నీరు-చెట్టు బిల్లుల కోసం ఎదురుచూపులు
ABN, Publish Date - Nov 11 , 2024 | 11:03 PM
తెలుగుదేశం ప్రభుత్వ హయాం (2014-19)లో నీరు-చెట్టు పనులు చేసిన వారికి బిల్లులు రాక ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పొదిలి ఇరిగేషన్ సబ్ డివిజన్ పరిధిలోని మూడు మండలాల్లో రూ.4కోట్లకుపైగా బకాయిలు ఉన్నాయి.
పొదిలి సబ్ డివిజన్‌లో రూ.4కోట్లు పెండింగ్
టీడీపీ హయాంలో పనులు
చెల్లింపులు నిలిపివేసిన గత వైసీపీ ప్రభుత్వం
కూటమి అధికారంలోకి వచ్చినా లభించని మోక్షం
మర్రిపూడి, నవంబరు 11 (ఆంధ్రజ్యోతి) : తెలుగుదేశం ప్రభుత్వ హయాం (2014-19)లో నీరు-చెట్టు పనులు చేసిన వారికి బిల్లులు రాక ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పొదిలి ఇరిగేషన్ సబ్ డివిజన్ పరిధిలోని మూడు మండలాల్లో రూ.4కోట్లకుపైగా బకాయిలు ఉన్నాయి. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే నీరు-చెట్టు పనులకు సంబంధించిన బిల్లుల చెల్లింపులను నిలిపివేసింది. టీడీపీ సానుభూతిపరులు పనులు చేశారన్న నెపంతో వివిధ రకాల విచారణలతో కాలయాపన చేసింది. దీంతో అప్పులు తెచ్చి పనులు చేసిన వారు తీవ్రంగా నష్టపోయారు. టీడీపీ మళ్లీ అధికారంలోకి రాగానే వడ్డీతో సహా బకాయిలు చెల్లిస్తామని పార్టీ అధినేత చంద్రబాబు, యువనేత లోకే్‌షలు అప్పట్లో స్పష్టమైన హామీ ఇచ్చారు. పలువురు కోర్టుకు వెళ్లడంతో న్యాయస్థానం ఆదేశాల మేరకు కొంత మేర బిల్లులు చెల్లించారు. మర్రిపూడి, పొదిలి మండలాల్లో రూ.కోటికి పైగా చెల్లించాల్సి ఉండగా ఫైనల్ బిల్లులు మరో రూ.2 కోట్ల వరకూ పెండింగ్‌లో ఉన్నాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో పనులు చేసిన వారంతా బిల్లులు అందుతాయని ఆశించారు. కానీ ఐదు నెలలవుతున్నా స్పందన లేకపోవడంతో వారిలో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. ఇప్పటికైనా పెండింగ్ బిల్లులు చెల్లించాలని కోరుతున్నారు.
Updated Date - Nov 11 , 2024 | 11:03 PM