లతో ఏర్పాటు చేసిన ఆత్మీయ సమావేశంలో ఆయన మాట్లాడారు. కొండపిలో తనను గెలిపించి జగన్‌కు కానుకగా ఇవ్వాలని సురేష్ విజ్ఞప్తి చేశారు. ఉన్నత చదువులు చదువుకున్న వారు కూడా వలంటీర్లుగా పనిచేస్తుంటే ప్రతిపక్షాలు విషం చిమ్ముతున్నాయన్నారు. వలంటీర్లకు అర్హత పదో తరగతి కాగా, ఇప్పుడు పనిచేస్తున్న వారిలో 13 శాతం మందే ఆ అర్హత ఉన్నవారన్నారు. 85శాతం మంది డిగ్రీ, ఆపై చదువుల వారు, రెండు శాతం మంది డిప్లమో చేసిన వారు వలంటీర్లుగా సేవలందిస్తున్నారన్నారు. నియోజకవర్గంలోని ఆరు మండలాల్లో 1,595 మంది వలంటీర్లు పనిచేస్తుంటే 1,499 మందికి సేవామిత్ర, 30 మందికి సేవారత్న, ఐదుగురికి సేవా వజ్ర అవార్డులు వచ్చాయని మంత్రి తెలిపారు. వైసీపీ రాష్ట్ర నాయకుడు ఢాకా పిచ్చిరెడ్డి మాట్లాడుతూ వలంటీర్ల సేవలు ఎనలేనివన్నారు. వలంటీర్లు సురే్‌షకు అండగా నిలిచి గెలిపించాలని కోరారు. సీఎం జగన్ కూడా మిమ్మల్నే నమ్ముకున్నారన్నారు. అనంతరం సేవా వజ్ర, సేవారత్న పొందిన వలంటీర్లకు మంత్రి శాలువాలు కప్పి ప్రశంసాపత్రాలు అందజేశారు. కార్యక్రమంలో ఎంపీడీవోలు, పొన్నలూరు ఎంపీపీ మాధవ, జడ్పీటీసీ సభ్యుడు బెజవాడ వెంకటేశ్వర్లు, వైసీపీ మూడు మండలాల అధ్యక్షులు, జేసీఎస్ కన్వీనర్లు, పెదకండ్లగుంట సర్పంచ్ భువనగిరి సత్యన్నారాయణతోపాటు పలువురు సర్పంచ్‌లు, ఎంపీటీసీ సభ్యులు పాల్గొన్నారు.