సత్యసాయి విద్య.. అందరికీ ఆదర్శం
ABN, Publish Date - Nov 23 , 2024 | 04:27 AM
సత్యసాయి బాబా అందిస్తున్న విలువలతో కూడిన విద్య మహోన్నతమైనదని, అందరికీ ఆదర్శమని యూఎస్ నేషనల్ సైన్స్ ఫౌండేషన్ డైరెక్టర్ సేతురామన్ పంచనాథన్ పేర్కొన్నారు.
యూఎస్ నేషనల్ సైన్స్ ఫౌండేషన్ డైరెక్టర్ సేతురామన్ పంచనాథన్
ఘనంగా సత్యసాయి యూనివర్సిటీ 43వ స్నాతకోత్సవం
పుట్టపర్తి, నవంబరు 22(ఆంధ్రజ్యోతి): సత్యసాయి బాబా అందిస్తున్న విలువలతో కూడిన విద్య మహోన్నతమైనదని, అందరికీ ఆదర్శమని యూఎస్ నేషనల్ సైన్స్ ఫౌండేషన్ డైరెక్టర్ సేతురామన్ పంచనాథన్ పేర్కొన్నారు. శ్రీసత్యసాయి జిల్లా కేంద్రం పుట్టపర్తిలోని ప్రశాంతి నిలయంలో గల పూర్ణచంద్ర హాల్‌లో శ్రీసత్యసాయి డీమ్డ్ యూనివర్సిటీ 43వ స్నాతకోత్సవాన్ని శుక్రవారం ఉదయం అట్టహాసంగా నిర్వహించారు. మొదట 21 మంది విద్యార్థులకు బంగారు పతకాలు, 14 మందికి పీహెచ్‌డీలు, 461 మందికి డిగ్రీ పట్టాలను ప్రదానం చేశారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సేతురామన్, యూనివర్సిటీ చాన్సలర్ చక్రవర్తి వాటిని విద్యార్థులకు అందజేశారు. ఈ సందర్భంగా సేతురామన్ పంచనాథన్ మాట్లాడుతూ.. ప్రపంచంలో ఎన్నో యూనివర్సిటీలను సందర్శించానని, ఇటువంటి ప్రత్యేకత ఉన్న విశ్వవిద్యాలయం ఎక్కడా లేదన్నారు. సత్యసాయిబాబాను స్ఫూర్తిగా తీసుకుని, సామాజిక స్పృహతో నడుచుకోవాలని సూచించారు. కార్యక్రమంలో సత్యసాయి సెంట్రల్ ట్రస్టు మేనేజింగ్ ట్రస్టీ ఆర్జే రత్నాకర్, వైస్ చాన్సలర్ రాఘవేంద్రప్రసాద్, ట్రస్టు సభ్యులు నాగానందం, డాక్టర్ మోహన్, మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి, సేవాసంస్థ ప్రతినిధి నిమీష్ పాండే పాల్గొన్నారు.
నేడు సత్యసాయిబాబా జయంతి
సత్యసాయిబాబా 99వ జయంత్యుత్సవాలు శనివారం వైభవంగా నిర్వహించనున్నారు. దేశవిదేశాల నుంచి పెద్దఎత్తున భక్తులు ఇప్పటికే పుట్టపర్తి చేరుకున్నారు. ప్రశాంతి నిలయం, సత్యసాయి మహాసమాధిని ప్రత్యేకంగా అలంకరించారు. వేడుకలకు ముఖ్య అతిథిగా గవర్నర్ అబ్దుల్ నజీర్ హాజరై, భక్తులను ఉద్దేశించి ప్రసంగిస్తారు. సాయంత్రం స్వర్ణరథంపై సత్యసాయి ఊరేగింపు నిర్వహిస్తారు.
Updated Date - Nov 23 , 2024 | 04:27 AM