తీగలేరు పనులు కొనసాగేనా?
ABN, Publish Date - Nov 09 , 2024 | 01:17 AM
జిల్లాలోనే వెనుకబడిన మండలమైన పుల్లలచెరువు మండలం కరువు కాటకాలకు పుట్టినిల్లు. గత 15 సంవత్సరాల నుంచి కనీస వర్షపాతం నమోదు కాక తాగు, సాగు నీటి కోసం ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు.
పుల్లలచెరువు, నవంబరు 8 (ఆంధ్రజ్యోతి): జిల్లాలోనే వెనుకబడిన మండలమైన పుల్లలచెరువు మండలం కరువు కాటకాలకు పుట్టినిల్లు. గత 15 సంవత్సరాల నుంచి కనీస వర్షపాతం నమోదు కాక తాగు, సాగు నీటి కోసం ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. మండలంలో నూతనంగా 800 వందల అడుగుల వరకు బోర్లు వేయించినా గంగ జాడ కనిపించడం లేదు. పుల్లలచెరువు మండలంలో కరువు కష్టాల నుంచి శాశ్వత విముక్తి కలగాలంటే వెలిగొండ ప్రాజెక్టును పూర్తి చేసి తీగలేరు-5 కాలువను పుల్లలచెరువు చిన్నకండ్లేరు చెరువుకు అనుసంధానం చేయడమే మార్గం.
తీగలేరును చిన్నకండ్లేరు చెరువుకు అనుసంధానం చేయడం ద్వారా, పుల్లలచెరువు మండలంతో పాటు ఎర్రగొండపాలెం మండలానికి కూడా ఎంతో ప్రయోజనం వుంది. సాగు, తాగు నీటికి ఎటువంటి డోకా వుండదు. మండలంలోని 15 పంచాయతీలకు తాగు నీరు, 10 వేల ఎకరాల సాగు నీటి సమస్య శాశ్వతంగా పరిష్కారం అవుతుంది. ఈ అనుసందానంపై గతంలో ప్రభుత్వం ప్రకటించిన మ్యాపు ప్రకారం పుల్లలచెరువు మండలంలోని 10 గ్రామాలకు మాత్రమే ప్రయోజనం చేకురుతుంది. యండ్రపల్లి, మల్లాపాలెం, ఉమ్మడివరం, పుల్లలచెరువు, తెల్లగట్ల, గంగవరం పంచాయతీలకు ప్రయోజనం ఉండది. అయితే చిన్నకండ్లేరు వద్ద అనుసంధానం చేయడం ద్వారా ఈ ఐదు గ్రామాలకు కూడా ఉపయోగం చేకూరనుంది.
పుల్లలచెరువుకు ఎగువన వుండే ఈ చెరువు నాలుగు కొండల మధ్యలో చిన్నకట్టతో ఏర్పడింది. ఈ చెరువుకు నల్లమల అటవీ ప్రాంతంలో చిన్న చిన్న వాగులు అనుసంధానంతో పెద్ద వరద ప్రవాహం వుంది. చిన్నకండ్లేరుకు దిగువ వైపున ఎల్లప్పుడు వాగులో నీరు ఉండడంతో బోర్లలో సమృద్ధిగా నీళ్లు వచ్చేవి. చిన్నకండ్లేరు గత 15 సంవత్సరాల నుంచి నీరుసరిగా లేకపోవడంతో పుల్లలచెరువు మండలంలో తాగు, సాగు నీటీ కోసం ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తీగలేరు-5 కెనాల్‌ను పొడిగించడం ద్వారా ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపవచ్చు.
మ్యాపులో పలుమార్లు మార్పులు
ఈ తీగలేరును చిన్నకండ్లేరు చెరువుకు అనుసంధానం చేయాలని వెలిగొండ ప్రాజెక్టు డీపీఆర్‌లోనే రెండు దశాబ్దాల కిత్రమే పొందుపరిచారు. అయి తే మధ్యలో వచ్చిన కాంట్రాక్టర్ ఖర్చుకు వెరసి కొమరోలు గ్రామంలోని దువ్వలేరు కాలువకు అనుసంధానం చేయాలని చూడగా స్థానికులు అడ్డుకున్నారు. దీనిపై 2014 టీడీపీ ప్రభుత్వంలో అప్పటి నాయకులు అప్పటి నీటి పారుదలశాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వర రావు దృష్టికి సమస్యను తీసుకెళ్లారు. దీంతో ఆయన కాలువ పొడి గింపునకు అనుమతులిచ్చారు. తరువాత వచ్చిన వైసీపీ ప్రభుత్వం టెండర్లు పిలిచినా కాంట్రాక్టర్లు మందుకు రాలేదు. దీంతో ఆ పనులు ముందుకు సాగలేదు. గత ప్రభుత్వం నిర్లక్ష్యంతో పనులు పూర్తిగా నిలిచి పోయాయి. పొడగింపు పనులు మరుగున పడ్డాయి. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి తీగలేరు కాలువను పొడిగించాలని ప్రజలు కోరుతున్నారు.
Updated Date - Nov 09 , 2024 | 01:17 AM