పారదర్శకంగా ఉచిత ఇసుక
ABN, Publish Date - Oct 09 , 2024 | 11:44 PM
జిల్లాలో ప్రజలకు ఉచిత ఇసుకను పారదర్శకంగా అందిస్తామని కలెక్టర్ తమీమ్ అన్సారియా స్పష్టం చేశారు. అందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. స్థానిక కలెక్టరేట్‌లో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు.
అక్రమంగా తరలిస్తే చర్యలు
జిల్లాలో స్టాక్ పాయింట్లు లేవు
స్థానిక అవసరాల కోసం ఎక్కడికక్కడ వెసులుబాటు
కలెక్టర్ తమీమ్ అన్సారియా
ఒంగోలు (కలెక్టరేట్), అక్టోబరు 9 : జిల్లాలో ప్రజలకు ఉచిత ఇసుకను పారదర్శకంగా అందిస్తామని కలెక్టర్ తమీమ్ అన్సారియా స్పష్టం చేశారు. అందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. స్థానిక కలెక్టరేట్‌లో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. ఈ ఏడాది జూలై 8నుంచి ప్రభుత్వం ఉచిత ఇసుక విధానాన్ని తీసుకువచ్చిందన్నారు. అప్పటి నుంచి జిల్లాలో 62,291 మెట్రిక్ టన్నుల ఇసుకను ఉచితంగా ప్రజలకు అందించామన్నారు. ప్రస్తుతం జిల్లాలో ఇసుక స్టాక్ పాయింట్లు లేవని స్పష్టం చేశారు. అవసరమైన ఇసుకను నెల్లూరు, కడప, కర్నూలు జిల్లాల్లోని స్టాక్ పాయింట్ల నుంచి సరఫరా చేస్తున్నామని చెప్పారు.
ఫిర్యాదుల కోసం ప్రత్యేక హెల్ప్‌లైన్
జిల్లాలో స్థానిక అవసరాల కోసం 285 వాగులు, వంకలను గుర్తించడం జరిగిందని కలెక్టర్ చెప్పారు. వాటి నుంచి సమీపంలోని గ్రామాల ప్రజలు సొంత అవసరాల కోసం ఉచితంగా తోలుకోవచ్చని తెలిపారు. పట్టా భూముల్లో ఇసుక తవ్వకాలు చేపట్టేందుకు యజమానులు దరఖాస్తు చేసుకుంటే జిల్లాస్థాయి ఇసుక కమిటీ పరిశీలించి అనుమతులు ఇస్తుందన్నారు. ఈనెల నుంచి వచ్చే ఏడాది మార్చి వరకు జిల్లాలో 4.36 లక్షల మెట్రిక్ టన్నుల ఇసుక అవసరమవుతుందని అంచనా వేసినట్లు తెలిపారు. జిల్లాలో ఇసుక అక్రమ రవాణా, బ్లాక్ మార్కెటింగ్ చేసే వారిపై కఠిన చర్యలు తీసుకొంటామని కలెక్టర్ తెలిపారు. ఇసుక అక్రమ తవ్వకాలపై ఫిర్యాదుల కోసం 62817 99518 నంబర్‌తో ప్రత్యేక హెల్ప్‌లైన్‌ను ఏర్పాటు చేశామన్నారు.
16 నుంచి ప్రైవేటు మద్యం దుకాణాలు
జిల్లాలో మద్యం షాపుల కోసం ఈనెల 1నుంచి దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమైందని కలెక్టర్ అన్సారియా చెప్పారు. దరఖాస్తు గడువును ప్రభుత్వం మరో రెండు రోజులు పెంచిందన్నారు. జిల్లాలో 171 మద్యందుకాణాలకు ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ ద్వారా ధరఖాస్తులను స్వీకరిస్తున్నట్లు తెలిపారు. 16నుంచి కొత్త దుకాణాలు ప్రారంభించుకోవచ్చని చెప్పారు. గీత కార్మికులకు 17 షాపులు కేటాయించడం జరిగిందని, వాటికి ప్రత్యేకంగా మార్గదర్శకాలు రావాల్సి ఉందని వెల్లడించారు.
ఇసుక అక్రమ రవాణాపై నిఘా : ఎస్పీ దామోదర్
ఇసుక అక్రమ రవాణాపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసినట్లు ఎస్పీ దామోదర్ తెలిపారు. మూడు నెలల్లో 70 కేసులను నమోదు చేశామన్నారు. ఉచిత ఇసుక విధానం పటిష్టంగా అమలయ్యేలా క్షేత్రస్థాయిలో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఇసుక అక్రమ రవాణా చేస్తూ వాహనాలు పట్టుబడితే సీజ్ చేస్తామని హెచ్చరించారు. మరోసారి దొరికితే యజమానులపై పీడీ యాక్టు కింద చర్యలు తీసుకుంటామన్నారు. సమావేశంలో జేసీ ఆర్.గోపాలకృష్ణ పాల్గొన్నారు.
Updated Date - Oct 09 , 2024 | 11:44 PM