సీఐ అవమానించడంతో ఉద్యోగానికి రాజీనామా
ABN, Publish Date - Apr 17 , 2024 | 03:37 AM
‘‘నా తప్పు లేకున్నా.. వ్యక్తిగత కక్షతో అరవై మంది పోలీసుల ముందు సీఐ నన్ను అవమానించాడు. దీంతో ఆ రోజే కానిస్టేబుల్ ఉద్యోగానికి రాజీనామా
సివిల్స్ 780వ ర్యాంక్
నాలుగో ప్రయత్నంలో కానిస్టేబుల్ ఉదయ్‌కృష్ణారెడ్డి విజయగాథ
చిక్కడపల్లి, ఏప్రిల్ 16(ఆంధ్రజ్యోతి): ‘‘నా తప్పు లేకున్నా.. వ్యక్తిగత కక్షతో అరవై మంది పోలీసుల ముందు సీఐ నన్ను అవమానించాడు. దీంతో ఆ రోజే కానిస్టేబుల్ ఉద్యోగానికి రాజీనామా చేశా. ఐఏఎస్ సాధించాలని కసితో దీక్ష తీసుకున్నా. ఆ ఏడాది నుంచే సన్నద్ధత ప్రారంభించా. నాలుగో ప్రయత్నంలో 780వ ర్యాంక్ సాధించా’’ అని ఏపీలోని ఉమ్మడి ప్రకాశం జిల్లాకు చెందిన ఉదయ్‌కృష్ణారెడ్డి తెలిపారు. తన చిన్నప్పుడే తల్లిదండ్రులు చనిపోయారని, నానమ్మ రమణమ్మ పెంపకంలో పెరిగానని వివరించారు. కష్టపడి చదివి కానిస్టేబుల్ కొలువు సాధించానని, 2013-18 మధ్య కానిస్టేబుల్‌గా గుడ్లూరులో కానిస్టేబుల్‌గా పనిచేశానని చెప్పారు. ఆ సమయంలో సీఐ చేసిన అవమానమే సివిల్స్ సాధించేందుకు దోహదపడిందన్నారు. ఐఆర్‌ఎస్ వస్తుందని.. ఆ జాబ్‌లో చేరి ఐఏఎస్ సాధించేందుకు ప్రయత్నిస్తానని చెప్పారు. తనకు జంతువులంటే ఎంతో ప్రేమ అని.. వాటికోసం దేశవ్యాప్తంగా 109 సర్వీసు ప్రారంభించేలా ప్రయత్నం చేస్తానని పేర్కొన్నారు.
Updated Date - Apr 17 , 2024 | 03:37 AM