ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

సంక్షేమం ఓకే.. అభివృద్ధి కావాలి

ABN, Publish Date - Nov 03 , 2024 | 11:55 PM

జిల్లా అభివృద్ధి, ఉపాధి అవకాశాల మెరుగుకు ఉపకరించే కీలక పథకాలు, ప్రాజెక్టులపై ఐదేళ్ల వైసీపీ పాలనలో తీవ్ర నిర్లక్ష్యం కొనసాగింది. సాగు, తాగునీటి ప్రాజెక్టుల్లో పురోగతి కరువైంది. పారిశ్రామిక రంగం పడకేసింది. విద్య, వైద్యం, రోడ్లు వంటి మౌలిక సదుపాయాల కల్పనలోనూ ఉదాసీనత కన్పించింది. అధికారులు, ప్రజాప్రతినిధులను సమన్వయంతో నడిపించడంతోపాటు ప్రభుత్వానికి, జిల్లా యంత్రాంగానికి మధ్య వారధిలా పనిచేయాల్సిన నాటి ఇన్‌చార్జి మంత్రులు నామమాత్రంగా మిగిలారు.

వెలిగొండ టన్నెల్‌ ముఖద్వారం

వైసీపీ పాలనలో జిల్లాపై నిర్లక్ష్యం

సమస్యలతో ప్రజలు సతమతం

పురోగతి లేని ప్రాజెక్టులు

మెరుగు పడని ఉపాధి అవకాశాలు

నామమాత్రంగా వ్యవహరించిన నాటి ఇన్‌చార్జి మంత్రులు

డీఆర్సీ నిర్వీర్యం

కూటమి ప్రభుత్వం వచ్చాక మళ్లీ దృష్టి

నేడు ఆనం నేతృత్వంలో జిల్లాస్థాయి సమీక్ష

జిల్లా అభివృద్ధి, ఉపాధి అవకాశాల మెరుగుకు ఉపకరించే కీలక పథకాలు, ప్రాజెక్టులపై ఐదేళ్ల వైసీపీ పాలనలో తీవ్ర నిర్లక్ష్యం కొనసాగింది. సాగు, తాగునీటి ప్రాజెక్టుల్లో పురోగతి కరువైంది. పారిశ్రామిక రంగం పడకేసింది. విద్య, వైద్యం, రోడ్లు వంటి మౌలిక సదుపాయాల కల్పనలోనూ ఉదాసీనత కన్పించింది. అధికారులు, ప్రజాప్రతినిధులను సమన్వయంతో నడిపించడంతోపాటు ప్రభుత్వానికి, జిల్లా యంత్రాంగానికి మధ్య వారధిలా పనిచేయాల్సిన నాటి ఇన్‌చార్జి మంత్రులు నామమాత్రంగా మిగిలారు. ఇక వారి పర్యవేక్షణలో నిర్వహించే కీలకమైన జిల్లా సమీక్షా మండలి (డీఆర్సీ) సమావేశాలు మొక్కుబడిగా మారాయి. ఈనేపథ్యంలో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం సంక్షేమ పథకాలతో ప్రజలకు ఉపశమనం కల్పించింది. జిల్లా శాశ్వత అభివృద్ధి, మౌలిక సదుపాయాల మెరుగు, ఉపాధి కల్పనకు సంబంధించి అంశాలు మాత్రం ముందుకు కదలడం లేదు. వాటికి నిధుల సమస్య ప్రతిబంధకంగా కనిపిస్తోంది. ఈ పరిస్థితుల్లో ప్రస్తుత ప్రభుత్వం వచ్చాక తొలి డీఆర్సీ సమావేశం సోమవారం జరగనుంది. అందులో అభివృద్ధి అంశాలు, నిధుల అవసరం, తక్షణ సమస్యల పరిష్కారంపై చర్చించి సానుకూల నిర్ణయాలు తీసుకోవాలని ప్రజానీకం కోరుతోంది.

ఒంగోలు, నవంబరు 3 (ఆంధ్రజ్యోతి) : జిల్లాలో కీలక ప్రాజెక్టులు, మౌలిక రంగాల అభివృద్ధి గత వైసీపీ పాలనలో ‘ఎక్కడ వేసిన గొంగళి అక్కడే’ అన్న చందంగా తయారైంది. ప్రజలు సవాలక్ష సమస్యలతో అల్లాడిపోయారు. వాటి పరిష్కారానికి చర్యలు తీసుకోవాల్సిన నాటి పాలకులు పట్టించుకున్న పరిస్థితి లేకుండాపోయింది. అత్యంత ప్రధానమైన డీఆర్సీ సమావేశాలు కూడా మొక్కుబడిగా మారాయి. గడచిన ఐదేళ్లలో జిల్లాకు నలుగురు ఇన్‌చార్జి మంత్రులు నియమితులయ్యారు. తొలి ఇద్దరూ ఒక్క సమావేశాన్ని కూడా ఏర్పాటు చేయకుండానే మారిపోయారు. అనంతరం వచ్చిన ఇద్దరిలో విశ్వరూప్‌ అడపాదడపా నిర్వహించినా ఎక్కువ కాలం కొవిడ్‌తోనే సరిపోయింది. ఆతర్వాత నియమితులైన మేరుగ నాగార్జున మొక్కుబడిగా సమావేశాలు నిర్వహించారు. పర్యవేక్షణలో నామమాత్రంగానే మిగిలారు.

అభివృద్ధి అంశాలపై కూటమి ప్రభుత్వం దృష్టి

ఈ నేపథ్యంలో రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం అటు రాష్ట్ర స్థాయిలో, ఇటు జిల్లాలో ఎక్కడికక్కడ అభివృద్ధి అంశాలు, పాలన మెరుగుపై దృష్టి సారించింది. ఈవ్యవహారాలలో అత్యంతక కీలకంగా పనిచేసే జిల్లా ఇన్‌చార్జి మంత్రులను నియమించింది. వారంతా తమకు కేటాయించిన జిల్లాల్లో పర్యటనలు ప్రారంభించారు. సమీక్షలు నిర్వహిస్తున్నారు. జిల్లాకు ఇన్‌చార్జి మంత్రిగా నియమితులైన రాష్ట్ర దేవదాయశాఖ మంత్రి అనం రామనారాయణరెడ్డి కూడా జిల్లాపై దృష్టి పెట్టారు. పొరుగున ఉన్న నెల్లూరు జిల్లాకు చెందిన రామనారాయణరెడ్డి సీనియర్‌ రాజకీయవేత్త. జిల్లాలోని ఆర్థిక, సామాజిక అంశాలతోపాటు రాజకీయ, భౌగోళిక పరిస్థితులపై అవగాహన ఉంది. ఆయన అనుభవం, అవగాహన జిల్లా అబివృద్ధి, పాలన వ్యవహారాలలో లోటుపాట్ల సవరణకు ఉపకరించనుంది.

ఐదేళ్లుగా ఎక్కడి పనులు అక్కడే

జిల్లాకు గతంలో టీడీపీ ప్రభుత్వం మంజూరు చేసి శంకుస్థాపనలు చేసిన ట్రిపుల్‌ ఐటీ, యూనివర్సిటీల నిర్మాణాలకు వైసీపీ పాలనలో ఒక్క ఇటుక కూడా పెట్టినపాపాన పోలేదు. అలాగే పారిశ్రామిక ప్రగతికి ఉపకరించే దొనకొండ కారిడార్‌, కనిగిరి నిమ్జ్‌ వంటి వాటి ఊసే కరువైంది. మార్కాపురం మెడికల్‌ కాలేజీ, దోర్నాల గిరిజన సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణాల్లో కదలిక లేదు. ఆర్‌అండ్‌బీ, పంచాయతీ రాజ్‌ రోడ్లు అధ్వానంగా తయారయ్యాయి. ఇలాంటి అభివృద్ధి అంశాలపై కూటమి ప్రభుత్వం దృష్టి సారించాల్సిన అవసరం కనిపిస్తోంది.

గాడిలో పాలన, పథకాలు

కూటమి ప్రభుత్వం వచ్చాక జిల్లాలో సంక్షేమ పథకాల లబ్ధి ప్రజలకు అందుతోంది. ప్రధానంగా పింఛన్‌లను పెంచింది. అన్న క్యాంటీన్‌లను పునరుద్ధరించింది. రేషన్‌ పంపిణీ, ఉద్యోగుల జీతాలు, సామాజిక పింఛన్‌లను సకాలంలో అందిస్తోంది. ఇతర వర్గాలకు చెందిన పథకాల్లోనూ కదలికవచ్చి క్రమపద్ధతిలో సాగుతున్నాయి. అధికారుల బదిలీల్లో మెజారిటీ పూర్తితో కొంత మేర పాలన గాడిలో పడుతోంది. అయితే శాశ్వత అభివృద్ధి, మౌలిక సదుపాయాల మెరుగు, ఉపాధి కల్పన అంశాలకు సంబంధించినవి ముందుకు కదలడం లేదు. వాటికి నిధుల సమస్య ప్రతిబంధకంగా కనిపిస్తోంది.


నీటి ప్రాజెక్టులకు నిధులు అవసరం

వెలిగొండ పెండింగ్‌ పనులు, నిర్వాసితుల పునరావాసానికి ఈఏడాది రూ.2వేల కోట్లు అవసరం. అలా కేటాయిస్తేనే కనీసం రెండేళ్లకు అయినా ప్రాజెక్టు నుంచి నీరిచ్చే అవకాశం ఉంది. గుండ్లకమ్మ ప్రాజెక్టు మరమ్మతులు, పంట కాలువల కోసం మరో రూ.100 కోట్లు కావాలి. ఇక ఇతర ప్రాజెక్టులు. మీడియం, మైనర్‌ ఇరిగేషన్‌ పరిధిలో అనేక నీటి వనరులు కనీస మరమ్మతులు లేక అధ్వానంగా తయారయ్యాయి. ఎన్‌ఎస్పీ ఆయకట్టు పరిస్థితి దారుణంగా ఉంది. నీరు సక్రమంగా వదిలితే ఏకాలువ ఎప్పుడు ఎక్కడ తెగిపోతుందోనన్న పరిస్థితి నెలకొంది. క్షేత్రస్థాయిలో లస్కర్లు, వర్క్‌ఇన్‌స్పెక్టర్లు లేక పర్యవేక్షణ కొరవడింది. కేంద్ర ప్రభుత్వ భాగస్వామ్యంతో చేపట్టిన జలజీవన్‌ మిషన్‌ పనులు నిధులు లేక నీరసించిపోయాయి. ఫలితంగా వర్షాకాలంలోనూ పశ్చిమ ప్రాంతంలో ట్యాంకర్లతో నీటి సరఫరా చేయాల్సిన దుస్థితి నెలకొంది.

ఎనిమిది శాఖలకు చెందిన అంశాలతో అజెండా

జిల్లా ఇన్‌చార్జి మంత్రి ఆనం రామనారాయణరెడ్డి పర్యవేక్షణలో సోమవారం జిల్లా అభివృద్ధి సమీక్షా సమావేశం జరగనుంది. ప్రకాశం భవన్‌ రెండో అంతస్తులోని కలెక్టర్‌ సమావేశపు హాలులో ఉదయం 10 గంటలలకు ఇది ప్రారంభమవుతుంది. మధ్యాహ్నం వరకు కొనసాగనుంది. భోజనం అనంతరం కీలక అధికారులతో మంత్రులు మాట్లాడే అవకాశం ఉంది. ఆనం ఆదేశాలతో ఎనిమిది శాఖలకు చెందిన కీలక విభాగాలకు సంబంధించిన అంశాలపై అఽధికారులు అజెండాను రూపొందించారు. అందులో వ్యవసాయ, అనుబంధ రంగాలు, ఇరిగేషన్‌, అర్‌అండ్‌బీ, పీఆర్‌లో చేపట్టిన గుంతల రహిత రోడ్లు, డ్వామా, వైద్యారోగ్యం, ఆర్‌డబ్ల్యూఎస్‌, రెవెన్యూ ఉన్నాయి. వీటితోపాటు ఇతర అభివృద్ధి అంశాలు, నిధుల అవసరం, తక్షణ సమస్యల పరిష్కారంపై సమావేశంలో చర్చించాల్సిన అవసరం ఉంది. అవసరమైన వాటికి ప్రభుత్వం నుంచి నిధులు తీసుకురావడంలోనూ ఇన్‌చార్జి మంత్రి ఆనం రామనారాయణరెడ్డి చొరవ చూపాలి. అదేసమయంలో జిల్లాలో వివిధ శాఖల్లో వెలుగుచూస్తున్న అవినీతి, అక్రమాలు, వాటిపై విచారణలు, సంబంధిత అధికారుల పనితీరుపైనా దృష్టి సారించి కట్టడి చేయాల్సిన అవసరం ఉంది.

Updated Date - Nov 04 , 2024 | 12:14 AM