ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

సంతకాలు నావే.. ఆర్డర్లు ఫేక్‌!

ABN, Publish Date - Oct 22 , 2024 | 01:13 AM

‘సంతకాలు నావే.. కానీ ఆ ఉత్తర్వులు మాత్రం ఫేక్‌..’ ఇదీ జిల్లా పంచాయతీ కార్యాలయం పరిధిలో బదిలీల అక్రమాలపై పూర్వ ఇన్‌చార్జి డీపీవో ఉషారాణి వివరణ. ఆ మాట విని విచారణాధికారులు అవాక్కయ్యారు. బదిలీల్లో పారదర్శకతకు పాతరేసి, ఉద్యోగులకు సకాలంలో ఉత్తర్వులు ఇవ్వకుండా జాప్యం చేసి ఇప్పుడు అవి నకిలీవి అని మాటమార్చడంతో అంతా గందరగోళం నెలకొంది.

పూర్వ డీపీవోను విచారిస్తున్న త్రిసభ్య కమిటీ

బదిలీల పంచాయితీపై త్రిసభ్య కమిటీ విచారణలో అనేక వింతలు

పూర్వ డీపీవో ఉషారాణి వ్యవహారశైలిపై అవాక్కు

విచారణాధికారులను ముప్పుతిప్పలు పెట్టిన వైనం

కొత్తగా వచ్చిన అధికారిపై నిందలు వేసే ప్రయత్నం

అయోమయంలో గ్రేడ్‌-5, 6 ఉద్యోగులు

తమ పరిస్థితి ఏమిటని ఆందోళన

విచారణ అనంతరం కలెక్టర్‌ను కలిసిన ఉద్యోగులు

‘సంతకాలు నావే.. కానీ ఆ ఉత్తర్వులు మాత్రం ఫేక్‌..’ ఇదీ జిల్లా పంచాయతీ కార్యాలయం పరిధిలో బదిలీల అక్రమాలపై పూర్వ ఇన్‌చార్జి డీపీవో ఉషారాణి వివరణ. ఆ మాట విని విచారణాధికారులు అవాక్కయ్యారు. బదిలీల్లో పారదర్శకతకు పాతరేసి, ఉద్యోగులకు సకాలంలో ఉత్తర్వులు ఇవ్వకుండా జాప్యం చేసి ఇప్పుడు అవి నకిలీవి అని మాటమార్చడంతో అంతా గందరగోళం నెలకొంది. విషయం తెలిసి ప్రస్తుతం గాలిలో (బాధ్యతలు తీసుకోకుండా) ఉన్న గ్రేడ్‌ 5,6 ఉద్యోగుల్లో ఆందోళన నెలకొంది. వెంటనే వారు ఉత్తర్వులను తీసుకొని కలెక్టర్‌ను కలిశారు. తమ ఆవేదనను ఆమెకు వివరించారు. కాగా బదిలీలతో ఎలాంటి సంబంధం లేని ప్రస్తుత డీపీవోపై ఉషారాణి విచారణాధికారులకు తప్పుడు సమాచారం ఇచ్చారు. దీంతో ఇక ఆ కార్యాలయంలో పనిచేసే వారిపై ఆమె ఏమి చెప్పి ఉంటారోనన్న ఆందోళన ఉద్యోగుల్లో నెలకొంది.

ఒంగోలు కలెక్టరేట్‌, అక్టోబరు 21 (ఆంధ్ర జ్యోతి): జిల్లా పంచాయతీ పరిధిలోని గ్రేడ్‌-5, గ్రేడ్‌-6 (సచివాలయ కార్యదర్శుల) ఉద్యోగుల బదిలీల్లో చోటుచేసుకున్న అవినీతి, అక్రమా లపై చేపట్టిన విచారణను పూర్వ ఇన్‌చార్జి డీపీవో పక్కదారి పట్టించేందుకు ప్రయ త్నించారు. తప్పులను ఇతరులపై నెట్టి వేసే ప్రయత్నాలు చేస్తుండటంపై విచారణా ధికారులు విస్తుపోయారు. పంచాయతీ కార్యదర్శుల బదిలీల్లో అక్రమాలపై ఫిర్యాదులు అందడంతో కలెక్టర్‌ తమీమ్‌ అన్సారియా విచారణకు త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేశారు. ఫారెస్టు సెటిల్‌మెంట్‌ ఆఫీసర్‌ లోకేశ్వరరావును చైర్మన్‌గా, జిల్లా పరిషత్‌ సీఈవో చిరంజీవి, జిల్లా అడిట్‌ అధికారి శంకర్‌నారాయణరెడ్డిలను సభ్యులుగా నియమించారు. దీంతో వారు సోమవారం స్థానిక కలెక్టరేట్‌లోని ఫారెస్టు సెటిల్‌మెంట్‌ కార్యాలయంలో విచారణ నిర్వహించారు. బదిలీల ఉత్తర్వులు పొందిన ఉద్యోగులను విచారించారు. ఈ సందర్భంగా తాము పడిన ఇబ్బందులను వారు విచారణాధికారుల ఎదుట ఏకరువు పెట్టారు.

ఉత్తర్వులు ఇచ్చారు.. చేర్చుకోవద్దన్నారు

తమకు బదిలీ ఉత్తర్వులు ఇచ్చి విధుల్లో చేర్చుకోవద్దని ఎంపీడీవోలకు ఫోన్‌లు చేసి చెప్తున్నారని ఉద్యోగులు విచారణాధికారుల ఎదుట ఆవేదన వ్యక్తం చేశారు. తాము ఉద్యోగంలో చేరిన నాటినుంచి ఇటువంటి పరిస్థితి ఎప్పుడూ ఎదురుకాలేదన్నారు. న్యాయం చేసి ఆదుకోవాలని విచారణాధికారులకు విన్నవించారు. తదనంతరం జిల్లా పంచాయతీ పూర్వ ఇన్‌చార్జి అధికారి ఉషారాణిని కూడా విచారణ చేశారు. ఆ సమయంలో ఆమె చెప్పిన మాటలు విని విచారణాధికారులు అవాక్కయ్యారు. ఆ బదిలీల ఉత్తర్వులపై సంతకాలు మాత్రం తనవేనని, కానీ ఆ ఉత్తర్వులు మాత్రం ఫేక్‌ అని చెప్పినట్లు సమాచారం. మరోవైపు ఇటీవల జిల్లా పంచాయతీ అధికారిగా బాధ్యతలు స్వీకరించిన గొట్టిపాటి వెంకటనాయుడు వారిని చేర్చుకోవద్దని ఎంపీడీవోలకు ఫోన్‌ చేసి చెప్పారని నెపం ఆయనపై మోపే ప్రయత్నం చేశారు. దీంతో విచారణాధికారులు తలలు పట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.

ప్రస్తుత డీపీవో రాకముందే బదిలీలు

జిల్లా పంచాయతీ అధికారి వెంకటనాయుడు పది రోజుల క్రితమే బాధ్యతలు స్వీకరించారు. అప్పటికే ఉద్యోగుల బదిలీల ప్రక్రియ కూడా ముగిసింది. ఇప్పుడు ఆ తప్పును కప్పిపుచ్చేందుకు ఉషారాణి ఇతరులపై నెట్టివేస్తున్నారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు జిల్లా పంచాయతీ కార్యాలయంలో పనిచేసే ఇతర ఉద్యోగులపై కూడా ఆ నెపం మోపే ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తోంది. జిల్లా అధికారిగా ఉన్న సమయంలో కలెక్టర్‌ ఇచ్చిన ప్రొసీడింగ్స్‌ ప్రకారం బదిలీలు చేయాల్సి ఉండగా అందుకు భిన్నంగా చేపట్టడాన్ని విచారణాధికారులు ప్రశ్నించినట్లు తెలిసింది. అయితే దానిపై సరైన సమాధానం చెప్పకుండా దాటివేయడమే కాకుండా ఆ తప్పులను ఇతరులపై నెట్టేందుకు ప్రయత్నించినట్లు సమాచారం.


తలలుపట్టుకుంటున్న విచారణాధికారులు

పూర్వ డీపీవో ఉషారాణి చెప్తున్న మాటలతో విచారణాధికారులకు కూడా ఏమి చేయాలో తెలియక తలలు పట్టుకోవాల్సిన పరిస్థితి నెలకొన్నట్లు సమాచారం. విచారణాధికారులు ఏ అంశాన్ని ప్రస్తావించినా దానిపై కాకుండా ఇతర అంశాలను పదేపదే ప్రస్తావించినట్లు తెలిసింది. దీంతో విచారణాధికారులు చేసేదేమీ లేక జిల్లా పంచాయతీ కార్యాలయం నుంచి బదిలీల సమయంలో కలెక్టర్‌ ఇచ్చిన ప్రొసీడింగ్స్‌ను తెప్పించుకొని వాటిని క్షుణ్ణంగా పరిశీలించినట్లు సమాచారం. కలెక్టర్‌ ఇచ్చిన ప్రొసీడింగ్స్‌కు, ఉద్యోగుల బదిలీల ఉత్తర్వులకు అసలు సంబంధం లేకుండా ఉన్నట్లు తెలిసింది. కాగా విచారణ సమయంలో ఉషారాణి చెప్పిన సమాధానం తెలిసి బాధిత ఉద్యోగుల్లో ఆందోళన నెలకొంది. వెంటనే వారు తమ ఉత్తర్వులను తీసుకుని కలెక్టర్‌ తమీమ్‌ అన్సారియాను కలిశారు. ఆమె ఎదుట తమ ఆవేదన, ఆందోళనను వెలిబుచ్చారు. కాగా విచారణ సమయంలో తప్పులను కప్పిపుచ్చేందుకు, ఇతర ఉద్యోగులపై నెట్టివేసే ప్రయత్నాలు చేస్తున్నారన్న ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి.

రాతపూర్వకంగా సమాచారం తీసుకున్నారు

జిల్లా పంచాయతీ పూర్వ అధికారి ఉషారాణి చేసిన కొన్ని ఆరోపణలపై ప్రస్తుత డీపీవో వెంకటనాయుడుతోపాటు ఇతర ఉద్యోగుల నుంచి కూడా త్రిసభ్య కమిటీ రాతపూర్వకంగా వివరణ తీసుకున్నట్లు తెలిసింది. ఈ బదిలీల ఉత్తర్వుల ప్రక్రియలో ఇప్పటికే సస్పెండ్‌ అయిన ఉద్యోగులతోపాటు ప్రస్తుతం కార్యాలయంలో పనిచేస్తున్న వారి నుంచి కూడా మరికొన్ని అంశాలపై విచారించినట్లు తెలిసింది. మరోవైపు బదిలీల్లో అక్రమాలపై ఫిర్యాదు చేసిన రిటైర్డ్‌ పంచాయతీ కార్యదర్శి పెండ్యాల వెంకటేశ్వర్లు నుంచి కూడా విచారణాధికారులు వివరణ తీసుకున్నట్లు సమాచారం.

Updated Date - Oct 22 , 2024 | 01:13 AM