హైలెస్సో.. హైలెస్సా!
ABN, Publish Date - May 08 , 2024 | 05:43 AM
కార్పొరేట్ కంపెనీ ప్రతినిధులు రిసార్ట్‌లో రిలాక్స్‌డ్‌గా మీటింగ్‌లు పెట్టుకుంటారు! నలుగురు మిత్రులు సాయంత్రం సరదాగా షికార్లు తిరుగుతుంటారు! ఇదేం కొత్తా కాదు... తప్పూ కాదు!
బిల్లులు ఎవరికిద్దాం.. డబ్బులెవరికిద్దాం!
కృష్ణా నదిలో వీఐపీ బోటులో విహార చర్చలు
సీఎస్, ఆర్థిక శాఖ అధికారుల రహస్య భేటీ
(అమరావతి - ఆంధ్రజ్యోతి)
కార్పొరేట్ కంపెనీ ప్రతినిధులు రిసార్ట్‌లో రిలాక్స్‌డ్‌గా మీటింగ్‌లు పెట్టుకుంటారు! నలుగురు మిత్రులు సాయంత్రం సరదాగా షికార్లు తిరుగుతుంటారు! ఇదేం కొత్తా కాదు... తప్పూ కాదు! కానీ... రాష్ట్రంలోని ముగ్గురు ఉన్నతాధికారులు బోటు షికారుకు వెళ్లారు. వెలగపూడిలో సచివాలయంతోపాటు గుంటూరు, విజయవాడలో అనేక ప్రభుత్వ కార్యాలయాలున్నప్పటికీ... గుట్టుగా బోటులో మీటింగ్ పెట్టుకున్నారు. అదికూడా... రూ.3వేల కోట్లు ఎవరికి, ఎలా పంపిణీ చేయాలనే అంశంపై! పోలింగ్‌కి సరిగ్గా వారం రోజుల ముందు రాష్ట్ర ఆర్థిక శాఖ ఉన్నతాధికారులు ఎస్‌ఎ్‌సరావత్, కేవీవీ సత్యనారాయణతో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి అత్యంత రహస్యంగా ఈ సమావేశం జరిపారు.
మంగళవారం చీకటి పడ్డాక... భవానీ ఐల్యాండ్స్ వద్ద.. కృష్ణా నదిలో ఒక వీఐపీ బోటులో విహరిస్తూ చర్చించుకున్నారు. మంగళవారం రాష్ట్ర ప్రభుత్వం ఆర్‌బీఐలో సెక్యూరిటీలు విక్రయించి రూ.3,000 కోట్లు అప్పు తెచ్చింది. అయితే... ప్రభుత్వం ఇప్పటికే ఆర్బీఐ నుంచి రూ.1500 కోట్లు ఓడీ తీసుకుంది. మరో 1500 కోట్లు వేజ్ అండ్ మీన్స్ కింద తెచ్చుకుంది. వెరసి... ఈ రూ.3 వేల కోట్లలో రూపాయి కూడా రాష్ట్రానికి అందదు. కానీ... వెంటనే ఓడీ, వేజ్ అండ్ మీన్స్ కింద రూ.3వేల కోట్ల దాకా తెచ్చుకోవడానికి రంగం సిద్ధం చేశారు. వీటిని ఎలా వాడాలి? ఎవరికి చెల్లింపులు జరపాలి? వైసీపీ అనుకూల కాంట్రాక్టర్లు ఎవరు? అన్న అంశాలు ఈ మీటింగ్‌లో చర్చకొచ్చినట్టు తెలిసింది.
వివిధ పథకాలకు కోడ్ రాకముందు బటన్ నొక్కి... సరిగ్గా పోలింగ్‌కు ముందు నిధులు జమచేయాలన్న సర్కారు పాచిక ఈసీ ముందు పారలేదు. పోలింగ్ తర్వాతే నిదులు జమచేయాలని స్పష్టం చేసింది. రైతులకు ఇన్‌పుట్ సబ్సిడీ విడుదల చేయడానికి అనుమతి కోరుతూ సీఎస్ రాసిన లేఖను ఈసీ తిరస్కరించిన సంగతి తెలిసిందే. అలాగే... చేయూత, ఆసరా, ఈబీసీ నేస్తం పథకాల డబ్బుల విడుదల కోసం సీఎస్ అనుమతి కోరగా, మరిన్ని వివరాలు కావాలంటూ ఆ ఫైళ్లను తిప్పిపంపారు.
ఎన్నికల ముందు లబ్ధిదారుల ఖాతాల్లో డబ్బు వేసి రాజకీయ లబ్ధి పొందాలని భావించిన వైసీపీకి ఈసీ షాకిచ్చింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి రంగంలోకి దిగారు. దీనికి ప్రత్యామ్నాయాలేమైనా ఉన్నాయా అనేది బోటు మీటింగ్‌లో చర్చ జరిగినట్లు తెలిసింది.
చెల్లింపుల పరంపర...
ప్రస్తుతం రోజుకు రూ.150 నుంచి రూ.200 కోట్ల చెల్లింపులు ఖజానానుంచి జరుగుతున్నాయి. మూడ్రోజులక్రితం కేంద్రం నుంచి ఉపాధి హామీ పథకం డబ్బు 1500 కోట్లు ఖజానాకు చేరింది. ఈ డబ్బు వచ్చినా కూడా జగన్ సర్కార్ ఇంకా రూ.1500 కోట్ల ఓడీలో ఉండడం దారుణం. అంటే, ఉపాధి హామీ పథకం డబ్బులను కూడా జగన్ సర్కార్ మళ్లించేసినట్టే.
37 రోజుల్లో రూ.13 వేల కోట్ల అప్పు
ఈ ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రానికి కేంద్రం రూ.47,000కోట్ల అప్పులకు అనుమతిచ్చింది. ఆర్నెళ్ల వ్యవధిలో ఈఅప్పు వాడాలి. కానీ, జగన్ సర్కార్ కేవలం 37రోజుల్లోనే రూ.13,000 కోట్ల అప్పు తెచ్చేసింది. ప్రతి మంగళవారం అప్పు తెస్తూనే ఉంటుంది. ఆర్నెళ్లు వాడుకోవాల్సిన అప్పును 3 నెలలకే వాడేసే ప్రమాదం ఉంది.
Updated Date - May 08 , 2024 | 05:43 AM