పాలనలో ప్రక్షాళన!
ABN, Publish Date - Jun 07 , 2024 | 02:49 AM
కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు ముందే.... యంత్రాంగంలో ప్రక్షాళన మొదలైంది. నిబంధనలు మరిచిపోయి... గీత దాటి మరీ వైసీపీతో అంటకాగిన అధికారులకు
ప్రమాణ స్వీకారానికి ముందే కీలక చర్యలు
అడ్డగోలు ఐపీఎస్‌లకు గేట్లు ‘క్లోజ్’.. ఐఏఎస్‌ల విషయంలోనూ కీలక నిర్ణయాలు
కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు ముందే.... యంత్రాంగంలో ప్రక్షాళన మొదలైంది. నిబంధనలు మరిచిపోయి... గీత దాటి మరీ వైసీపీతో అంటకాగిన అధికారులకు ‘తగిన’ సంకేతాలు వెళ్తున్నాయి. ఈ నెలాఖరుతో పదవీ విరమణ చేస్తున్న ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి సేవలకు దాదాపుగా ‘సెలవు’ పలికినట్లయింది. ‘ఆంధ్రజ్యోతి’ ముందే చెప్పినట్లుగానే ఆయన సెలవుపై వెళ్లిపోయారు. కొత్త సీఎ్‌సగా నీరబ్ కుమార్ లేదా విజయానంద్‌ను నియమించే అవకాశం కనిపిస్తోంది. శుక్రవారం దీనిపై స్పష్టత రానుంది. ఇక.. సీఎంవోలోకి కొత్త అధికారులను తీసుకునే ప్రక్రియ కూడా మొదలైంది. ఇతర శాఖల నుంచి, కేంద్ర సర్వీసుల నుంచి డిప్యుటేషన్‌పై వచ్చి... వైసీపీ సర్కారు హయాంలో అడ్డగోలు నిర్ణయాలు తీసుకుని, అక్రమాలకు సహకరించిన పలువురు అధికారులు మెల్లగా మాతృ శాఖలకు వెళ్లి పోయేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. కానీ... ‘తేల్చాల్సిన లెక్కలు చాలా ఉన్నాయి. కాస్త ఆగండి’ అంటూ వారిని రిలీవ్ చేయకుండా ఆపేశారు. ‘వైసీపీ ఖాకీ’లుగా పేరు తెచ్చుకుని... విపక్ష నేతలను ఇబ్బంది పెట్టడమే లక్ష్యంగా పని చేసిన సీనియర్ ఐపీఎ్‌సలు సీఐడీ చీఫ్ సంజయ్, ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ పీఎస్సార్ ఆంజనేయులు, తీసేసిన ‘సిట్’ అధిపతి కొల్లి రఘురామి రెడ్డికి చంద్రబాబు నివాసంలోకి ప్రవేశం లభించలేదు. ఇక... పునరావాసంలో భాగంగా ‘సలహాదారుల’ అవతారమెత్తిన వారికి ఉద్వాసన మొదలైంది. ఇప్పటికే రాజీనామాలు ఇచ్చిన వారితోపాటు... ఇవ్వని వారినీ కలిపి మొత్తం 40 మంది సలహాదారుల శకాన్ని ముగిస్తూ గురువారం ఉత్తర్వులు వెలువడ్డాయి. మంత్రుల పేషీల్లోని సిబ్బందిని వారి మాతృశాఖలకు పంపిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఆర్థిక శాఖలో అన్ని నిబంధనలను తోసిరాజని... అస్మదీయులకే బిల్లులు చెల్లించారంటూ బిల్డర్స్ అసోసియేషన్ గవర్నర్‌కు ఫిర్యాదు చేసింది. ఆర్థిక శాఖలో ఐదేళ్లు చక్రం తిప్పిన సత్యనారాయణ నిర్వాకంపై విచారణ జరిగే అవకాశముంది.
Updated Date - Jun 07 , 2024 | 02:49 AM