పల్లెకు పండగొచ్చె!
ABN, Publish Date - Nov 20 , 2024 | 11:54 PM
పల్లెకు పండుగొచ్చింది. ప్రతి ఊళ్లో అభివృద్ధి ఉత్సవం నడుస్తోంది. ఎప్పట్నుంచో ఆగిపోయిన నిర్మాణ పనులు మొదలు కావడంతో ప్రజలు కూటమి ప్రభుత్వం పాలనాదక్షతను ప్రశంసిస్తున్నారు.
జిల్లావ్యాప్తంగా ఉపాధి మెటీరియల్ నిధులతో శరవేగంగా సాగుతున్న పనులు
1,136 సిమెంట్ రోడ్లు, 617 పశువుల పాకల నిర్మాణ పనులు మంజూరు
వాటిలో 90 శాతం పనులు ప్రారంభం
ఒక్క రోడ్ల విలువే రూ.115.65 కోట్లు
మరో రూ.40 కోట్లతో ఎస్సీ, ఎస్టీ కాలనీల్లో రోడ్ల పనులకు ప్రతిపాదన
ఈ పనులన్నీ సంక్రాంతిలోపు పూర్తే లక్ష్యం
డిసెంబరులోపు రూపురేఖలు తీసుకొచ్చేలా ప్లాన్
పల్లెకు పండుగొచ్చింది. ప్రతి ఊళ్లో అభివృద్ధి ఉత్సవం నడుస్తోంది. ఎప్పట్నుంచో ఆగిపోయిన నిర్మాణ పనులు మొదలు కావడంతో ప్రజలు కూటమి ప్రభుత్వం పాలనాదక్షతను ప్రశంసిస్తున్నారు. ప్రస్తుతం గ్రామాల్లో సిమెంట్ రోడ్ల పనులు శరవేగంగా సాగుతున్నాయి. ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ కాలనీల్లో దారులన్నీ బాగుపడుతున్నాయి. అంతేగాక ఉపాధి హామీ పథకం కింద పశువుల పాకల నిర్మాణాలు చేపట్టారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో రహదారులపై ఏర్పడిన గుంతలు కూడా పూడ్చలేదు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే పెద్దఎత్తున రోడ్లు పనులు మంజూరుచేశారు. సంక్రాంతిలోపు ఈ పనులను నూరుశాతం పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అయితే డిసెంబరులోపే రోడ్లకు రూపురేఖలు తీసుకొచ్చేలా కలెక్టర్ ప్రత్యేక దృష్టి సారించారు.
ఒంగోలు, నవంబరు 20(ఆంధ్రజ్యోతి): జిల్లాలో ఉపాధి హామీ పథకం మెటీరియల్ కోటా నిధులతో చేపట్టిన పల్లె పండుగ పనులు శరవేగంగా సాగుతున్నాయి. వాటిల్లో ప్రధానంగా సిమెంట్ రోడ్లు, పశువుల పాకల నిర్మాణాలు ఉన్నాయి. ఇప్పటివరకు దాదాపు 2,804 పనులకు నిధులు మంజూరు చేశారు. అందులో రూ.115.65 కోట్ల విలువైన 1,136 పనులు ఉన్నాయి. అందులో 1,096 సిమెంట్ రోడ్డు పనులు ఉండగా, మరో 617 పశువుల పాకల నిర్మాణాలు ఉన్నాయి. కేంద్రప్రభుత్వం ద్వారా అమలవుతున్న ఉపాధి పథకంలో కూలీల వేతనాలతోపాటు మెటీరియల్ కోటా నిధులు కూడా భారీగా అందుబాటులో ఉంటాయి. ప్రతి వంద రూపాయల వ్యయంలో 60శాతం వేతన రూపంలో ఉంటే 40శాతం మెటీరియల్ కోటా నిధులు ఉంటాయి. గ్రామీణ ప్రాంతాల్లో ప్రధానంగా నీటి సంరక్షణ, మొక్కల పెంపకం, ఉద్యాన పంటల సాగు, జంగిల్ క్లియరెన్స్ తదితర పనులు కూలీలకు వేతనాలు కల్పించే వాటిలో ఉన్నాయి. అదేసమయంలో మెటీరియల్ కోటా నిధులతో గ్రామాల్లో రోడ్లు, డ్రెయిన్లు ఇతర నిర్మాణాలు చేసుకోవచ్చు.
వైసీపీ పూర్తిగా వదిలేసింది
ఉపాధి హామీ పథక నిధులతో గత టీడీపీ ప్రభుత్వ కాలంలో పెద్దఎత్తున సీసీరోడ్ల నిర్మాణం జరగ్గా.. ఐదేళ్ల వైసీపీ పాలనలో అస్తవ్యస్తంగా పథకం అమలైంది. సిమెంట్ రోడ్ల నిర్మాణాన్ని వైసీపీ పాలకులు మర్చిపోయారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం మళీకల అధికారంలోకి వచ్చాక ఉపాధి పథకం మెటీరియల్ కోటా నిధులపై ప్రత్యేక దృష్టిసారించింది. జిల్లాలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2024-25)లో కోటి 56 లక్షల పనిదినాల కల్పన లక్ష్యం కాగా గత నెలాఖరు వరకు సుమారు కోటి 15లక్షల పనిదినాలు కల్పించారు. సుమారు 2.81 లక్షల కుటుంబాలకు చెందిన 4.79 లక్షల మంది కూలీలకు పనులు కల్పించగా వేతన రూపంలో దాదాపు రూ.239 కోట్ల మేర లభించాయి. తద్వారా రూ.160కోట్లకుపైగా మెటీరియల్ కోటా నిధులు అందుబాటులోకి వచ్చాయి. ఈ నేపథ్యంలో ఒక్కొక్క నియోజకవర్గానికి రూ.15 కోట్ల వంతున రూ.120 కోట్లతో రోడ్డు నిర్మాణ పనులు చేపట్టాలని కలెక్టర్ నిర్ణయించారు. ఆ మేరకు పనులు మంజూరు ప్రక్రియ చేపట్టారు. అదేసమయంలో పెద్ద ఎత్తున పశువుల పాకల నిర్మాణాలను ఉపాధి మెటీరియల్ కింద చేపట్టాలని నిర్ణయించింది. జిల్లాకు 1,075 యూనిట్లు మంజూరయ్యాయి వీటి కోసం రూ.22 కోట్ల మేర అవసరం కానున్నాయి.
ఎస్సీ, ఎస్టీ కాలనీలకు ప్రాధాన్యం
రోడ్ల నిర్మాణ పనులు మంజూరు చేసి ప్రారంభించే క్రమంలో ఎస్సీ,ఎస్టీ కాలనీలను గ్రామంలోకి అనుసంధానం చేసే రోడ్లు, ఇతరత్రా పలు పనులకు డిమాండ్ పెరిగింది. దీంతో రానున్న మార్చి ఆఖరు వరకు ఉపాధి పనుల ద్వారా వచ్చే మెటీరియల్ కోటా నిధులు మొత్తానికి సరిపడా పనులు చేయాలన్న నిర్ణయానికి పాలకులు వచ్చారు. ఇప్పటికే రూ.239 కోట్లు వేతన రూపంలో రాగా, సంక్రాంతి అనంతరం తిరిగి పనులు ప్రారంభించి మార్చి ఆఖరు వరకు ముమ్మరంగా పనులు చేపడితే మరో రూ.150కోట్లు వేతన రూపంలో సమకూరేలా పనులు చేయవచ్చని అధికారులు భావిస్తున్నారు. ఆ రకంగా చూస్తే ఈ ఏడాది రూ.180 కోట్ల మేర మెటీరియల్ నిధులు అందుబాటులోకి వస్తాయని అంచనా వేస్తున్నారు. తదనుగుణంగా ఇప్పుడే పనులు మంజూరు చేసే ప్రక్రియ చేపట్టారు.
కమిషనర్ రాకతో ఊపు
పల్లె పండుగ కార్యక్రమం కింద రూ.115.65 కోట్లతో 1,136 రోడ్ల పనులు మంజూరుచేయగా మరో రూ.21కోట్ల విలువైన 617 పశువుల పాకల పనులు ఇప్పటికే మంజూరు చేశారు. రోడ్ల పనులలో 1,096 సిమెంట్ రోడ్లు ఉన్నాయి. మొత్తం మంజూరు 1,136 రోడ్లు పనులలో 1,093 ప్రారంభించారు. వాటిలో 696 పనులకు సిమెంట్ రోడ్డు వేసేందుకు వీలుగా దిగువ లేయర్ పూర్తిచేశారు. వాటిలో 258 పనులకు కంకరు డస్ట్ వేస్ట్ వేశారు. 137 పనులలో సిమెంట్ కాంక్రీట్ కూడా వేశారు. జిల్లాలో ఇటీవల పీఆర్ కమిషనర్ కృష్ణతేజ్ పర్యటనతో ఈ పనులు మరింత ఊపందుకున్నాయి. ఒంగోలు, దర్శి, మార్కాపురం నియోజకవర్గాలలో ఈ పనులు వేగంగా సాగుతున్నాయి. అలాగే 617 పాకలకు సంబంధించి 394 పనులు ప్రారంభించారు. చేసిన పనులకు బిల్లుల చెల్లింపులపై ప్రతి గురువారం కలెక్టర్, డ్వామా పీడీల సమీక్షిస్తుండడంతో క్షేత్రస్థాయిలో పనులు బాగా ఊపందుకున్నాయి. ఇప్పటివరకు మంజూరైన పనులను ఎట్టి పరిస్థితుల్లో సంక్రాంతికి పూర్తిచేసేలా ప్రణాళికాబద్ధంగా చేస్తున్నట్లు డ్వామా పీడీ జోస్‌ఫకుమార్ తెలిపారు. అలాగే మరో రూ.40 కోట్లతో ఎస్సీ, ఎస్టీ కాలనీల్లో పనులు త్వరలో మంజూరు చేయనున్నట్లు చెప్పారు. స్థానికంగా పనులు చేపట్టిన వారు త్వరితగతిన నాణ్యతతో వాటిని పూర్తిచేయాలని సూచించారు.
Updated Date - Nov 20 , 2024 | 11:54 PM