టైట్లింగ్‌ చట్టం రద్దు

ABN, Publish Date - Jul 17 , 2024 | 06:11 AM

ఆంధ్రప్రదేశ్‌ ల్యాండ్‌ టైట్లింగ్‌ యాక్ట్‌ (2022)పై ప్రజల్లో పలు భయసందేహాలు, అనుమానాలు ఉన్న నేపథ్యంలో ఈ చట్టాన్ని రద్దు చేయాలని భూయజమానుల నుంచి తీవ్ర ఒత్తిడి మొదలైందని,

టైట్లింగ్‌ చట్టం రద్దు

రాష్ట్ర మంత్రివర్గం ఆమోదముద్ర

ఉచిత ఇసుక పాలసీకీ పచ్చ జెండా

ధాన్యం కొనుగోలుకు రుణసేకరణకు ప్రభుత్వ హామీ

పౌర సరఫరాల సంస్థకు రూ.2 వేల కోట్ల గ్యారెంటీ

మార్క్‌ఫెడ్‌కు రూ.3,200 కోట్లకు సర్కారు హామీ

పంటల బీమాపై అధ్యయనానికి మంత్రులతో కమిటీ

నెలలోగా నివేదిక ఇవ్వాలని ఆదేశం

కౌలు రైతులకు సులువుగా రుణాలపైనా అధ్యయనం

కేబినెట్‌ కమిటీ వేయాలని సీఎం సూచన

ప్రకృతి వ్యవసాయంపై ప్రత్యేక దృష్టికి నిర్ణయం

2029 నాటికి 20 లక్షల ఎకరాల్లో సాగు

మరో 4 నెలలకు ఓటాన్‌ అకౌంట్‌!

అసెంబ్లీ సమావేశాల తర్వాత ఆర్డినెన్స్‌ జారీ

అమరావతి, జూలై 16 (ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్‌ ల్యాండ్‌ టైట్లింగ్‌ యాక్ట్‌ (2022)పై ప్రజల్లో పలు భయసందేహాలు, అనుమానాలు ఉన్న నేపథ్యంలో ఈ చట్టాన్ని రద్దు చేయాలని భూయజమానుల నుంచి తీవ్ర ఒత్తిడి మొదలైందని, దీంతో దీనిని రద్దుచేస్తూ రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయం తీసుకుందని సమాచార-పౌరసంబంధాలు, గృహనిర్మాణ శాఖల మంత్రి కొలుసు పార్థసారథి తెలిపారు. మంగళవారం సచివాలయంలో కేబినెట్‌ సమావేశం అనంతరం సమాచారశాఖ డైరెక్టర్‌ హిమాన్షు శుక్లాతో కలిసి ఆయన విలేకరులకు వివరాలు తెలియజేశారు. నీతి ఆయోగ్‌ రూపొందించిన ల్యాండ్‌ టైట్లింగ్‌ యాక్ట్‌ ప్రకారం టైటిల్‌ రిజిస్ట్రేషన్‌ అధికారి (టీఆర్వో)గా ప్రభుత్వ అధికారి ఉండాలని.. అయితే ఆ స్థానంలో గత ప్రభుత్వం ఎలాంటి అర్హతా లేని వ్యక్తులను కూర్చోబెట్టేందుకు అవకాశం కల్పించే విధంగా మార్పులు చేసిందని మంత్రి చెప్పారు. ఈ చట్టం ప్రకారం సివిల్‌ కోర్టుల ప్రమేయాన్ని పూర్తిగా తుడిచివేసినట్లవుతుందని.. టీఆర్వో దగ్గర సమస్య ఉత్పన్నమైతే వ్యవయ ప్రయాసల కోర్చి నేరుగా హైకోర్టును ఆశ్రయించాల్సిన పరిస్థితి అని తెలిపారు. ‘టైటిల్‌ రిజిస్ట్రేషన్‌ అధికారులు చేసే వారసత్వ ఆస్తుల బదలాయింపులు సివిల్‌ కోర్టుల ద్వారా చేయవచ్చు. ఈ చట్టం అమల్లోకి వస్తే ప్రస్తుతమున్న రిజిస్ట్రేషన్‌ వ్యవస్థ, రెవెన్యూ వ్యవస్థ, న్యాయ వ్యవస్థ కనుమరుగయ్యే ప్రమాదముంది. స్టేక్‌హోల్డర్స్‌ అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోకుండా హడావుడిగా ఈ చట్టం చేశారు. ఇది ప్రజల ఆస్తులకు రక్షణ లేకుండా చేస్తుంది. భూయజమానులు సంఘ విద్రోహ శక్తుల దయాదాక్షిణ్యాల మీద ఆధారపడేలా చేస్తుంది. ఈ నేపథ్యంలో ప్రజలకు ఈ చట్టంపై అవగాహన కల్పించాల్సిన బాధ్యత కేబినెట్‌, ప్రజా ప్రజాప్రతినిధులపై ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు అభిప్రాయపడ్డారు’ అని వెల్లడించారు. గత రబీ సీజన్‌లో సేకరించిన వరి ధాన్యానికి 84 రోజులు గడిచినా సొమ్ము చెల్లించకుండా వైసీపీ ప్రభుత్వం తాత్సారం చేసింది.

ఈ నేపథ్యంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే రైతులకు బకాయిపడ్డ సొమ్ము రూ.1,000 కోట్లు చెల్లించినట్లు మంత్రి చెప్పారు. రైతులకు కనీస మద్దతు ధర కల్పించే పథకంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం రైతుల నుంచి ఆహార, పప్పు ధాన్యాలను సేకరించి జాతీయ ఆహార భద్రత చట్టానికి అనుగుణంగా తెల్ల రేషన్‌ కార్డులు కలిగిన కుటుంబాలకు రాయితీ ధరలకు ఇస్తోందని.. ప్రస్తుత ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా రాష్ట్ర ప్రభుత్వం ధాన్య సేకరణకు రుణం తీసుకోవలసిన పరిస్థితి ఏర్పడిందని తెలిపారు. ప్రజలకు ఉచితంగా ఇసుక లభించేలా చూడడం, ఇసుక అక్రమ తవ్వకాలు, రవాణాను అరికట్టడం, పర్యావరణ హితం కోరుతూ సుప్రీంకోర్టు, హైకోర్టు, ఎన్‌జీటీ ఇచ్చిన మార్గదర్శకాల మేరకు కొత్త ఇసుక విధానం (2024) రూపొందించాల్సిన అవసరం ఏర్పడిందన్నారు. గతంలో చంద్రబాబు హయాంలో ప్రకృతి వ్యవసాయంలో ఆంధ్రప్రదేశ్‌కు అంతర్జాతీయ స్థాయిలో అత్యంత ప్రతిష్ఠాత్మక గుల్బెంకియన్‌ అవార్డు వచ్చిందని, ఇది వ్యవసాయ రంగంలో నోబెల్‌ ప్రైజ్‌తో సమానమని, ఈ అవార్డు కింద రూ.9 కోట్లు వచ్చిందని చెప్పారు. ఈ ప్రకృతి సేద్యం 2018లో 5 లక్షల హెక్టార్లతో ప్రారంభమైందని.. 10 లక్షల మంది రైతులు ఇందులో భాగస్వాములయ్యారని అన్నారు. ఎలాంటి రసాయనాలు వినియోగించకుండా చేస్తున్న ప్రకృతి సేద్యాన్ని 2029 నాటికి 20 లక్షల హెక్టార్లకు విస్తరించేందుకు చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. ప్రకృతి సేద్యంలో ఆంధ్రప్రదేశ్‌ ప్రపంచానికే మార్గదర్శిగా నిలిచి ఆదర్శప్రాయం అవుతుందని సీఎం అన్నట్లు తెలిపారు. కౌలు రైతులకు సులువుగా రుణాలు అందించే కొత్త విధానం తీసుకురావలసిన అవసరముందని కూడా ఆయన చెప్పారని.. ఈ అంశంపై అధ్యయనం చేసేందుకు కేబినెట్‌ కమిటీ ఏర్పాటు చేయాలని సూచించారని పార్థసారథి వెల్లడించారు.

మరిన్ని కేబినెట్‌ నిర్ణయాలివీ..

గతంలో అమలు చేసిన ఇసుక, గనుల పాలసీ (2019), మరింత మెరుగైన ఇసుక విధానం (2021) రద్దు. ఉచిత ఇసుక యంత్రాంగం (2024) ఏర్పాటయ్యే వరకు ఎలాంటి లాభాపేక్ష లేకుండా ప్రజలకు ఇసుక ఉచితంగా అందించే మధ్యంతర వ్యవస్థ ఏర్పాటు చేసేలా ఈ నెల 8న జారీచేసిన జీవో 43కు కేబినెట్‌ ఆమోదం.

ఇప్పటి వరకు ఆయా సంస్థలతో ఉన్న ఒప్పందాలను నిలుపుదల చేయాలని.. ఇసుక నిల్వలను సంబంధిత అధికారులకు అప్పగించాలని మైన్స్‌ అండ్‌ జియాలజీ కమిషనర్‌కు ఆదేశాలు.

2024-25 సంవత్సరానికి గాను ధాన్యం కొనుగోలు ప్రక్రియ కోసం రాష్ట్ర పౌరసరఫరాల సంస్థ రూ.2 వేల కోట్ల రుణాన్ని వాణిజ్య బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల నుంచి పొందేందుకు రాష్ట్ర ప్రభుత్వం హామీ ఇచ్చేందుకు ఆమోదం.

అలాగే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రైతుల నుంచి ధాన్యం కొనుగోలుకు మార్క్‌ఫెడ్‌.. ఎన్‌సీడీసీ నుంచి వర్కింగ్‌ కేపిటల్‌ సాయం కింద రూ.3,200 కోట్లు కొత్తగా రుణం తీసుకోవడానికి ప్రభుత్వ హామీ కోరుతూ వ్యవసాయ, సహకార శాఖ చేసిన ప్రతిపాదనకు అంగీకారం.

ప్రస్తుతం అమల్లో ఉన్న ధాన్యం కొనుగోలు విధానంలోని లోపాలను సవరించి రైతులకు సులువైన విధానాలను రూపొందించాలి. ఈ నేపఽథ్యంలో వివిధ రాష్ట్రాల్లో ఉన్న పంటల బీమా చట్టాలపై సమగ్ర అధ్యయనం చేసేందుకు ఆర్థిక, పౌర సరఫరాలు, వ్యవసాయ శాఖల మంత్రులతో కమిటీ ఏర్పాటుకు కేబినెట్‌ ఆమోదం. నెల రోజుల్లో నివేదిక ఇవ్వాలని ఆదేశం.

Updated Date - Jul 17 , 2024 | 06:11 AM

Advertising
Advertising
<