ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

AP Govt : పేదల సేవలో..

ABN, Publish Date - Aug 06 , 2024 | 03:01 AM

గత ఐదేళ్లల్లో విధ్వంసం సృష్టించారు. చిన్న తప్పు జరిగితే సరి చేసుకోవచ్చు. కానీ పూర్తిగా విధ్వంసానికి గురైన రాష్ట్రాన్ని పునర్నిర్మించడానికి చాలా కష్టపడాలి’’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు.

పేదరిక నిర్మూలనే లక్ష్యంగా ప్రభుత్వం

అధికార దర్పానికి దూరంగా.. ప్రజలకు దగ్గరగా!

కలెక్టర్ల సదస్సులో ముఖ్యమంత్రి మార్గ నిర్దేశం

పేదరికం లేని సమాజమే మా ప్రభుత్వ నిర్దిష్టమైన ఆలోచన. పేదల పరిస్థితిని అర్థం చేసుకుంటేనే సరిగ్గా పని చేయగలుగుతాం. ఏం చేస్తే పేదరికం పోతుందో కలెక్టర్లు ఆలోచించాలి. సమాజంలో టాప్‌ 10 శాతం డబ్బులు సంపాదించిన వారు... చిట్టచివరి 20 శాతం వారిని దత్తత తీసుకుని, వారిని తీర్చిదిద్దే బాధ్యత ఇవ్వబోతున్నాం.

- చంద్రబాబు

పేదల సంక్షేమం.. రాష్ట్ర పునర్నిర్మాణం..

సుపరిపాలన.. భవిష్యత్‌ ప్రణాళిక.. ఇవే లక్ష్యాలు

కూటమి సర్కారు కొలువు తీరిన తర్వాత జరిగిన తొలి కలెక్టర్ల సదస్సు ‘సూటిగా... సుత్తిలేకుండా’ సాగింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కలెక్టర్లు, ఇతర ఉన్నతాధికారులకు స్పష్టమైన మార్గనిర్దేశం చేశారు. అధికార దర్పానికి దూరంగా ఉండాలని... పేదలకు దగ్గర కావాలని సూచించారు. ఎమ్మెల్యేలూ, మంత్రులకూ ఇదే చెప్పారు. ‘మా ప్రభుత్వ విధానం, మా లక్ష్యాలు ఇవి! మీరు వినూత్నంగా ఆలోచించండి. మనసుపెట్టి పని చేయండి. ఫలితాలు సాధించండి’ అని కలెక్టర్లకు చంద్రబాబు సూచించారు. ఎప్పటికప్పుడు అందరి పనితీరు సమీక్షిస్తుంటానని కూడా చెప్పారు.

పేదల పరిస్థితిని అర్థం చేసుకోండి

మానవీయ దృక్పథంతో పనిచేయండి

వినూత్నఆలోచనలతో ముందుకు రండి

ప్రజలు గుర్తుంచుకునేలా పని చేయండి

ప్రతి నెలా పదో తేదీన ‘పేదల సేవలో’

ప్రజల జీవితాన్ని మార్చేది ‘పబ్లిక్‌ పాలసీ’యే

అక్టోబరు 2న రాష్ట్రస్థాయి విజన్‌ డాక్యుమెంట్‌

జిల్లా స్థాయిలో మీరూ రూపొందించండి

గేట్ల లోపాలకు ఏఈ, డీఈలదే బాధ్యత

ఆటోమేటిగ్గా డిప్యూటీ ఇంజనీర్‌ సస్పెన్షన్‌

వర్చువల్‌ వర్కింగ్‌ హబ్‌గా ఆంధ్రప్రదేశ్‌

48 గంటల్లో రైతులకు సొమ్ము చెల్లించాలి

గోతాలు ఇవ్వలేని పరిస్థితి మళ్లీ రాకూడదు

సచివాలయాల్లో ఇసుక బుకింగ్‌ సదుపాయం

అమరావతి, ఆగస్టు 5 (ఆంధ్రజ్యోతి): ‘‘గత ఐదేళ్లల్లో విధ్వంసం సృష్టించారు. చిన్న తప్పు జరిగితే సరి చేసుకోవచ్చు. కానీ పూర్తిగా విధ్వంసానికి గురైన రాష్ట్రాన్ని పునర్నిర్మించడానికి చాలా కష్టపడాలి’’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. సోమవారం సచివాలయం వేదికగా జరిగిన కలెక్టర్ల కాన్ఫరెన్స్‌లో ఆయన ప్రసంగించారు. రాష్ట్రంలోని పరిస్థితులను గుర్తుచేస్తూ... భవిష్యత్తుకు పునాదులు వేయడంపై కలెక్టర్లకు, అధికారులకు దిశానిర్దేశం చేశారు. కీలకమైన అంశాలు ఆయన మాటల్లోనే... పబ్లిక్‌ పాలసీ ద్వారా ప్రజల జీవితాలు మారిపోతాయి. గ్రామాల్లో రోడ్లు, కరెంటు లేని రోజుల నుంచి డ్రైవర్‌ లేకుండా నడిచే కార్లు, సొంతంగా విద్యుదుత్పత్తి చేసే రోజులు వచ్చాయి. పబ్లిక్‌ పాలసీ చాలా పవర్‌ ఫుల్‌. మనం తీసుకునే నిర్ణయాలు రాష్ట్ర భవిష్యత్తును, భావితరాల భవిష్యత్తును మారుస్తాయి. పబ్లిక్‌ పాలసీలకు ఆ శక్తి ఉంటుంది. 1991 ఆర్థిక సంస్కరణలు ఇందుకు ప్రధాన ఉదాహరణ. ప్రస్తుతం ప్రపంచంలో ఐదవ అతి పెద్ద ఆర్థిక వ్యవస్థ స్థాయికి చేరుకున్నాం. 2029 నాటికి 3వ అది పెద్ద ఆర్థిక వ్యవస్థకు చేరుకుంటాం. నా లెక్క ప్రకారం అందరం గట్టిగా కలిసి పని చేస్తే 2047 నాటికి ప్రపంచంలో నంబర్‌ వన్‌ ఎనకామిక్‌గా భారతదేశం ఉంటుంది. లేదంటే కనీసం 3 లేదా 2వ స్థానంలో ఉంటాం. ఆ రోజు మనం అప్పట్లో రూపొందించిన పబ్లిక్‌ పాలసీ 25 ఏళ్ల తర్వాత ఊహించని ఫలితాలు సృష్టిస్తోంది. ఇప్పుడు కలెక్టర్లుగా మీరు చేయబోయే పని భవిష్యత్తును సృష్టిస్తుంది. అందుకే గతాన్ని గుర్తు చేస్తున్నా.

పనితీరు బాగుంటేనే...

ఐఏఎస్‌ తర్వాత కలెక్టర్‌గా పని చేయడం ప్రతి అధికారికీ పెద్ద డ్రీమ్‌. దాదాపు 35 సంవత్సరాల ఐఏఎస్‌ సర్వీ్‌సలో ఒక మూడేళ్లు కలెక్టర్‌గా పని చేయాలని అనుకుంటారు. నేనైతే 5 ఏళ్లు కొనసాగించేవాడిని. జిల్లాల్లో పరిపాలన గాడిలో పడాలంటే కలెక్టర్లు ఎక్కువ కాలం ఉండాలి. ఇప్పుడు కూడా అదే కొనసాగిస్తాం. పని చేయకపోతే కలెక్టర్‌ పోస్టు గ్యారంటీ లేదు. నన్ను తప్పుగా అనుకోవద్దు. మీ పనితీరు, వచ్చే ఫలితాలను బట్టి నేను ప్రోత్సహిస్తాను. కలెక్టర్లుగా మీరు చేసే పని మీ జీవితంలో మీకు ఎప్పుడూ గుర్తుండి పోవాలి. మీ వద్దకు ఏ పని వచ్చినా మానవతా దృక్పథంతో ఆలోచించి చేయండి. ‘ఇటీవల ఇలాంటి కలెక్టర్‌ను చూడలేదు’ అని ప్రజలు అనుకోవాలి. సంపద సృష్టించడం, సంక్షేమాన్ని సక్రమంగా అమలు చేయడం వంటివి చేయాలి. దీనికోసం డబ్బులు కూడా లేవు. గతంలో ఇలాంటి పరిస్థితుల్లోనే... విన్నూతంగా బీవోవోటీ, పీపీపీ తీసుకొచ్చాం. ఇలాంటి విన్నూత ఆలోచనలను కలెక్టర్లు శాఖల వారీగా చేయాలి. మనం ఇప్పటికే నెలకు రూ.2737 కోట్ల పింఛన్లు ఇస్తున్నాం. అంటే... ఐదేళ్లల్లో రూ.1.64 లక్షల కోట్లు ఇస్తున్నాం. గత ప్రభుత్వం బటన్‌ నొక్కడం తప్ప ప్రజల్ని ఎప్పుడూ నేరుగా కలిసి పరామర్శించింది లేదు.

మానవతా దృక్పథంతో...

గంటల తరబడి మీటింగ్‌లు ఉండవని ముందే చెప్పాను. రూల్స్‌ మాత్రమే కాకుండా... మానవతా దృక్పథంతో కూడా అధికారులు ఆలోచించాలి. కేవలం రూల్స్‌ చట్రంలో ఆలోచనలు చేస్తే ప్రజల సమస్యలు పరిష్కారం కావు. అధికారం ఉంది కాదా అని పెత్తనం చెలాయిస్తానంటే కుదరదు. కిందస్థాయి అధికారులతో సామరస్యంగా పని చేయించుకోండి. అలాగే.. పని చేయించడంలో రాజీపడొద్దు. కలెక్టర్లు వర్చువల్‌ గవర్నెన్స్‌ అలవాటు చేసుకోవాలి. వాట్సాప్‌ గ్రూప్స్‌ తయారు చేసుకోవాలి. ప్రభుత్వం ఒక యాప్‌ను తీసుకురావాలని చూస్తోంది. దాని ద్వారానే కలెక్టర్లకు, పోలీసులకు, ఎమ్మార్వోలకు ఆదేశాలు ఇవ్వాలని భావిస్తున్నాం. ఇప్పటికే టాటా గ్రూప్‌ ఈ యాప్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. మంత్రులమంతా వాట్సాప్‌ గ్రూప్‌ క్రియేట్‌ చేసుకున్నాం. సీఎంవోకూ గ్రూప్‌ ఉంది. దీనివల్ల రియల్‌టైమ్‌ గవర్నెన్స్‌కు వెసులుబాటు ఉంటుంది.


ఐదేళ్లల్లో ఇబ్బందులు పడ్డా...

మేము ఈ ఐదేళ్లలో తీవ్ర ఇబ్బందులు పడ్డాం. అందుకే ప్రజలు చారిత్రాత్మక విజయాన్ని అందించారు. మాపై చాలా ఆశలు పెట్టుకున్నారు. అధికారంలోకి వచ్చి దాదాపు 50 రోజులవుతుంది. పునర్నిర్మాణం చేయాలంటే చాలా సమస్యలున్నాయి. కొన్ని శాఖలు రాష్ట్రాభివృద్ధికి దోహదం చేస్తాయి. అభివృద్ధి జరిగితే ఆదాయం వస్తుంది. ఆదాయం వస్తే సంక్షేమ కార్యక్రమాలు చేపట్టగలం. అభివృద్ధిలోనే ప్రజలకు సంతృప్తి ఉంటుంది. ఒకవైపు అభివృద్ధి చేయాలి.. ప్రజలు మెచ్చే పాలన ఇవ్వాలి. అది కేవలం సీఎం, డిప్యూటీ సీఎం, అధికారులే కాదు చిట్టచివరి రాజకీయ నాయకులు కూడా ప్రభుత్వ ఇమేజ్‌ను నిర్దేశిస్తారు. సరైన వ్యక్తిని సరైన స్థానంలో పెట్టి, తద్వారా మెరుగైన పాలన అందించడం సీఎంగా నాపై, డిప్యూటీ సీఎంగా పవన్‌ కళ్యాణ్‌కు ఆ బాధ్యత ఉంది. నా పని తీరును ఎప్పటికప్పుడు విశ్లేషించుకుంటాను. ఇంకా నేర్చుకుంటున్నానని పవన్‌ కూడా అన్నారు.

ఐదేళ్లు నష్టపోయాం..

రాష్ట్ర విజభన కంటే 2019-24 అడ్మినిస్ట్రేషన్‌ వల్ల చాలా నష్టపోయాం. ఈ రోజు మనం రూ.10 లక్షల కోట్ల అప్పుల్లో ఉన్నాం. నేను పార్టీ కార్యాలయానికి వెళ్లి మూడు గంటలపాటు కూర్చుంటే 5 వేల ఫిర్యాదులు వచ్చాయి. వీటిలో సగం భూ సమస్యలపైనే ఉన్నాయి. ఇది ఎవరి తప్పు? ప్రతి రికార్డునూ అనుమానంతో చూడాల్సిన పరిస్థితి! అందుకే తొలి మంత్రివర్గ సమావేశంలో ల్యాండ్‌ టైటిల్‌ చట్టాన్ని రద్దు చేశాం. సర్వే రాళ్లకోసం ఖరీదైన గెలాక్సీ గ్రానైట్‌ స్టోన్‌లు కొని... వాటిపైన ఆయన ఫొటో వేసుకోవాలన్న ఆలోచన వచ్చిదంటే మనం అందరం ఆలోచించాలి.

‘ఫేక్‌’లను వదిలేది లేదు..

కలెక్టర్లు మంచి పనులపై ప్రజలకు అవగాహన కల్పించాలి. చెడు వచ్చినప్పుడు కూడా వెంటనే స్పందించి... వాస్తవాలను బయటపెట్టాలి. (ఈ సందర్భంగా భట్టిప్రోలు సంఘటన వీడియో ప్రదర్శించారు.) సమాజంలోకి ఫేక్‌ ఫెలోస్‌ వచ్చారు. 36 మందిని చంపేశారని ఢిల్లీ వెళ్లి ధర్నా చేశారు. ఎఫ్‌ఐఆర్‌లు అడిగితే ఇప్పటి వరకూ ఇవ్వలేదు. రాజకీయ నాయకులు పేపర్లు, టీవీలు పెట్టుకుని, సోషల్‌ మీడియాలో తప్పుడు ప్రచారం చేసి ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారు. ఇది క్షమారహితం. ఎవ్వరినీ వదిలిపెట్టేది లేదు.


ప్రతి కార్యాలయానికీ సౌర విద్యుత్‌ కళ

రాష్ట్రంలో విద్యుత్తు కోతలు అనేమాట వినబడేందుకు వీల్లేదు. అదే సమయంలో చౌకగా నాణ్యమైన విద్యుత్తు వినియోగదారులకు దక్కాలి. రాష్ట్రంలో హైబ్రీడ్‌ విద్యుత్తు వినియోగానికి వెళ్లాల్సి ఉంది. వీలైనంతవరకు సోలార్‌, విండ్‌ హైబ్రీడ్‌ విద్యుదుత్పత్తిని చేపడదాం. కేంద్రం అమలుచేస్తున్న సోలార్‌ విద్యుత్తు పథకాలను అందిపుచ్చుకుందాం. సూర్యఘర్‌ పథకాన్ని సద్వినియోగం చేసుకుందాం. రాష్ట్రంలో వెయ్యి నుంచి రెండు వేల ఫీడర్ల పరిధిలో మినీ సోలార్‌ గ్రిడ్‌లను ఏర్పాటు చేయడం ద్వారా .. విద్యుత్తు ట్రాన్స్‌మిషన్‌ నష్టాలను భారీగా తగ్గించవచ్చు. ప్రవాహ నష్టాలు ఒక శాతానికి తగ్గించవచ్చు. దీనివల్ల పగటిపూట తొమ్మిదిగంటలపాటు వ్యవసాయానికి ఉచితంగా నిరంతరాయంగా కరెంటును సరఫరా చేయగలుగుతాం. గత ప్రభుత్వంలో విద్యుత్‌ వాహనాలను ప్రోత్సహించలేదు. ఈ వాహనాల చార్జింగ్‌ స్టేషన్లను కూడా తగ్గించారు. చార్జింగ్‌ స్టేషన్లలో నాడు విద్యుత్తు చార్జీలను భారీగా పెంచేశారు. రాష్ట్రంలో విద్యుత్తు వాహనాల వినియోగాన్ని పెంచాలి. రవాణా రంగంలోనూ విద్యుత్తు వాహనాలను ప్రోత్సహించాలి. విద్యుత్తు వాహనాల ప్రోత్సాహానికి ప్రత్యేక విధానం తీసుకురావాలి.

సాగుకు సాంకేతికతను జోడించాలి

రైతులకు వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేందుకు సృజనాత్మక ఆలోచనలు చేయాలి. వ్యవసాయంలో పెట్టుబడులు తగ్గించి, రైతులకు ఆదాయం పెంచేందుకు ప్రకృతి సేద్యాన్ని, శాస్త్రీయ వ్యవసాయ విధానాలను అనుసరించాలి. ప్రజల ఆహార అలవాట్లలో మార్పులొచ్చాయి. పోషక పదార్థాలకు జనం అధిక ప్రాధాన్యం ఇస్తుండటంతో హైప్రొటీన్‌ పంట ఉత్పత్తులకు మంచి డిమాండ్‌ ఉంది. వరి, రాగి, జొన్న, సజ్జ వంటి తృణధాన్యాల్లో నాణ్యమైన ఆహార ఉత్పత్తులు సాధించడానికి ప్రకృతి వ్యవసాయానికి ప్రాధాన్యం పెంచాలి. రానున్న ఐదేళ్లలో రాష్ట్రంలో 20లక్షల హెక్టార్ల మేర ప్రకృతి సేద్యం పద్ధతిలో పండించాలి. రాష్ట్రవ్యాప్తంగా ప్రకృతి సాగును మరింత విస్తరించాలి. గతంలో పెట్టుబడి లేని ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సాహించాం. పామాయిల్‌, కోకో పెంచాం. ఉద్యాన పంటల్లో అధిక ఉత్పత్తులు చూస్తున్నాం. మామిడి, అరటి, డ్రాగన్‌ ఫ్రూట్‌ క్లస్టర్లు ఏర్పాటవుతున్నాయి. వ్యవసాయంతోపాటు డెయిరీ రంగాన్ని మరింత ప్రోత్సహించాలి. డెయిరీ ఫామ్‌లు నిర్మించుకోవటానికి ‘నరేగా’ నిధులివ్వాలి. గతంలో రైతులకు ఉచితంగా భూసార పరీక్షలు నిర్వహించి, ఉచితంగా సూక్ష్మపోషకాలు అందించాం.

డ్రోన్‌ టెక్నాలజీ ఉపయోగించాలి

వ్యవసాయంలో డ్రోన్‌ టెక్నాలజీని ఉపయోగించుకోవాలి. డ్రోన్లతో పురుగుమందులు పిచికారి చేస్తే.. రైతులకు అనవసరపు శ్రమ, ఖర్చు తగ్గుతాయి. డ్రోన్లతో నిరుద్యోగ యువతకు ఉపాధి కూడా లభిస్తుంది. ఏపీలో డ్రోన్‌ తయారీ పరిశ్రమ ఏర్పాటుపైనా కేంద్ర విమానయానశాఖ మంత్రితో చర్చించాలి. వ్యవసాయంలో పెట్టుబడులు తగ్గించి, రైతుల ఆదాయం పెంచే మార్గాలను అన్వేషించాలి. సాగు ఖర్చు తగ్గిస్తే.. రైతులకు నష్టాలను నివారించగలుగుతాం. ఇందుకోసం వ్యవసాయ అనుబంధ శాఖలు సాంకేతికతను అందిపుచ్చుకోవాలి. ఇన్‌పుట్‌ సబ్సిడీ, బీమా, మార్కెట్‌ లింకింగ్‌ కల్పించాలి. అడవులు పెంచాలి. అటవీశాఖలో మంచి అధికారులు ఉన్నారు. అడవులను, వన్యప్రాణులను సంరక్షించాలి. అటవీ ప్రాంతాలతో పాటు నగరాల్లోనూ పచ్చదనం పెంపుదలకు మొక్కలు విరివిగా నాటాలి.


ప్రతినెలా 10న ‘పేదల సేవలో’..

ప్రతి నెలా 10వ తేదీన ‘పేదల సేవ’లో కార్యక్రమం చేపట్టాలి. పేదలతో అనుసంధానం కావాలి. వారి పరిస్థితిని అర్థం చేసుకుంటేనే సరిగ్గా పని చేయగలుగుతాం. ఏం చేస్తే పేదరికం పోతుందో కలెక్టర్లు ఆలోచించాలి. పేదరికం లేని సమాజమే మా ప్రభుత్వం నిర్దిష్టమైన ఆలోచన. పీ-4 మోడల్‌ అనేది (పబ్లిక్‌, ప్రైవేటు, పీపుల్స్‌ పార్ట్‌నర్‌షిప్‌) విధానం తీసుకువస్తున్నాం. సమాజంలో టాప్‌ 10 శాతం డబ్బులు సంపాదించిన వారు... చిట్టచివరి 20 శాతం వారిని దత్తత తీసుకుని, వారిని తీర్చిదిద్దే బాధ్యత ఇవ్వబోతున్నాం. మనమంతా చిన్న గ్రామాల్లో పుట్టిన వాళ్లమే. ఇప్పుడు సమాజంలో ప్రత్యేక స్థానం సంపాదించుకున్నాం. కానీ... మనతోటి వారు ఇప్పటికీ అదే ఊళ్లో రూ.100 లేదా రూ.200 సంపాదించలేని పరిస్థితుల్లో ఉన్నారు. వాళ్లపై ఫోకస్‌ చేద్దాం. ప్రతి కలెక్టర్‌ కొన్ని ప్రిన్సిపల్స్‌ ఫాలో అవ్వాలి. జీవన ప్రమాణాలు మెరుగయ్యేలా చేయాలి. కేంద్రం 2047 విజన్‌ విడుదల చేసింది. మనం కూడా అక్టోబరు 2న మన విజన్‌ డాక్యుమెంట్‌ విడుదల చేస్తున్నాం.

ఆకస్మిక తనిఖీలు చేస్తా...

1995 నాటి సీబీఎన్‌ను చూస్తారని ఇప్పటికే చెప్పాను. ఆకస్మిక తనిఖీల్లో అధికారులకు అన్నీ సృష్టంగా వివరించేవాడిని. ఆ తర్వాత మీడియాలో చూపించేవాళ్లం. అదంతా ఆ రోజుల్లో జరిగింది. రాష్ట్రంలో ఒక కుటుంబానికి ఏం అవసరమో అవన్నీ ప్రభుత్వం తరఫున అందించాలి. అలాగే ఒక గ్రామానికి ఏం అవసరమో అవన్నీ అందిస్తాం. కలెక్టర్లందరూ యువతకు ఉపాధి కల్పించాలి. దానికే తొలి ప్రాధాన్యం ఇవ్వాలి. సంప్రదాయ పద్ధతిలో కాకుండా... వినూత్నంగా ముందుకు వెళ్లాలి.

పోలవరం... విధ్వంసం!

2021లో పూర్తికావాల్సిన పోలవరం ప్రాజెక్టు ఇప్పుడు 2027కో.. 2028కో పూర్తయ్యేలా ఉంది. ఈ జాప్యంతో ప్రజల ఆస్తికి తీవ్రనష్టం వాటిల్లింది. పోలవరం హైడల్‌ ప్రాజెక్టు పూర్తి కాలేదు. దీనివల్ల రూ.4737కోట్ల మేర నష్టం వాటిల్లింది. రూ.460 కోట్లతో పూర్తయిన డయాఫ్రమ్‌వాల్‌ దెబ్బతినడంవల్ల రూ.990 కోట్లతో మరో డయాఫ్రమ్‌వాల్‌ నిర్మించాల్సి వస్తోంది. అసమర్థ నిర్ణయాలవల్ల రాష్ట్రం అప్పుల్లో కూరుకుపోయింది. రూ.పదిలక్షల కోట్ల అప్పులను వడ్డీతో సహా తీరుస్తూ సంక్షేమ పథకాలను అమలు చేయాల్సిన బాధ్యత మనపై పడింది. సోలార్‌ విద్యుత్తు ఒప్పందాలను గత ప్రభుత్వం అనాలోచితంగా రద్దు చేసింది. దీనివల్ల కరెంటును వాడకుండానే, న్యాయస్థానం ఆదేశాల మేరకు ఒప్పందాలను అమలు చేయాల్సి వచ్చింది. తద్వారా రూ. వేల కోట్ల ప్రజాధనం వృఽథా అయింది.

Updated Date - Aug 06 , 2024 | 06:12 AM

Advertising
Advertising
<