కీలక శాఖలపై సమీక్ష జరిగేనా?
ABN, Publish Date - Oct 22 , 2024 | 01:05 AM
జిల్లాలో ప్రజానీకం ఎదుర్కొంటున్న సమస్యలపై జడ్పీ సర్వసభ్య సమా వేశంలో చర్చ జరిగేనా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అజెండాలో కీలక అంశాలు ఉన్నా పూర్తిస్థాయిలో చర్చించే అవకాశాలు కనిపించడం లేదు.
నేడు జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం
ఒంగోలు కలెక్టరేట్, అక్టోబరు 21 (ఆంధ్రజ్యోతి) : జిల్లాలో ప్రజానీకం ఎదుర్కొంటున్న సమస్యలపై జడ్పీ సర్వసభ్య సమా వేశంలో చర్చ జరిగేనా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అజెండాలో కీలక అంశాలు ఉన్నా పూర్తిస్థాయిలో చర్చించే అవకాశాలు కనిపించడం లేదు. గత రెండు పర్యాయాలు జరిగిన సమావేశాలే అందుకు నిదర్శనం. జడ్పీ సర్వసభ్య సమావేశం మంగళవారం ఉదయం 10.30 గంటలకు స్థానిక పాత జిల్లా పరిషత్ సమావేశపు హాలులో చైర్‌పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ అధ్యక్షతన జరగనుంది. అందులో చర్చించేందుకు జిల్లా నీటి యాజమాన్య సంస్థ (డ్వామా), డీఆర్‌డీఏ, గృహ నిర్మాణ, విద్య, విద్యుత్, వైద్య, గ్రామీణ నీటి సరఫరా-పారిశుధ్యం, పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ శాఖలకు చెందిన అంశాలను అజెండాలో చేర్చారు. ఈ తొమ్మిది శాఖలు కీలకం కాగా ఆయా అంశాలపై సభ్యులు సమావేశంలో చర్చించి అధికారులకు దిశానిర్దేశం చేయాల్సి ఉంది. అయితే కీలకమైన సమావేశానికి గత రెండు పర్యాయాలు అధికారపార్టీకి చెందిన శాసనసభ్యులు, ఇతర ముఖ్యనేతలు రాలేదు. ప్రస్తుతం జరిగే సమావేశంలో కూడా ఇదే పరిస్థితి ఉంటుందన్న అనుమానం వ్యక్తమవుతోంది. మరోవైపు ఈ సమావేశంలో సభ్యులు క్షేత్రస్థాయిలోని సమస్యలపై ప్రస్తావిస్తున్నా వాటి గురించి పట్టించుకుంటున్న పరిస్థితి లేకుండా పోయింది. మంగళవారం జరిగే సమావేశంలోనూఐనా ప్రజా సమస్యలపై పూర్తిస్థాయిలో చర్చిస్తారా? లేదా గత సమావేశపు తరహాలో మొక్కుబడిగా నిర్వహించి ముగిస్తారా? అన్నది వేచిచూడాల్సి ఉంది.
Updated Date - Oct 22 , 2024 | 01:05 AM