ఇసుక.. మస్కా
ABN, Publish Date - Dec 04 , 2024 | 11:26 PM
ఉచితం పేరుతో మసక కొడుతున్నారు. హంద్రీ నదిని లూటీ చేస్తున్నారు. జోరుగా ఇసుక తవ్వకాలు జరిపి అక్రమంగా రవాణా చేస్తున్నారు.
ఉచితం పేరుతో హంద్రీ నది లూటీ
కూటమి, వైసీపీ నాయకుల అక్రమ రవాణా
ఇష్టారాజ్యంగా అనుమతులు.. పెద్దఎత్తున డంప్‌లు
ప్రేక్షక పాత్రలో పోలీసులు, రెవెన్యూ అధికారులు
కోడుమూరు, డిసెంబరు 4(ఆంధ్రజ్యోతి): ఉచితం పేరుతో మసక కొడుతున్నారు. హంద్రీ నదిని లూటీ చేస్తున్నారు. జోరుగా ఇసుక తవ్వకాలు జరిపి అక్రమంగా రవాణా చేస్తున్నారు. కోడుమూరు పట్టణంలోని హంద్రీనది, మండలంలోని గోరంట్ల, వర్కూరు, అనుగొండ, ముడుమలగుర్తి ప్రాంతాల నుంచి రేయింబవళ్లు రోజుకు వందలాది ట్రాక్టర్లలో ఇసుకను అక్రమంగా ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారు. కూటమి, వైసీపీ నాయకులు కుమ్మక్కై ఇసుక దోపిడీ సాగిస్తున్నారు. చర్యలు తీసుకోవాల్సిన రెవెన్యూ అధికారులు, పోలీసులు ప్రేక్షక పాత్ర వహిస్తున్నారు.
ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా..
హంద్రీనది పరివాహక ప్రాంతాల్లో కూడా నిర్మాణ రంగానికి ఇసుక కోసం ట్రాక్టర్ నంబర్, ట్రాలీ నంబర్ పొందుపరుస్తూ సచివాలయాల్లో ఆన్‌లైన్ బుకింగ్ చేసుకోవాలి. బుకింగ్ చేసుకొన్న రశీదును పంచాయతీ కార్యదర్శి అనుమతి తీసుకొని నిర్మాణం చేపడుతున్న ప్రదేశానికి పగలు మాత్రమే ఇసుకను తీసుకెళ్లాలి. ఏ గ్రామంలోని ఇసుకను ఆ గ్రామ పరిధి వరకే ఉపయోగించాలి. అంతేకాకుండా అనుమతి పొందిన వాహనానికి ఉచిత ఇసుక రవాణా అనే ఫ్లెక్సీ ఉండాలని కూటమి ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. కానీ ఇసుక మాఫియా ప్రభుత్వ నిబంధనలు పాటించకుండా ఉచితం పేరుతో హంద్రీ నదిని లూటీ చేస్తోంది. రాత్రి వేళల్లో సుదూర ప్రాంతాలకు ఇసుకను తలించుకు పోతున్నారు. ఇందుకు కొంత మంది ప్రజా ప్రతినిధులు ఇసుక దందాకు పూర్తి మద్దతు ఇస్తుండటంతో ఇసుకాసురులు రెచ్చిపోతున్నారు. ఇసుక అక్రమ రవాణాను అదుపు చేయాల్సిన పోలీసులు, రెవెన్యూ, పంచాయతీరాజ్, నీటి పారుదలశాఖ, మైన్స్ అండ్ జియాలజీ, స్పెషల్ ఎన్స్‌ఫోర్స్‌మెంటు అధికారులు చూసీ చూడనట్లు వ్యవహించడం పట్ల ప్రజల్లో పలు అనుమానాలు వెలువడుతున్నాయి.
కోడుమూరు, గోరంట్ల, వర్కూరు గ్రామాల్లో..
ముఖ్యంగా కోడుమూరు, గోరంట్ల, వర్కూరు గ్రామంలోని కూటమి, వైసీపీ నాయకులతో ఇసుక మాఫియా కుమ్మకై హంద్రీ నదిలోని ఇసుకను ఖాళీ చేస్తున్నారు. ఎలాంటి అనుమతులు లేకుండా ఎక్కడికి పడితే అక్కడికి ఇతర ప్రాంతాలకు ఇసుకను అక్రమంగా తరలిస్తూ రూ.లక్షలు దండుకుంటున్నారు. గోరంట్ల గ్రామంలో ఇద్దరు టీడీపీ నాయకులు కలిసి డోన్, పత్తికొండ, క్రిష్ణగిరి మండలాలకు పెద్ద ఎత్తును ఇసుకను తరలిస్తున్నారు. వర్కూరు గ్రామంలో వైసీపీ, టీడీపీ నాయకులు కలిసి ఇసుక వ్యాపారం సాగిస్తున్నారు. కోడుమూరులో వైసీపీ, టీడీపీ నాయకుల కనుసైగల మధ్య అక్రమ ఇసుక రవాణా సాగుతోందన్న చర్చ సాగుతోంది.
కోడుమూరులో ఇష్టారాజ్యంగా అనుమతులు :
కూటమి ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలను పట్టించుకోకుండా పంచాయతీ కార్యదర్శి అజయ్‌భాస్కర్ ఇసుక తరలింపునకు ఇష్టారాజ్యంగా అనుమతులు ఇచ్చారు. దీంతో రెచ్చిపోయిన ఇసుక మాఫియా రాత్రి, పగలు తేడా లేకుండా ఇసుకను తరలించుకుపోతోంది. కొంత మంది రియల్టర్లు ఇసుక అవసరం లేకపోయినా పెద్ద ఎత్తున ఇసుక డంప్ నిల్వ చేసుకున్నారు. పట్టణంలోని ప్రధాన రహదారి పక్కనే ఒక రియల్టర్ ఇసుకను డంప్ చేయడమే ఇందుకు నిదర్శనం. అనుమతి లేకుండా ఇసుకను తరలిస్తే రూ.10 వేల వరకు జరిమానా విధించడంతో పాటు వాహనాన్ని సీజ్ కూడా చేయవచ్చు. అలాగే ఇసుకను అక్రమ డంప్ చేసిన వాళ్లపై రూ.2 లక్షల వరకు జరిమానా, 2 సంవత్సరాల వరకు జైలు జీవితం అనుభవించే పరిస్థితులు ఉన్నాయి. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి అక్రమ ఇసుక మాఫియాపై కొరడా ఝలిపించాల్సిన అవసరం ఉంది.
అడుగంటుతున్న భూగర్భ జలాలు :
ఇసుక మాఫియా రెచ్చిపోయి హంద్రీ నదిలోని ఇసుకను తోడేశారు. నదిలోని మంచినీటి పథకాల దగ్గర ఉన్న ఇసుకను కూడా తవ్వుకెళ్లారు. దీంతో నదిలోని భూగర్భ జలాలు అడుగంటిపోయాయి. ఈ విషయంపై రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. భూగర్భ జలాలు ఇంకిపోవడంతో రాబోయే రోజుల్లో కోడుమూరు ప్రజలు తాగునీటి కోసం తీవ్ర ఇబ్బందులు పడాల్సిన పరిస్థితులు ఉన్నాయని ఆర్‌డబ్ల్యూఎస్ అధికారులు వాపోతున్నారు. ఇదే పరిస్థితి వర్కూరు, గోరంట్ల, ముడుమలగుర్తి గ్రామ ప్రజలు కూడా ఎదుర్కోవాల్సి ఉంది.
ఆన్‌లైన్ చేసుకుంటేనే ఇసుక :
అజయ్‌భాస్కర్, పంచాయతీ కార్యదర్శి, కోడుమూరు.
ఇసుక కావాలంటే సచివాలయంలో వాహన నంబర్‌తో ఆన్‌లైన్ చేసుకొని రశీదు తీసుకొని రావాలి. హంద్రీనదిలో చూపించిన ప్రాంతంలో మాత్రమే ఇసుక తవ్వుకోవాలి. ప్రభుత్వ నిబంధనలు కచ్చితంగా పాటించాలి.
అనుతులు లేకుంటే హహనాలు సీజ్ చేస్తాం : తబ్రేజ్, సీఐ, కోడుమూరు.
అనుమతి లేకుండా ఇసుకను తరలిస్తే వాహనాలను సీజ్ చేస్తాం. అంతేగాకుండా రాత్రి వేళల్లో ఇసుకను తరలించడం ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధం. అక్రమంగా ఇసుకను తరలించాలని ప్రయత్నం చేస్తే సహించేది లేదు.
Updated Date - Dec 04 , 2024 | 11:26 PM