ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

జనంతో మమేకం

ABN, Publish Date - Sep 21 , 2024 | 01:04 AM

కూటమి ప్రభుత్వం ఏర్పడి 100 రోజులు అయిన సందర్భంగా ఇది మంచి ప్రభుత్వం అంటూ చేపట్టిన కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు.. దగాపడ్డ, ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న కుటుంబాలకు చేయూతనిచ్చే విధంగా నిర్వహించారు.

మద్దిరాలపాడు గ్రామ సభలో మాట్లాడుతున్న ముఖ్యమంత్రి చంద్రబాబు, భారీగా హాజరైన ప్రజలు

దగాపడ్డ కుటుంబాలకు చేయూత

నిశిత పరిశీలన.. నిర్ధిష్ట చర్యలు

‘ఇది మంచి ప్రభుత్వం’ను ప్రజల కోసమే వినియోగించిన చంద్రబాబు

కూటమి ప్రభుత్వం ఏర్పడి 100 రోజులు అయిన సందర్భంగా ఇది మంచి ప్రభుత్వం అంటూ చేపట్టిన కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు.. దగాపడ్డ, ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న కుటుంబాలకు చేయూతనిచ్చే విధంగా నిర్వహించారు. ఎలాంటి హడావుడి లేకుండా గ్రామంలో ప్రజలతో మమేకమై వారి సమస్యలను విని వెంటనే పరిష్కారం చూపారు. హంగూ ఆర్భాటాలకు పోకుండా పేదల ఇళ్లకు వెళ్లడం, వారితో మాట్లాడటం చేశారు. దీన్ని చూసి ప్రజాపాలన అంటే ఇది కదా అని జనం చర్చించుకోవడం కన్పించింది. కాగా ప్రభుత్వం చేపట్టిన ఈ కార్యక్రమాన్ని ప్రజల కోసం వినియోగించి అందరి మన్ననలను చంద్రబాబు పొందగలిగారు. నాగులుప్పలపాడు మండలం మద్దిరాలపాడులో శుక్రవారం ఆయన నిర్వహించిన కార్యక్రమం అందుకు అద్దం పట్టింది.

(ఆంధ్రజ్యోతి, ఒంగోలు)

రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి 100 రోజులు పూర్తయిన సందర్భంగా ఆరు రోజులు గ్రామాలకు వెళ్లి ‘ఇది మంచి ప్రభుత్వం’ అనే కార్యక్రమాన్ని నిర్వహించాలని సీఎం చంద్రబాబు పిలుపునిచ్చారు. అందులోభాగంగా ఆయన తొలిరోజు కార్యక్రమాన్ని మద్దిరాలపాడు గ్రామంలో నిర్వహించి ప్రభుత్వం ప్రజాసేవకే పరిమితమన్న సంకేతాన్ని ఇవ్వగలిగారు. రమారమి రెండున్నర గంటలపాటు ఆయన ఆ గ్రామంలో గడిపారు. ఊకదంపుడు ఉపన్యాసాలకు పరిమితం కాకుండా ప్రజలతో మమేకమయ్యారు. గతంలో జగన్‌ ముఖ్యమంత్రి హోదాలో వచ్చినప్పుడు అధికారులు, పోలీసులు చేసే హడావుడి, ఆర్భాటాలు ఈ కార్యక్రమంలో మచ్చుకు కూడా కనిపించలేదు. గ్రామంలోని కొన్ని గృహాలకు వెళ్లిన చంద్రబాబు వారి సమస్యలు తెలుసుకోవడంతోపాటు గ్రామసభలో కూడా ప్రజలను పిలిచి మాట్లాడించి వారి పొగడ్తలకు పొంగిపోకుండా వారు తన దృష్టికి తెచ్చిన సమస్యలపై చంద్రబాబు సానుకూలంగా స్పందించారు. అప్పటికప్పుడు కొన్ని ప్రజోపకర నిర్ణయాలు తీసుకున్నారు.

పేద కుటుంబాలకు చేయూత

మధ్యాహ్నం రెండున్నర గంటల సమయంలో హెలికాప్టర్‌లో వచ్చిన చంద్రబాబు వెంటనే మద్దిరాలపాడు గ్రామంలోకి ప్రవేశించారు. తొలుత సభ వద్దకు వెళ్లకుండా కొందరు ఇళ్లకు వెళ్లి వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ఆ సందర్భంగా రెండు కుటుంబాల వారు చెప్పిన సమస్యలపై సానుకూలంగా స్పందించారు. ప్రత్యేకించి ఒక కుటుంబం వారు గత ప్రభుత్వంలో దగాపడిన విషయాన్ని గుర్తించి అప్పటికప్పుడు ప్రభుత్వపరంగా వారికి అందాల్సిన ఆర్థిక సహకారాన్ని కూడా అందించే ఏర్పాటు చేశారు. తొలుత ఆయన ముస్లింల ఇంటికి వెళ్లారు. ఇంటిలోని గృహిణి షేక్‌ బీబీసార తాను కూలి పనులకు వెళ్తానని, తన భర్త బేల్దారి పనులకు వెళ్తాడని చెప్పింది. వెంటనే చంద్రబాబు వారి పిల్లల గురించి వాకబు చేశారు. తన కుమార్తె రజియాబేగం 10వ తరగతి వరకూ చదువుకుందని, ఆర్థిక స్తోమత లేక చదువు ఆపేసి తనతో కూలి పనులకు తీసుకెళ్తున్నట్లు తెలిపింది. కుమారుడు కరిముల్లా 9వ తరగతి వరకూ చదువుకున్నాడని, అతను చదువు ఆపించి మెకానిక్‌గా పనికి పంపుతున్నట్లు వివరించింది. ఆశ్చర్చపోయిన చంద్రబాబు పిల్లల్నిఉద్దేశించి మీకు చదువుకునే ఉద్దేశం లేదా అని ప్రశ్నించారు. వారు చదువుకోవాలన్న ఆసక్తిని చంపుకొని కూలి పనులకు వెళ్తున్నామని చెప్పారు. ఎందుకు వారిని చదివించడం లేదని బీబీసారను అడగ్గా.. గతంలో టీడీపీ ప్రభుత్వంలో 2017-18లో తమకు ఇళ్లు మంజూరు చేశారని తెలిపారు. వెంటనే ఇంటి నిర్మాణం చేపట్టామని, మీరు ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో ప్రభుత్వం నుంచి రావాల్సిన డబ్బుల్లో రెండు బిల్లులు ఇచ్చారని చెప్పారు. ఆ తర్వాత వచ్చిన జగన్‌ ప్రభుత్వంలో తమకు ఒక్క రూపాయి కూడా రాలేదని, ఆ ఇంటి కోసం అప్పు చేయాల్సి వచ్చిందని చెబుతూ కన్నీటిపర్యంతమయ్యారు. కుటుంబాన్ని ఈదుకుంటూ అప్పు తీర్చుకునేందుకు పిల్లలను కూలి పనులకు పంపక తప్పలేదని వివరించారు. తర్వాత ఆమెను గ్రామసభకు పిలిపించారు. గృహ నిర్మాణానికి సంబంధించి ఇంకా వారికి రావాల్సిన రూ.65,150లను ఈరోజే ఇవ్వాలని కలెక్టర్‌ను ఆదేశించారు. అలాగే వారి పిల్లలిద్దరినీ చదివించే బాధ్యత తీసుకుంటున్నట్లు ప్రకటించారు. వెంటనే వారిని పాఠశాలలో చేర్చాలని ఆదేశించారు. వారి పాప రజియాబేగం రెసిడెన్షియల్‌ పాఠశాలలో చదువుకోవాలనుకుంటే అవసరమైన ఏర్పాటు చేయాలని సభలో ఉన్న విద్యుత్‌శాఖ మంత్రి రవికుమార్‌కు సూచించారు. ఆ తర్వాత బీబీసార మైక్‌ తీసుకొని సీఎం ఇచ్చిన చేయూతకు హర్షం వ్యక్తం చేస్తూ కన్నీటిపర్యంతమై కృతజ్ఞతలు తెలిపారు. గత ప్రభుత్వంలో ఇంటి నిర్మాణానికి రావాల్సిన నిధులు ఆగిపోగా మళ్లీ మీరు వస్తే మా కల నెరవేరుతుందని ఆశించామన్నారు. తమ కల మరింత స్థాయిలో నిజం కావటంతో మాటలు రావడం లేదన్నారు. మీకు రుణపడి ఉంటామని మళ్లీమళ్లీ మీరే సీఎం కావాలంటూ కన్నీరు పెట్టుకుంటూ మాట్లాడారు.

అందరికీ ఇళ్లు మంజూరు

బీబీసార ఇంటి తర్వాత ముఖ్యమంత్రి కల్లుగీత కార్మికుడు ఆలుదాసు శ్రీను ఇంటికి వెళ్లారు. నిరుపేద అయిన తమకు అన్ని అర్హతలు ఉన్నా గత ప్రభుత్వంలో ఇల్లు మంజూరు చేయలేదని వారు చెప్పారు. అందరి చుట్టూ తిరిగినా పని జరగలేదని వివరించారు. పైగా తాము వాళ్ల పార్టీ కాదనే నెపంతో పక్కన పెట్టారని చెప్పారు. వాళ్లకు వెంటనే ఇంటిని మంజూరుచేయడంతోపాటు కొత్త మద్యం పాలసీలో భాగంగా ఏర్పాటు చేసే దుకాణంలో ఒకటి వారికి కేటాయించాలని అధికారులను చంద్రబాబు ఆదేశించారు. అలాగే గ్రామంలో ఇళ్లులేని వారు సుమారు 200 కుటుంబాలు ఉన్నాయని అధికారులు ఇచ్చిన నివేదికను పరిశీలించి అందరికీ ఇళ్లు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు.

వెంటనే ట్రై సైకిల్‌ ఇవ్వండి

గ్రామసభలో తనకు ఎదురుగా ప్రజల్లో ఉన్న ఒక దివ్యాంగుడిని చూసి అతడి సమస్యలను చంద్రబాబు అడిగారు. ఆయన ట్రై సైకిల్‌ కూడా లేని విషయాన్ని చెప్పగానే వెంటనే ఇవ్వాలని అధికారులను ఆదేశించారు దివ్యాంగుడినైనప్పటికీ పింఛన్‌ రాని విషయాన్ని సీఎం దృష్టికి ఆయన తీసుకెళ్లగా నిబంధనలకు అనుగుణంగా పింఛన్‌ మంజూరు చేయాలని అధికారులకు సూచించారు. ఆ సందర్భంగా చంద్రబాబు ప్రభుత్వ డాక్టర్లను హెచ్చరిస్తూ గతంలో తప్పుడు సదరమ్‌ సర్టిఫికెట్లు ఇచ్చిన విషయం బయటకు వచ్చిందని, భవిష్యత్తులో అలాంటి పనులు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

సర్పంచ్‌ ఆవేదన.. బాబు స్పందన

గ్రామ సభకు అధ్యక్షత వహించిన సర్పంచ్‌ స్వర్ణ అనురాధ మాట్లాడుతూ తాను ఎంసీఏ చదువుకు న్నానని, గ్రామాభివృద్ధి కోసం గత ప్రభుత్వంలో అనేక ప్రయత్నాలు చేశానన్నారు. విద్యుత్‌, తాగునీటి సమస్యపై సంబంధిత అధికారుల చుట్టూ తిరిగానని వివరించారు. ఎవ్వరూ సానుకూలంగా స్పందించకపోగా తాను తెలుగుదేశం పార్టీకి చెందిన సర్పంచ్‌నంటూ తన ప్రతిపాదనలను తోసిపుచ్చారని భావోద్వేగంతో వివరించారు. ఈ ప్రభుత్వం తమకు న్యాయం చేయకపోతే తాను పదవిలో ఉండీ వ్యర్థం అన్నట్లు మాట్లాడారు. దీనిపై స్పందించిన సీఎం.. ‘మీరు నిరాశ పడకండి. మన ప్రభుత్వం అంతా మంచే చేస్తుంది. ఇది మంచి ప్రభుత్వం’ అంటూ అనేక గ్రామ సమస్యల పరిష్కారానికి అవసరమైన ఆదేశాలు ఇచ్చారు. సర్పంచ్‌ అనురాధ మరింత ఉత్సాహంగా పనిచేసే విధంగా ప్రోత్సహించి సభికుల మన్ననలు అందుకున్నారు.

హంగూ ఆర్భాటం లేకుండా..

ఎలాంటి హంగూ ఆర్భాటాలు లేకుండా కార్యక్రమం నిర్వహించారు. గ్రామంలో పర్యటన సందర్భంగా కానీ, గ్రామసభ సందర్భంగా కానీ పోలీసుల అడ్డంకులు, నాయకులు, ప్రజాప్రతినిదుల ఆర్భాటాలు కనిపించలేదు. అధికారులు ఎంపిక చేసిన వారి ప్రసంగాలకే పరిమితం కాకుండా సభకు వచ్చిన వారిని కొందరిని పిలిచి మాట్లాడించి మా ప్రభుత్వం మీకోసం ఉంది. నిర్భయంగా ముందుకు వచ్చి పనులు చేయించుకోండి అంటూ కార్యక్రమాన్ని నిర్వహించి యావత్తు గ్రామ ప్రజల మన్ననలు పొందగలిగారు.

Updated Date - Sep 21 , 2024 | 01:04 AM