వైసీపీ నేత దగా
ABN, Publish Date - Sep 12 , 2024 | 01:25 AM
వైసీపీ ప్రభుత్వ హయాంలో ఆ పార్టీ నాయకులు కొంతమంది ప్రజలను ఎన్ని రకాలుగా మోసం చేయాలో అన్ని రూపాల్లో దగా చేసి కోట్లాది రూపాయలు జేబులో వేసుకున్న ఘటనలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి.
వ్యవసాయ పరికరాల పేరిట దాదాపు రూ.4 కోట్లు వసూలు
ఏడాది నుంచి పూర్తిగా ఇవ్వని వైనం
తాళ్లూరు, ముండ్లమూరు మండలాల రైతుల గగ్గోలు
ఎస్పీ దామోదర్‌కు ఫిర్యాదు
విచారణ చేపట్టిన ముండ్లమూరు ఎస్సై
దర్శి, సెప్టెంబరు 11 : వైసీపీ ప్రభుత్వ హయాంలో ఆ పార్టీ నాయకులు కొంతమంది ప్రజలను ఎన్ని రకాలుగా మోసం చేయాలో అన్ని రూపాల్లో దగా చేసి కోట్లాది రూపాయలు జేబులో వేసుకున్న ఘటనలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. మొన్నటి ఎన్నికల్లో జగన్ ప్రభుత్వం పోయి టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో వారి అవినీతి, అక్రమాలను మోసపోయిన వారు ధైర్యంగా బయటకొచ్చి చెబుతున్నారు. ఆ వివరాలేంటో చూద్దాం.. తాళ్లూరు మండలానికి చెందిన వైసీపీ నాయకుడు నాగార్జునరెడ్డి ఐటీసీ కంపెనీలో ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. కొందరు రైతులకు ఐటీసీ ద్వారా సబ్సిడీపై సగం ధరకు ట్రాక్టర్లు, ఇతర పనిముట్లు ఇప్పిస్తానని ఊరూరా ప్రచారం చేశాడు. తొలుత కొందరి రైతులు వద్ద డబ్బులు తీసుకొని చెప్పిన ప్రకారం ట్రాక్టర్లు, పనిముట్లు తెచ్చి ఇచ్చాడు. ఒక కంపెనీ ద్వారా ట్రాక్టర్లు కొనుగోలు చేసి రైతులకు ఇచ్చి ఐటీసీ సంస్థ ద్వారా తెచ్చానని తెగ ప్రచారం చేశాడు. దీంతో చాలామంది రైతులు నమ్మి అతనికి డబ్బు ఇచ్చారు.
ఐటీసీ సంస్థ బ్రాండ్‌తో వసూళ్లు ఇలా...
దేశవ్యాప్తంగా ఐటీసీ సంస్థకు మంచి పేరు ఉండటంతో ఆ నమ్మకమే మోసానికి పునాదిగా వైసీపీ నేత వాడుకున్నాడు. దీంతో వందలాది మంది రైతులు ట్రాక్టర్లు, పనిముట్ల కోసం నాగార్జునరెడ్డికి డబ్బులు ఇచ్చారు. అప్పుడప్పుడూ ఒక్కో ఊరిలో ఒకరికిట్రాక్టర్, కొన్ని పరికరాలు కొనుగోలు చేసి ఇస్తూ మిగిలిన వారికి ఎరవేశాడు. దీంతో చాలా మంది డబ్బులు కట్టారు. ఆ క్రమంతో సకాలంలో పరికరాలు ఇవ్వకపోవడంతో గట్టిగా అడిగిన వారికి అదిగో వస్తున్నాయ్, ఇదిగో వస్తున్నాయ్ అంటూ వాయిదాలు చెబుతూ వచ్చాడు. ఈ వ్యవహారం గత మూడేళ్లలో జోరుగా జరిగింది. కొంతమంది రైతులకు ట్రాక్టర్లు, పరికరాలు అందించడంతో మిగిలిన వారు కొద్ది రోజుల తర్వాతైనా వస్తాయన్న ఆశతో ఎదురుచూశారు. డబ్బులు చెల్లించి ఏడాది దాటినప్పటికీ సరైన సమాధానం ఇవ్వకుండా సాకులు చెబుతున్నాడు. అప్పట్లో వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు అధికారులకు ఫిర్యాదు చేసినా ఉపయోగం ఉండదని రైతులు మౌనం వహించారు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో కొద్దిరోజుల క్రితం ముండ్లమూరు మండలానికి చెందిన టి.నారాయణరెడి,్డ మరికొందరు రైతులు జిల్లా ఎస్పీ దామోదర్‌కు ఫిర్యాదు చేశారు. రైతుల ఫిర్యాదు మేరకు విచారణ జరిపి న్యాయం చేయాలని ఎస్పీ దామోదర్ డీఎస్పీ లక్ష్మీనారాయణను ఆదేశించారు.
విచారణలో ఒప్పుకున్న నిందితుడు
బాధిత రైతులు కొందరు డీఎస్పీ లక్ష్మీనారాయణను కలిసి వసూళ్ల దందాను వివరించారు. ఆయన వెంటనే ముండ్లమూరు ఎస్సై నాగరాజును విచారణ చేయాలని ఆదేశించారు. ఆ మేరకు రైతులు ముండ్లమూరు ఎస్సైను కలిసి పరిస్థితిని వివరించారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న నాగార్జునరెడ్డిని ఎస్సై వెంటనే పిలిపించి మాట్లాడారు. తాను ట్రాక్టర్లు, రొటావేటర్లు, ట్రక్కులు, ఇతర వ్యవసాయ పరికరాలు సబ్సిడీపై సగం ధరకు ఇప్పిస్తానని డబ్బులు తీసుకున్న మాట వాస్తవమేనని విచారణలో నాగార్జునరెడ్డి అంగీకరించాడు. తనకు కొంత గడువు ఇస్తే రైతులు వద్ద తీసుకున్న సొమ్ము తిరిగి చెల్లిస్తానని చెప్పినట్లు సమాచారం. ఇలా సుమారు రూ.4 కోట్లు వసూలు చేసినట్లు బాధితులు చెబుతున్నారు. అధికారులు తమ సొమ్ము వీలైనంత త్వరగా ఇప్పించి న్యాయం చేయాలని కోరుతున్నారు.
Updated Date - Sep 12 , 2024 | 01:25 AM