అవినీతికి అండదండలు
ABN, Publish Date - Nov 02 , 2024 | 01:13 AM
‘అక్కడ అవినీతి వ్యవహారాలు జోరుగా సాగాయి. డబ్బులు ఇస్తేనే బిల్లులు ఓకే చేశారు. లేదంటే నెలలతరబడి పెండింగ్‌లో పెట్టారు. కార్యాలయాన్ని తక్షణం ప్రక్షాళన చేయాల్సిందే..’ ఇది విచారణాధికారి నివేదిక. తదనుగుణంగా స్పందించిన కలెక్టర్, ఉన్నతాధికారులు.. ఇద్దరు అధికారులను సస్పెండ్ చేశారు.
మొన్న సస్పెన్షన్.. నేడు పోస్టింగ్..
అటు రాజకీయ, ఇటు ఉద్యోగ సంఘ
నేతల పైరవీలే కారణమన్న విమర్శలు
రచ్చకెక్కుతున్న ఖజానా కార్యాలయ వ్యవహారం
(ఆంధ్రజ్యోతి, ఒంగోలు)
‘అక్కడ అవినీతి వ్యవహారాలు జోరుగా సాగాయి. డబ్బులు ఇస్తేనే బిల్లులు ఓకే చేశారు. లేదంటే నెలలతరబడి పెండింగ్‌లో పెట్టారు. కార్యాలయాన్ని తక్షణం ప్రక్షాళన చేయాల్సిందే..’ ఇది విచారణాధికారి నివేదిక. తదనుగుణంగా స్పందించిన కలెక్టర్, ఉన్నతాధికారులు.. ఇద్దరు అధికారులను సస్పెండ్ చేశారు. మిగిలిన ఉద్యోగులందరినీఅక్కడి నుంచి బదిలీ చేశారు. అవినీతికి నిలయంగా మారిన ఉమ్మడి జిల్లాలోని ఖజానా కార్యాలయానికి సంబంధించి కథాకమామిషు ఇది. అయితే అంతలోనే ఖజానా కార్యాలయంలో కొందరు ఉద్యోగులు ఒక పక్క, ఉద్యోగ సంఘం నాయకులు మరోపక్క రంగంలోకి దిగారు. అవినీతి ఉద్యోగులను కాపాడుకునేందుకు విశ్వప్రయత్నం చేశారు. కుదరకపోవడంతో సదరు ప్రజాప్రతినిధులపై ఒత్తిడి తెచ్చారు. ఉన్నతాధికారులపై ఇటు ఉద్యోగ నాయకులు, అటు రాజకీయ నాయకుల ఒత్తిడి పెరగటంతో సస్పెండైన ఉద్యోగులకు తిరిగి పోస్టింగ్‌లు లభించాయి. తదనుగుణంగా చీరాలలో సస్పెండ్ అయిన ఖజానా కార్యాలయ ఉద్యోగి శుక్రవారం ఒంగోలులోని జిల్లా ఖజానా కార్యాలయంలో ఉద్యోగంలో చేరారు.
అవినీతి వ్యవహారాల రచ్చ
ఇటీవల చీరాల ట్రెజరీ కార్యాలయంలో ఉద్యోగుల అవినీతి వ్యవహారాలు తదనుగుణంగా బిల్లుల చెల్లింపులు నిలిచిపోవడం తెలిసిందే. అదేసమయంలో చీరాల ఉపఖజనా కార్యాలయంలో అవినీతికి ఆస్కారం ఉన్న పోస్టింగ్‌ల్లో ఉద్యోగుల బాధ్యతల మార్పు రచ్చకెక్కింది. అప్పటి ఎస్‌టీవో భాగ్యలక్ష్మి కార్యాలయంలోని ఉద్యోగుల బాధ్యతలను అకస్మాత్తుగా మార్చేశారు. దానిపై కొందరు ఉద్యోగులు చీరాల ఎమ్మెల్యే కొండయ్యయాదవ్‌కు ఫిర్యాదు చేశారు. ఈ విషయంలో కొందరికి అన్యాయం జరిగింది, వెంటనే సరిచేయండి అంటూ ఎమ్మెల్యే కొండయ్య జిల్లా అధికారితోపాటు ఉన్నతాధికారులకు లేఖ రాశారు. ఇదేసమయంలో చీరాల ఖజానా కార్యాలయంలో లంచం ఇవ్వందే బిల్లులు మంజూరు కావడం లేదంటూ కొందరు ఫిర్యాదులు చేశారు. దీంతో ఉన్నతాధికారులు దృష్టిసారించారు. బాపట్ల కలెక్టర్ ఆగమేఘాలపై దర్యాప్తునకు ఆదేశించారు. ఆర్డీవో ఒకటి రెండు రోజులు కార్యాలయంలో తిష్టవేసి విచారణ చేశారు. నెలల తరబడి బిల్లుల చెల్లింపులు నిలిచిపోవడం నిజమేనని తేల్చారు. అందుకు అవినీతి వ్యవహారాలే కారణంగా భావించారు. అలాగే ఉద్యోగుల మధ్య అంతర్గత పోరు నడుస్తున్నమాట నిజమేనని ఆ విచారణలో తేల్చి చెప్పారు. అదే సమయంలో విభేదించుకుంటున్న ఉద్యోగులు పోటాపోటీగా రచ్చకెక్కారు. విషయాన్ని గుర్తించి ఉన్నతాధికారులు వారిపై చర్యలు తీసుకున్నారు. చీరాల ఎస్‌టీవో భాగ్యలక్ష్మితోపాటు మరో ఉద్యోగిని సస్పెండ్ చేశారు. ఆ కార్యాలయంలోని మిగిలిన ఉద్యోగులందరినీ ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని ఇతర సబ్ ట్రెజరీలకు బదిలీ చేశారు.
ఉన్నత స్థాయిలో ఒత్తిళ్లు
సబ్ ట్రెజరీ ఉద్యోగులకు అండగా నిలిచే ఒక ఉద్యోగ సంఘం నాయకుడు ఈ వ్యవహారంలో జోక్యం చేసుకుని రంగంలోకి దిగినట్లు తెలిసింది. అయితే అనుకున్న విధంగా పనులు జరగకపోవడంతో సస్పెండ్ అయిన ఉద్యోగులు బాపట్ల జిల్లాలోని కీలక ప్రజాప్రతినిధికి తెలిపారు తమ సొంతూరి టీడీపీ నాయకులను తీసుకొని ప్రజాప్రతినిధులను కలవడంతో ఆయన కిమ్మనకుండా వారికి మద్దతు తెలిపినట్లు తెలిసింది. వెంటనే సదరు ప్రజాప్రతినిధి వాళ్లకు పోస్టింగ్ ఇవ్వాలని ఉన్నతాధికారులకు సిఫార్సు చేశారు. అందుకనుగుణంగా ఉద్యోగ సంఘం నాయకులు రాష్ట్ర అధికారిపై ఒత్తిడి పెంచారు. దీంతో విచారణ అధికారి ఇచ్చిన నివేదికను పక్కన పెట్టి సదరు ఉద్యోగులకు పోస్టింగ్‌లు ఇచ్చారు. భాగ్యలక్ష్మితోపాటు మరో ఉద్యోగిని ఒంగోలులోని జిల్లా ట్రెజరీ కార్యాలయానికి పంపారు. ఉద్యోగ సంఘం నాయకుల ఆదేశాల మేరకే ముందుకు సాగే ఖజానా శాఖ డిప్యూటీ డైరెక్టర్ వెంటనే వారికి వారు కోరిన చోట పోస్టింగ్‌లు ఇచ్చేశారు. దీంతో ఈ వ్యవహారం ఉమ్మడి ప్రకాశం జిల్లాతోపాటు రాష్ట్రస్ధాయిలో చర్చనీయాంశంగా మారింది.
Updated Date - Nov 02 , 2024 | 01:13 AM