కుయ్..కుయ్ దోచేయ్
ABN, Publish Date - Nov 21 , 2024 | 12:44 AM
తమ సంబంధీకుల మృతి చెందారన్న బాధతో వీరు కుమిలి పోతుండగా.. పార్ధివదేహం తరలింపులో ఆస్పత్రి సిబ్బంది, ప్రైవేటు అంబులెన్సుల నిర్వాహకలు కుమ్మక్కై అడ్డంగా దోచేస్తున్నారు.
ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రి వద్ద ప్రైవేటు అంబులెన్స్ నిర్వాహకుల దోపిడీ
ఆస్పత్రి ఉద్యోగులే దళారులు
కలెక్టర్ చెప్పిన ధరలు అమలు చేయడంలో అధికారుల వైఫల్యం
గగ్గోలు పెడుతున్న బాధిత బంధువులు
ఏలూరు క్రైం, నవంబరు 20(ఆంధ్రజ్యోతి): బుట్టాయిగూడెం మండలం ముప్పినివారిగూడెంకు చెందిన ఓ వృద్దురాలు అనారోగ్యానికి గురికాగా ఏలూరు ప్రభుత్వాస్పత్రిలో చేర్పించగా ఆమె మరణించింది. అక్కడి వార్డు సిబ్బంది హడావుడి చేసి మృతదేహాన్ని వెంటనే తీసుకువెళ్ళిపోవాలని ఆమె కుమారుడిని కంగారు పెట్టాడు. అతను మహాప్రస్ధానం అంబులెన్సు కోసం ఆరా తీయగా అందుబాటులో లేవని చెప్పారు. చివరకు ప్రైవేటు అంబులెన్సుకు పది వేలు చెల్లించి మృతదేహాన్ని తమ స్వగ్రామానికి తీసుకువెళ్లారు. 72 కిలోమీటర్ల దూరానికి 3,520 రూపాయలు వసూలు చేయాల్సి ఉండగా రూ.పది వేలు వసూలు చేశారు.
ఈ నెల 17వ తేదీ రాత్రి భీమడోలుకు చెందిన మృతదేహాన్ని రూ.6,500 ఆస్పత్రి ఉద్యోగి ప్రైవేటు అంబులెన్సు కిరాయి మాట్లాడి పంపించాడు. వాస్తవానికి రూ.2,400 ప్రైవేటు అంబులెన్సుల వారు తీసుకోవాలి. కాని 4,100 రూపాయలు అధికంగా వసూలు చేశారు.
తమ సంబంధీకుల మృతి చెందారన్న బాధతో వీరు కుమిలి పోతుండగా.. పార్ధివదేహం తరలింపులో ఆస్పత్రి సిబ్బంది, ప్రైవేటు అంబులెన్సుల నిర్వాహకలు కుమ్మక్కై అడ్డంగా దోచేస్తున్నారు. ఏలూరు ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందు తూ ఎవరైనా రోగి మరణించినా, రిఫరల్‌కు బయట ఆస్పత్రులకు తీసుకెళ్లాలన్నా ఆస్పత్రి వార్డులలో కొందరు ఎంఎన్‌వోలు, వార్డు బాయ్‌లు క్షణాల్లో ప్రైవేటు అంబులె న్సుల వారికి సమాచారం ఇస్తున్నారు. ఇదే అదనుగా వారు అధిక ధరలు వసూలు చేస్తున్నారు. ఇందులో 10 నుంచి 20 శాతం వరకు ఆ సొమ్ములను ఎంఎన్‌వోలకు, వార్డు బాయ్‌లకు ఇవ్వడం బహిరంగ రహస్యం.
కరోనా సమయంలో ఈ పరిస్థితులు ఏర్పడితే అప్పటి కలెక్టర్ ఆధ్వర్యంలో రవాణా శాఖ అధికారులు, రెవెన్యూ శాఖ అధికారులు, ఆస్పత్రి అధికారులు ఒక కమిటీగా ఏర్పడి ప్రైవేటు అంబులెన్సుల ధరలను నిర్ణయిస్తూ 2021 మే 9న కలెక్టర్ జిల్లా మేజిస్ట్రేట్ హోదాలో ఉత్తర్వులు జారీ చేశారు. వాటిని అమలుచేయాలని పోలీసు, రవాణా, రెవెన్యూ, ఆస్పత్రి అధికారులకు ఉత్తర్వులు జారీచేశారు. కొంతకాలంపాటు ప్రైవేటు అంబులెన్సుల వారు సజావుగా ఆ ధరల ప్రకారం తీసుకున్న తర్వాత క్రమేపీ వారి ఇష్టా రాజ్యంగా మారింది. 2023 ఏప్రిల్ 26న ఏలూరు ప్రభుత్వ మెడికల్ కళాశాల మంజూరు అవ్వడం, ఏలూరు ప్రభు త్వాస్పత్రిని టీచింగ్ ఆస్పత్రిగా అప్‌గ్రేడ్ చేయడంతో అప్పటినుంచి ప్రైవేటు అంబులెన్సుల వారు అడ్డూ అదు పు లేకుండా ధరలను పెంచేసుకున్నారు. ఇక రాత్రివేళ అయితే వారు చెప్పే ధరలు అంతా ఇంతా కాదు. ప్రభు త్వాస్పత్రికి రెండు మహా ప్రస్థానం వాహనాలు ఉన్నాయి. ఉదయం ఎనిమిది నుంచి రాత్రి ఎనిమిది గంటల వరకు వాహనాలు ఆస్పత్రి నుంచి మృతదేహాలను మృతుల బంధువులు కోరుకున్న ప్రాంతాలకు (జిల్లాలో మాత్రమే) ఉచితంగా తీసుకువెళ్తూ ఉంటారు. ఈ వాహనాలు ఎక్కడ ఉంటాయో, ఎవరిని సంప్రదించాలో తెలియని పరిస్థితి. గతంలో దీనికి సంబంధించి ఫ్లెక్సీలపై ఆ వాహనాలకు సంబంధించిన ఫోన్ నెంబర్లు అందుబాటులో ఉండేవి. ఇప్పుడు ఆ వాహనాలు కాని, డ్రైవర్ల వివరాలు, అత్యవసర విభాగం వద్ద కనిపించడం లేదు. చివరకు మృతుని బంధువులు ప్రైవేటు అంబులె న్సులను ఆశ్రయించాల్సి వస్తోంది. పరోక్షంగా ఈ మహా ప్రస్థానం డ్రైవర్లు సహకరి స్తున్నారని, వీరికి ప్రైవేటు అంబులెన్సులు ఉన్నాయన్న ఆరోపణలున్నాయి. పైన చెప్పిన పట్టిక ప్రకారం ప్రైవేటు అంబులెన్సులు తీసుకోవాలి. ఈ ధరల పట్టికను ఆసుపత్రి అత్యవసర విభాగం గేటు వైపు పెద్ద ఫ్లెక్సీ రూపంలో కనిపిస్తున్నా అవి ఎక్కడా అమలుకావు. ఎవరైనా ఫిర్యాదు చేయాలంటే ఏలూరు టూ టౌన్ పోలీస్‌స్టేషన్, ఉప రవాణా కమిషనర్‌కు ఫోన్ చేయవచ్చని ఉన్నప్పటికీ సంబంధిత అధికారులు ఏనాడు ఇక్కడకు వచ్చి తనిఖీలు చేయలేదు. కలెక్టర్ జారీచేసిన ధరల పట్టికను అమలు చేయడంలో అధికారులు విఫలం కావడంతో ప్రైవేటు అంబులెన్సుల నిర్వాహకులు ఇష్టారా జ్యంగా నిర్వహిస్తు న్నారు. వాస్తవానికి అంబులెన్సులకు సరైన రికార్డులు, ఫిట్ నెస్ లేవు. రవాణాశాఖ అధికారులు, పోలీసు, రెవెన్యూ, ఆసుపత్రి అధికారులు వీటి విషయంలో ఎందుకు గోప్యత పాటిస్తున్నారోనని రోగుల బంధువులు పలు అనుమా నాలు వ్యక్తం చేస్తున్నారు.
ప్రభుత్వం నిర్ణయించిన ధరలు
ఏలూరులో రోగిని లేదా మృతదేహాన్ని ప్రభుత్వా స్పత్రి నుంచి నగరంలోని మరో ఆస్పత్రికి వెళ్లాలంటే రూ.500 నుంచి రూ.1000 వసూలు చేయాలి.
పది కిలోమీటర్ల వరకు.. మారుతి ఓమ్నీ అంబులెన్సు, టెంపో ట్రావీలర్ అంబులెన్సు రూ.1700. అంబులెన్సులో ఆక్సిజన్ పెడితే గంటకు రూ.200 చొప్పున వసూలు చేస్తారు.
11 నుంచి 20 కిలోమీటర్లకు 2,200
21 నుంచి 30 కిలోమీటర్లు 2,400
31 నుంచి 40 కిలోమీటర్లు 2,600
41 నుంచి 50 కిలోమీటర్లు 2,860
51 నుంచి 60 కిలోమీటర్లు 3,038
61 నుంచి 70 కిలోమీటర్లు 3,300
71 నుంచి 80 కిలోమీటర్లు 3,520
81 నుంచి 90 కిలోమీటర్లు 3,740
91 నుంచి 100 కిలోమీటర్లు 5,060
101 నుంచి 110 కిలోమీటర్లు 4,620
Updated Date - Nov 21 , 2024 | 12:46 AM