ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

ఇసుక ఇక.. సులభం!

ABN, Publish Date - Aug 22 , 2024 | 05:22 AM

రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఉచిత ఇసుక విధానాన్ని మరింత సులభతరం చేయాలని ప్రభ్వుత్వం నిర్ణయించింది.

ప్రత్యేక బుకింగ్‌ కేంద్రాలు అనుమతి ఉన్న వాహనాలకే

స్టాక్‌ యార్డ్‌ల్లోకి ప్రవేశం

సెప్టెంబరులో సమగ్ర పాలసీ

ఈలోగా సమస్యలు రాకుండా చర్యలు

అత్యవసరంగా సమీక్షించిన సీఎం: చంద్రబాబు

అమరావతి, ఆగస్టు 21(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఉచిత ఇసుక విధానాన్ని మరింత సులభతరం చేయాలని ప్రభ్వుత్వం నిర్ణయించింది. ఇసుక బుకింగ్‌ కోసం ప్రత్యేక కేంద్రాలు ఏర్పాటు చేయాలని గనుల శాఖను ఆదేశించింది. అనుమతి ఉన్న లారీలకే స్టాక్‌ యార్డుల్లో ప్రవేశం కల్పించేలా తక్షణ చర్యలు చేపట్టాలని పేర్కొంది. సమగ్ర ఇసుక పాలసీ వచ్చేలోగా పంపిణీలో సమస్యలు రాకుండా కొత్త విధానం అమలు చేయాలని ఆదేశించింది. ఈ మేరకు ఉచిత ఇసుక పంపిణీలో నెలకొన్న సమస్యల పరిష్కారం కోసం సీఎం చంద్రబాబు బుధవారం సాయంత్రం అత్యవసర సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్‌కుమార్‌ ప్రసాద్‌, గనులశాఖ ముఖ్య కార్యదర్శి మీనా, ఇతర అధికారులు పాల్గొన్నారు. ఇసుక పంపిణీలో నెలకొన్న సమస్యలపై సీఎం తీవ్ర అసహనం వ్యక్తం చేసినట్లు తెలిసింది. ‘‘ప్రజల మేలుకోరి ఉచిత ఇసుక విధానం తీసుకొస్తే ఈ గందరగోళం ఏమిటి? ఉచిత ఇసుక విధానం కన్నా గతంలోనే ధరలు బాగున్నాయన్న ప్రచారం ఏమిటి? ఈ సమస్యలు ఎందుకొస్తున్నాయి? పరిష్కారానికి ఇంకా ఎంతకాలం వేచిచూడాలి? తక్షణమే ఈ సమస్యకు పరిష్కారాన్ని చూపాలి’’ అని సీఎం స్పష్టం చేసినట్లు తెలిసింది. ఉచిత ఇసుకపై జరుగుతున్న వ్యతిరేక ప్రచారం, వస్తున్న ఆరోపణలు, విమర్శలు, ప్రభుత్వానికి అందుతున్న ఫిర్యాదులపై చంద్రబాబు తీవ్రంగా స్పందించినట్లు తెలిసింది. ఈ సందర్భంగా పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.


యార్డుల వద్ద బుకింగ్‌ లేదు

ఇసుక స్టాక్‌యార్డ్‌ల వద్ద బుకింగ్‌ చేయడానికి వీల్లేదని, దీనికి ప్రత్యేకంగా కౌంటర్లు, ఆఫీసులు ఏర్పాటు చేయాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. దీనివల్ల గందరగోళం తగ్గుతుందని అధికారులు కూడా పేర్కొన్నారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్లు బుకింగ్‌ ఆఫీసులను ఏర్పాటు చేసి ప్రజలకు తెలిసేలా ప్రచారం కల్పిస్తారు. ఉచిత ఇసుక కావాల్సిన వారు బుకింగ్‌ ఆఫీసులలో బుక్‌ చేసుకుని రశీదు తీసుకోవాలి. బుకింగ్‌ సమయంలోనే స్టాక్‌యార్డ్‌కు వాహనాన్ని ఎప్పుడు తీసుకువెళ్లాలో, లోడ్‌ ఎప్పుడు చేయించుకోవాలో తెలిపే టైమ్‌స్లాట్‌ కూడా రశీదులోనే పేర్కొంటారు. అందులో ఎన్ని టన్నుల ఇసుక కావాలి? వాహనం ఏమిటి? దాని నెంబరు ఇలా పలు వివరాలు నమోదు చేయించుకోవాలి. సదరు రశీదు తీసుకుని నిర్దేశిత సమయానికి స్టాక్‌యార్డ్‌కు వెళ్లాలి.

రవాణాలోనూ మార్పులు

ఇసుక రవాణాకు సంబంధించి కూడా మార్పులు చేయనున్నారు. రవాణా వాహనాలను రిజిస్టర్‌ చేయడంతోపాటు కిలోమీటరుకు ఎంత చార్జీ తీసుకోవాలో జిల్లా కలెక్టర్లే నిర్ణయించనున్నారు. దీని ప్రకారం వినియోగదారుడికి ఇచ్చే రశీదులోనే రవాణా చార్జీల వివరాలను కూడా పేర్కొంటారు. స్టాక్‌యార్డ్‌ దగ్గర పోలీసు పికెట్‌ను ఏర్పాటు చేస్తారు. అక్కడ రశీదు చూపాలి. దానిలో వివరాల మేరకే వాహనాన్ని అనుమతిస్తారు. దీనివల్ల పర్మిట్‌ ఉన్న వాహనాలు, అందులోను టైమ్‌స్లాట్‌ ప్రకారం లోడింగ్‌కు అవకాశం ఉన్నవే యార్డుకు చేరుకుంటాయి. ఫలితంగా భారీ వాహనాల క్యూ ఇకపై ఉండదు. గంటల తరబడి, రోజుల కొద్దీ లైన్‌లో వాహనాలు వేచి ఉండాల్సిన పరిస్థితి ఉండదు. పర్మిట్‌ లేని వాహనం ఎవరైనా స్టాక్‌యార్డ్‌కు తీసుకొచ్చి లైన్‌లో ఉంచాలంటే ఇకపై కొనసాగదు. కాగా, భూ సమస్యల పరిష్కారం కోసం సెప్టెంబరు నుంచి ప్రారంభించే గ్రామ రెవెన్యూ సదస్సుల్లో ఇసుక అంశాన్ని చేర్చాలని ప్రభుత్వం నిర్ణయించింది. భూ సమస్యలపై చర్చ ముగిసిన తర్వాత ఉచిత ఇసుక విధానం అమలు, ప్రజల స్పందనపై ప్రత్యేకంగా చర్చించాలని ముఖ్యమంత్రి ఆదేశించినట్లు తెలిసింది. అదేవిధంగా ఇసుక స్టాక్‌యార్డ్‌ల వద్ద ఇకపై పోలీసు పికెట్‌లు ఏర్పాటు చేయనున్నారు. ఈ మేరకు తక్షణమే చర్యలు తీసుకోవాలని డీజీపీని ఆదేశించారు.

వచ్చేనెలలో సమగ్ర పాలసీ

ఇసుక విధానంపై సెప్టెంబరులో సమగ్ర పాలసీ తీసుకురానున్నారు. విధివిధానాలను రూపొందిస్తున్నట్టు గనుల శాఖ ముఖ్యకార్యదర్శి ముఖేశ్‌ కుమార్‌ మీనా సీఎంకు నివేదించారు. త్వరలో పూర్తిస్థాయి ఆన్‌లైన్‌ ఇసుక బుకింగ్‌ విధానం తీసుకొస్తామని తెలిపారు. సెప్టెంబరు 6వ తేదీ నాటికి కాల్‌సెంటర్లు, పరిష్కార వేదికలను ఏర్పాటు చేస్తామన్నారు. కాగా, ఇకపై ప్రతి రోజూ ఉచిత ఇసుక అమలు తీరుపై సమీక్షిస్తానని సీఎం చెప్పినట్టు సమాచారం.

Updated Date - Aug 22 , 2024 | 06:42 AM

Advertising
Advertising
<