వర్రాను పోలీస్ కస్టడీకి ఎందుకు ఇవ్వకూడదు?
ABN, Publish Date - Nov 30 , 2024 | 04:14 AM
వైసీపీ సోషల్ మీడియా కడప జిల్లా కో కన్వీనర్ వర్రా రవీంద్రారెడ్డి పోలీస్ కస్టడీ పిటిషన్ విచారణను స్థానిక ఎస్సీ, ఎస్టీ కోర్టు (నాల్గవ అదనపు జిల్లా కోర్టు) డిసెంబరు 2కు వాయిదా వేసింది.
ఆధారాలివ్వాలంటూ వర్రా లాయర్లకు కడప కోర్టు ఆదేశం
కడప రూరల్, బాపట్ల, నవంబరు 29(ఆంధ్రజ్యోతి): వైసీపీ సోషల్ మీడియా కడప జిల్లా కో కన్వీనర్ వర్రా రవీంద్రారెడ్డి పోలీస్ కస్టడీ పిటిషన్ విచారణను స్థానిక ఎస్సీ, ఎస్టీ కోర్టు (నాల్గవ అదనపు జిల్లా కోర్టు) డిసెంబరు 2కు వాయిదా వేసింది. ఈ మేరకు జడ్జి వెంకటేశ్వరరావు ఉత్తర్వులు ఇచ్చారు. వర్రాను పోలీస్ కస్టడీకి ఇవ్వాలనే పిటిషన్‌పై శుక్రవారం కోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా వర్రా తరుఫున న్యాయవాదులు స్పందిస్తూ.. పోలీస్ కస్టడీకి ఇవ్వాల్సిన అవసరంలేదని విన్నవించారు. దీనిపై జడ్జి స్పందిస్తూ.. కస్టడీకి ఎందుకు ఇవ్వకూడదో తగిన ఆధారాలు అందజేయాలన్నారు. దానికి సమయం కావాలని వర్రా తరఫు న్యాయవాదులు కోరగా కోర్టు సోమవారం వరకు గడువు ఇచ్చింది.
బాపట్ల కోర్టుకు వర్రా
సోషల్ మీడియాలో అసభ్య పోస్టులు పెట్టిన వ్యవహారంలో గతం లో గుంటూరు జిల్లా పెదనందిపాడు పోలీస్ స్టేషన్‌లో నమోదైన కేసులో విచారణ నిమిత్తం వర్రా రవీంద్రారెడ్డిని శుక్రవారం బాపట్ల కోర్టులో హాజరుపరిచారు. అతనికి ప్రిన్సిపల్ సివిల్ జడ్జి జి.రుక్మిణి 14 రోజులు రిమాండ్ విధించారు. రిమాండ్ ఖైదీగా కడప సెంట్రల్ జైల్లో ఉన్న వర్రాను పీటీ వారెంట్‌పై ఇక్కడికి తీసుకొచ్చారు. అయితే నిందితుడిని కోర్టులో ప్రవేశపెట్టేటప్పుడు సమర్పించాల్సిన డాక్యుమెంట్ల విషయంలో పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించడం పట్ల జడ్జి ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది.
Updated Date - Nov 30 , 2024 | 04:14 AM