‘పొలం పిలుస్తోంది’ పేలవం
ABN, Publish Date - Nov 06 , 2024 | 01:12 AM
ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న పొలం పిలుస్తోంది కార్యక్రమం క్షేత్రస్థాయిలో పేలవంగా సాగుతోంది. వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చి రైతులను రాజుగా చూడాలనే ఉద్దేశంతో పొలం పిలుస్తోందిని ప్రభుత్వం అమలు చేస్తోంది.
పత్తాలేని అనుబంధ శాఖల అధికారులు
తూతూమంత్రంగా అవగాహన కార్యక్రమాలు
పొదిలి, నవంబరు 5 : ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న పొలం పిలుస్తోంది కార్యక్రమం క్షేత్రస్థాయిలో పేలవంగా సాగుతోంది. వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చి రైతులను రాజుగా చూడాలనే ఉద్దేశంతో పొలం పిలుస్తోందిని ప్రభుత్వం అమలు చేస్తోంది. ఈ కార్యక్రమంలో వ్యవసాయ, అనుబంధ శాఖల సిబ్బంది పాల్గొని రైతులకు అవసరమైన సలహాలు, సూచనలు ఇవ్వాల్సి ఉంది. అయితే క్షేత్రస్థాయిలో అందుకు విరుద్ధంగా సాగుతోంది. వ్యవసాయశాఖ అధికారులు మినహా మిగిలిన శాఖల వారు అప్పుడప్పుడు చుట్టపుచూపుగా వస్తున్నారు. కొన్నిశాఖల అధికారులు కనీసం కనిపించడం కూడా లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. పొలం పిలుస్తోంది కార్యక్రమంలో వ్యవసాయ, ఉద్యానవన, పశుసంవర్థక, పట్టుపరిశ్రమ శాఖ, ఆత్మ, ఎంఐపీ, పాడి పరిశ్రమ, మార్కెటింగ్ శాఖలతోపాటు ప్రజాప్రతినిధులు పాల్గొనాలి. వీటితోపాటు రైతుమిత్ర సంఘాలు, భూసార పరిరక్షణ అధికారులు పాల్గొని వ్యవసాయ అభివృద్ధికి అవసరమైన సలహాలు ఇవ్వాలి. ప్రతి మంగళ, బుధవారాల్లో రెండు గ్రామాల్లో ఉదయం 8.30 నుంచి12 గంటల వరకు, సాయంత్రం 2 నుంచి 5.30 గంటల వరకు జరిగే పొలం పిలుస్తోంది కార్యక్రమంలో పొలాలను పరిశీలించి అభ్యుదయ రైతులను ప్రోత్సహించాల్సి ఉంది. ప్రభుత్వం అందిస్తున్న వివిధ పథకాలపై అవగాహన కల్పించాలి. ముఖ్యంగా ఉద్యానవన పంటల సాగులో మెళకువలను నేర్పించాలి. పాడిపరిశ్రమ గ్రామీణ ఆర్ధికాభివృద్ధిలో కీలకపాత్ర పోషిస్తుంది. ఈనేపధ్యంలో పశుపోషకులకు అవగాహన కల్పించాలి. అదేవిధంగా భూసారపరీక్షలు నిర్వహించి మట్టినమూనాలను సేకరించడంతోపాటు అందుకు అనుగుణంగా రైతులు వినియోగించాల్సి ఎరువులపై స్పష్టత ఇవ్వాల్సి ఉంది. దీంతో పాటు పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు కల్పించడం మార్కెటింగ్ కమిటీల ద్వారా ఉత్పత్తులను విక్రయించడం అందుకు అవసరమైన కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాల్సి ఉంది. రైతులు పండించిన పంట ఉత్పత్తులను నిల్వచేసుకునేందుకు అవసరమైన గిడ్డంగులను నిర్మించడం వంటి రైతుప్రయోజన కార్యక్రమాలు చేపట్టాలి.
వ్యవసాయాధికారులు మాత్రమే హాజరు
వ్యవసాయ అధికారులు మాత్రమే కార్యక్రమంలో పాల్గొని ముందుకు సాగిస్తున్నారు. దీంతో పొలం పిలుస్తోంది పేలవంగా సాగుతోంది. గ్రామస్థాయి ప్రజాప్రతినిధులు సైతం అటువైపు కన్నెత్తి చూసిన దాఖలు కూడా లేకపోవడం శోచనీయం. ఇప్పటికైనా ఉన్నతాధికారులు జోక్యం చేసుకొని ముఖ్యంగా పొలంబడి కార్యక్రమంలో పాల్గొనాల్సిన ఆయా శాఖలు సిబ్బంది పాల్గొనే విధంగా చూడాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వ ఆశయం నెరవేర్చే విధంగా సమర్ధవంతంగా పొలంబడి కార్యక్రమాలు జరిగే విధంగా చూడాలని రైతులు కోరుతున్నారు.
అనుబంధ శాఖల అధికారులు డుమ్మా
పొదిలి మండలంలో గత నెలరోజులుగా జరుగుతున్న కార్యక్రమాలను పరిశీలిస్తే అక్టోబరులో జువ్వలేరు, ఈగలపాడు, పాములపాడు, కుంచేపల్లి, తలమళ్ల, ఆముదాలపల్లి గ్రామాల్లో పొలం పిలుస్తోంది కార్యక్రమాలు జరిగాయి. అయితే ఈ గ్రామాల్లో జరిగిన కార్యక్రమాలకు కేవలం వ్యవసాయశాఖకు సంబంధించిన అధికారులు, గ్రామ సహాయకులు మినహా ఏశాఖ అధికారులు పాల్గొన లేదు. అయితే మంగళవారం ఏలూరు, ఉప్పలపాడు గ్రామాల్లో జరిగిన కార్యక్రమంలో మాత్రం ఉద్యాన అధికారి పాల్గొన్నారు. గతంలో మల్లవరం గ్రామంలో జరిగిన కార్యక్రమానికి పశువైద్యాధికారి హాజరయ్యారు. మిగిలిన వారంతా డుమ్మా కొట్టారు.
Updated Date - Nov 06 , 2024 | 01:12 AM