సమాజమే అండగా మాదిగల విజయం
ABN, Publish Date - Nov 12 , 2024 | 04:20 AM
ఎస్సీ వర్గీకరణ లక్ష్యంగా 30 ఏళ్లుగా సాగించిన ఉద్యమానికి సమాజమే అండగా నిలిచిందని మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి(ఎమ్మార్పీఎస్) వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ పేర్కొన్నారు.
రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలూ వర్గీకరణను త్వరగా అమలు చేయాలి
మంద కృష్ణ మాదిగ డిమాండ్
ఒంగోలులో మాదిగల ఆత్మీయ సమావేశం
ఒంగోలు, నవంబరు11(ఆంధ్రజ్యోతి) : ఎస్సీ వర్గీకరణ లక్ష్యంగా 30 ఏళ్లుగా సాగించిన ఉద్యమానికి సమాజమే అండగా నిలిచిందని మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి(ఎమ్మార్పీఎస్) వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ పేర్కొన్నారు. ఎమ్మార్పీఎస్ ఒంగోలు నగర అధ్యక్షుడు గుంటూరు ప్రభుదాస్ నేతృత్వంలో ఒంగోలులో సోమవారం నిర్వహించిన ఉమ్మడి ప్రకాశం జిల్లా మాదిగల ఆత్మీయ సమ్మేళనంలో మంద కృష్ణ మాదిగ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సమాజంలో వెనుకబడిన మాదిగ జాతి కోసం అలుపెరగని పోరాటం చేశామన్నారు. ఉద్యమ పురిటిగడ్డ ప్రకాశం జిల్లాలో మొదలైన వర్గీకరణ పోరాటం అనంతరకాలంలో దేశంలో ప్రధాన చర్చగా మారిందని తెలిపారు. కాగా, ఎస్సీల్లో 59 కులాలుంటే తాము అందరికీ సమాన ఫలాలు అందాలని పోరాటం చూశామని, కానీ, మాల సోదరులు కొందరు వ్యతిరేక ప్రచారాలు చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. తమ వెనుక టీడీపీ అధినేత, ప్రస్తుత సీఎం చంద్రబాబు ఉన్నారని దుష్ప్రచారం చేశారని అన్నారు. 1994, జూలై 7న ఎమ్మార్పీఎస్ ఆవిర్భవిస్తే అప్పట్లో విజయభాస్కర్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నారని, ఆ తర్వాత ఎన్టీఆర్ సీఎంగా ఉన్నారని తెలిపారు. ఆ సమయంలో చంద్రబాబు ముఖ్యమంత్రి అవుతారని ఎవరికీ తెలియదన్నారు.
తాము పోరాడే సమయానికి చంద్రబాబు సీఎం అయ్యారని పేర్కొన్నారు. మాదిగలు ఎదగడాన్ని ఓర్వలేక ఉమ్మడి రిజర్వేషన్ ఫలాలను మాలలు ఒక్కరే అనుభవించాలని చూశారన్నారు. వర్గీకరణకు వ్యతిరేకించారని తెలిపారు. ఇలాంటి సమయంలోనే58 ఉపకులాలు ఏకతాటిపైకి వచ్చి హక్కుల కోసం పోరాడాయని వివరించారు. తమకు మాలలు తప్ప అన్ని సామాజికవర్గాలు, సమాజం అండగా నిలిచిందని కృష్ణమాదిగ పేర్కొన్నారు. వర్గీకరణ అంశంపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు హర్షణీయమన్నారు. త్వరితగతిన రెండు తెలుగు రాష్ట్రప్రభుత్వాలు వర్గీకరణను అమలు చేయాలని కోరారు. సమావేశంలో ఎమ్మార్పీఎస్ జాతీయ అధ్యక్షుడు మున్నంగి నాగరాజు, ఎంఈఎఫ్ జాతీయ అధ్యక్షుడు చిలమూరి శ్రీనివాసులు, రాష్ట్ర అధ్యక్షుడు భిక్షాలు పాల్గొన్నారు. కాగా, సభ ప్రారంభంలో ఎమ్మార్పీఎస్ ఆవిర్భావం నుంచి మంద కృష్ణ మాదిగ చేసిన పోరాటం, అలాగే దివ్యాంగుల కోసం, చిన్నారుల గుండె ఆపరేషన్ కోసం చేసిన ఉద్యమాలను ఎల్‌ఈడీ తెరపై ప్రదర్శించారు. ఈ సమయంలో ఎమ్మార్పీఎస్ ఉద్యమ ప్రస్థానం ప్రదర్శన వీక్షిస్తూ మంద కృష్ణమాదిగ భావోద్వేగానికి గురయ్యారు.
Updated Date - Nov 12 , 2024 | 04:21 AM