ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

కడప జిల్లాలో దెబ్బకు కర్నూలులో కాక!

ABN, Publish Date - Nov 13 , 2024 | 06:14 AM

కర్నూలు జిల్లా కప్పట్రాళ్ల రిజర్వు ఫారెస్ట్‌ ప్రాంతంలో యురేనియం తవ్వకాలకు వ్యతిరేకంగా 15 గ్రామాల ప్రజలు మూడు నెలలుగా ఆందోళన చేస్తున్నారు.

యురేనియం తవ్వకాలపై ప్రజాగ్రహం.. ‘పులివెందుల’ శుద్ధికర్మాగారంతో అనర్థాలు

కర్నూలు జిల్లా కప్పట్రాళ్ల రిజర్వు ఫారెస్ట్‌ ప్రాంతంలో యురేనియం తవ్వకాలకు వ్యతిరేకంగా 15 గ్రామాల ప్రజలు మూడు నెలలుగా ఆందోళన చేస్తున్నారు. గత జగన్‌ ప్రభుత్వం ఇచ్చిన అనుమతులు రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తూ పోరుబాట పట్టారు. వారి ఆవేదనకు, భయాలకు... పొరుగునే ఉన్న కడప జిల్లాలో వైఎస్‌ రాజశేఖరరెడ్డి హయాంలో శ్రీకారం చుట్టిన యురేనియం శుద్ధికర్మాగారం వల్ల నేడు చోటు చేసుకుంటున్న దుష్పరిణామలు అద్దం పడుతున్నాయి. ప్లాంట్‌ ఏర్పాటు చేయకముందు అక్కడి పరిస్థితులు ఎలా ఉండేవి? ఇప్పుడు స్థానికులు ఎదుర్కొంటున్న సమస్యలపై ‘ఆంధ్రజ్యోతి’ ప్రత్యేక కథనం.

వైఎస్‌ హయాంలో ప్లాంటుకు శ్రీకారం

15 ఏళ్లుగా తవ్వకాలు, శుద్ధి, సరఫరా

కీలకమైన టెయిలింగ్‌పాండ్‌ భద్రత గాలికి

హామీలను విస్మరించిన యూసీఐఎల్‌

పరిసర గ్రామాల్లో గాలి, నీరు కలుషితం

స్థానిక ప్రజలకు అనారోగ్య సమస్యలు

పంటలు కూడా సాగుచేయలేని దుస్థితి

కర్నూలులో ‘తవ్వకాలు’ వద్దని ఉద్యమబాట

స్పందించిన సర్కారు... తవ్వకాలకు బ్రేక్‌

(పులివెందుల-ఆంధ్రజ్యోతి)

పులివెందుల నియోజకవర్గంలో యురేనియం కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (యూసీఐఎల్‌) శుద్ధికర్మాగారం ఏర్పాటు చేసిన ఎం.తుమ్మలపల్లె ప్రాంతంలో ఒకప్పుడు వాతావరణం ఎంతో ఆహ్లాదకరంగా ఉండేది. అరటి తోటలు, పచ్చని పంటలతో ఆ ప్రాంతం కళకళలాడుతుండేది. పరిసర గ్రామాల్లో ఎలాంటి అనారోగ్య సమస్యలు ఉండేవి కావు. ఇక్కడ యూసీఐఎల్‌ శుద్ధికర్మాగారం ఏర్పాటు చేసిన తర్వాత పరిస్థితులు మారిపోయాయి. యురేనియం తవ్వకాలు, శుద్ధి, సరఫరాతో స్థానికులు ఎన్నో అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారు. వాతావరణం, నీరు కలుషితమైంది. పచ్చగా కళకళలాడాల్సిన పంట పొలాలు బీళ్లుగా మారే పరిస్థితి నెలకొంది. యూసీఐఎల్‌ శుద్ధికర్మాగారం ఏర్పాటు సమయంలో ఎన్నో హామీలిచ్చారు. ఆచరణలోకి వచ్చేసరికి పూర్తి స్థాయిలో అమలు చేయలేదు. అత్యంత జాగ్రత్తగా పరిరక్షించాల్సిన టెయిలింగ్‌పాండ్‌ను యూసీఐఎల్‌ గాలికి వదిలేసింది.

పచ్చని పల్లెలకు శాపం

పులివెందుల నియోజకవర్గంలోని వేముల మండలం ఎం.తుమ్మలపల్లె వద్ద వైఎస్‌ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2007లో దాదాపు రూ.1,100 కోట్లతో యూసీఐఎల్‌ శుద్ధి కర్మాగార పనులు ప్రారంభించింది. 2009 నాటికి శుద్ధికర్మాగారం పనులు పూర్తిచేసుకుని ఉత్పత్తి మొదలు పెట్టింది. ఈ కర్మాగారానికి చుట్టుపక్కల ఎం.తుమ్మలపల్లె, మబ్బుచింతపల్లె, భూమయ్యగారిపల్లె, మీదిపెంట్ల, కేకే కొట్టాల తదితర గ్రామాలున్నాయి. ఈ ప్రాంతమంతా పూర్తిగా అరటితోటలకు నిలయం. ముడి యురేనియం తవ్వకాలు ప్రారంభించినప్పటి నుంచి భూగర్బజలాలు కలుషితమవుతూ వచ్చాయి. భూగర్భంలో బ్లాస్టింగ్‌ చేసినపుడు సమీపంలో ఉన్న బోరుబావుల్లో నీరు కలుషితమైంది. ఈ నీరు తాగడంతో ప్రజలకు ఒంటిపై దద్దుర్లు, దురదలు వస్తున్నాయి. కొందరు మహిళలకు గర్భస్రావమైందని, మగవారిలో లైంగిక సామర్థ్యం తగ్గిపోతోందని స్థానికులు చెబుతున్నారు. గొర్రెలు, పశువులకు కూడా ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి. అయితే ఇవి వాతావరణ పరిస్థితులే తప్ప తమకు సంబంధం లేదని యూసీఐఎల్‌ అప్పట్లో కొట్టిపారేసింది. ప్రజలు, శాస్త్రవేత్తలు, మానవహక్కుల సంఘాలు పెద్దఎత్తున ఆందోళనలు చేసినా ఏమాత్రం పట్టించుకోలేదు.

టెయిలింగ్‌పాండ్‌ నిర్వహణ గాలికి

ముడి యురేనియంను శుద్ధి చేసిన తర్వాత వచ్చే వ్యర్థాలను నిల్వచేసే టెయిలింగ్‌పాండ్‌ను అత్యంత జాగ్రత్తగా పర్యవేక్షించాలి. అయితే యూసీఐఎల్‌ దీని నిర్వహణనే గాలికి వదిలేసింది. ముడి యురేనియాన్ని వెలికితీసేందుకు, శుద్ధి చేసేందుకు మానవాళికి అత్యంత ప్రమాదకరమైన రసాయనాలు వాడతారని, వీటి వ్యర్థాలను జాగ్రత్తగా టెయిలింగ్‌పాండ్‌లో నిల్వ చేయాల్సి ఉందని శాస్త్రవేత్తలు, పర్యావరణ వేత్తలు చెబుతున్నారు. కానీ టెయిలింగ్‌పాండ్‌ నిర్మాణ సమయంలో సరైన భద్రతా ప్రమాణాలు పాటించలేదనే ఆరోపణలున్నాయి. టెయిలింగ్‌పాండ్‌ కింది భాగాన్ని పూర్తిగా అత్యంత నాణ్యతతో కూడిన సిమెంట్‌ లైనింగ్‌తో ఏర్పాటు చేయాలి. దీనివల్ల అందులో నిల్వ చేసే వ్యర్థాలు భూమిలోకి ఇంకవు. యూసీఐఎల్‌ తీసుకోవాల్సిన జాగ్రత్తల్లో ఇది ప్రధానమైందని శాస్త్రవేత్తలు అంటున్నారు. కానీ టెయిలింగ్‌పాండ్‌ తరచూ ఆరిపోతూ ఉంటోంది. దీని కారణంగా అందులో నుంచి తెల్లనిపౌడర్‌లా వచ్చి చుట్టుపక్కల పరిసరాల్లో పడుతోంది. ఈ ధూళి పడటంతో దద్దుర్లు, దురదలు వస్తున్నాయని ప్రజలు అంటున్నారు. ఇటీవల టెయిలింగ్‌పాండ్‌ చుట్టూ ఎత్తు పెంచే సమయంలో ప్లాస్టిక్‌ షీట్‌ ఏర్పాటు చేశారు. దీనిపైన పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. శుద్ధికర్మాగారం నుంచి వ్యర్థాలు సరఫరా అయ్యే పైప్‌లైన్లు తరచూ మరమ్మతులకు గురికావడంతో ఇవి పరిసర ప్రాంతాల్లోని పొలాల్లో ప్రవహిస్తున్నాయి. మరమ్మతులు చేయకుండా యూసీఐఎల్‌ అలసత్వం చూపుతోంది. దీంతో జరగాల్సిన నష్టం జరిగిపోతోందని ప్రజలు అంటున్నారు. కాగా, జనం ఆందోళనల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం స్పందించింది. యురేనియం తవ్వకాలను నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది.


ఇవీ దుష్పరిణామాలు

ముడి యురేనియం తవ్వకాలతో వాతావరణం, భూగర్బజలాలు కలుషితం

కలుషిత నీరు తాగడంతో ప్రజలకు ఒంటిపై దద్దుర్లు, దురదలు

కొందరు మహిళలకు గర్భస్రావం, మగవారిలో లైంగిక సామర్థ్యం తగ్గడం

కలుషిత నీటిని తాగిన గొర్రెలు, పశువులకూ అనారోగ్య సమస్యలు

బ్లాస్టింగ్‌ చేసినపుడు సమీపంలోని బోరుబావుల్లో నీటి రాక బంద్‌

టెయిలింగ్‌పాండ్‌ నుంచి తెల్లనిపౌడర్‌లా వస్తున్న ధూళి పడటంతో పంట పొలాలు దెబ్బతింటున్నాయి

శుద్ధికర్మాగారం నుంచి వ్యర్థాలు సరఫరా అయ్యే పైప్‌లైన్లు తరచూ మరమ్మతులకు గురికావడంతో పరిసర ప్రాంతాల్లోని పొలాల్లో అవి ప్రవహిస్తున్నాయి

హామీలు గాలికి

ఎం.తుమ్మలపల్లె వద్ద యూసీఐఎల్‌ శుద్ధి కర్మాగారం ఏర్పాటు చేయాలనుకున్నప్పుడు ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చింది. దీంతో యూసీఐఎల్‌ అనేక హామీలు గుప్పించింది. పంట పొలాలకు నష్టపరిహారం ఇస్తూ ఉద్యోగ భద్రత కల్పిస్తామని చెప్పింది. టెయిలింగ్‌పాండ్‌ చుట్టూ, కర్మాగారం పరిసర ప్రాంతాల్లో పెద్దఎత్తున మొక్కలు నాటుతామని చెప్పింది. ఈ హామీలను నెరవేర్చడంలో విఫలమైందని, 15 ఏళ్లుగా తాము ఇబ్బంది పడుతున్నామని స్థానికులు తెలిపారు.


ఎన్నో అనారోగ్య సమస్యలు

యురేనియం శుద్ధికర్మాగారం ఏర్పాటు చేసినప్పటి నుంచి మబ్చుచింతలపల్లె, ఎం.తుమ్మలపల్లె, కేకే కొట్టాల తదితర గ్రామాల్లో ప్రజలకు అనేక ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి. దురదలకు, దద్దుర్లకు క్రమం తప్పకుండా మందులు వాడాల్సిందే. మా గ్రామం కేకే కొట్టాలలో టెయిలింగ్‌పాండ్‌ వలన భూగర్భజలాలు కలుషితమవుతున్నాయి. పంట పొలాలు దెబ్బతింటున్నాయి. పంట పొలాలను బీళ్లుగా పెట్టుకునే పరిస్థితి నెలకొంది. ఇక్కడ కర్మాగారం వద్దని చెప్పినా వినకుండా ఏర్పాటు చేసి మమ్మల్ని ఇబ్బందులపాలు చేశారు.

- సింగంశెట్టి లింగేశ్వరయ్య, కేకే కొట్టాల, వేముల మండలం

మమ్మల్ని నాశనం చేశారు

యురేనియం ప్రాజెక్టు పెట్టే సమయంలో ఎన్నో మాయ మాటలు చెప్పి నాశనం చేశారు. ఆ మాటలన్నీ గాలికొదిలేశారు. భూగర్భంలో జరిగే బ్లాస్టింగ్‌ వల్ల, టెయిలింగ్‌పాండ్‌ వల్ల తెల్లని దుమ్ములాగా వచ్చి పడుతోంది. దీనివల్ల కీళ్లనొప్పులు, దురదలు, దద్దుర్లు వస్తున్నాయి. చివరకు కళ్లు కూడా క్రమంగా కనిపించకుండా పోతున్నాయి. భూములు తీసుకొని ఉద్యోగాలు ఇస్తామని, అందరూ సంతోషంగా ఉండవచ్చని చెప్పారు. ఉన్న భూముల్లో కొన్నింటిని మాత్రమే తీసుకుని మిగిలిన వాటిని తీసుకోలేదు. ఆ భూములలో పంట పెట్టుకోలేక ఇబ్బందులు పడుతున్నాం. అన్ని విధాలా నష్టపోయాం.

- దస్తగిరమ్మ, ఎం.తుమ్మలపల్లె, వేముల మండలం

నీరు కలుషితం

యురేనియం ప్రాజెక్టు వల్ల మా గ్రామంలో నీరు కలుషితమవుతోంది. సాగుచేసుకుంటున్న అరటి తోటలు కూడా వదిలేశాం. గొర్రెలు, మేకలు మేపుకొందామనుకున్నా భయంగా ఉంది. టెయిలింగ్‌పాండ్‌ నుంచి లీకైన నీటిలో గొర్రెలు, మేకలు దిగడంతో రోగాలు వచ్చి చనిపోతున్నాయి.

- లక్ష్మీదేవి, మబ్బుచింతలపల్లె, వేముల మండలం

మా ప్రాంతం నాశనమైంది

పచ్చని పంటపొలాలతో, కొండ గుట్టలతో చల్లని వాతావరణంతో ఆహ్లాదకరంగా ఉండే మా ప్రాంతం యురేనియం ప్రాజెక్టు వల్ల నాశనం అయింది. వాతావరణం అంతా కలుషితమైంది. నీరు తాగాలన్నా, బయటకు వెళ్లాలన్నా భయం. యురేనియం ప్రాజెక్టును తెచ్చి మా నెత్తిన రుద్దారు. గాలిలో ధూళి వచ్చి ఆరోగ్యాన్ని పాడుచేస్తోంది. క్రమం తప్పకుండా మందులు వాడుతున్నాం.

- వేమిరెడ్డి, మబ్బుచింతలపల్లె, వేముల మండలం

Updated Date - Nov 13 , 2024 | 06:15 AM