‘సీసీ’.. సొమ్ములు నొక్కేసి!
ABN, Publish Date - Jul 17 , 2024 | 06:07 AM
ఆరోగ్య శాఖలో సీసీ కెమెరాల అవినీతి వ్యవహారం తెరమీదికి వచ్చింది. ఆ శాఖ ఉన్నతాధికారులు 11 బోధనాసుపత్రులు,
అవసరం లేని ఆసుపత్రుల కోసం
భారీగా సీసీ కెమెరాల కొనుగోలు
అర్హతలేని కంపెనీకి 18 కోట్ల టెండర్
అస్మదీయ కంపెనీ పేరిట బిల్లులు
అధికారుల జేబుల్లోకి ఖజానా నిధులు
టెండర్ నిబంధనల్లో స్పెసిఫికేషన్ మార్పు
విషయం ముందే పసిగట్టిన ఎంఎస్‌ఐడీసీ
కొనుగోలు ఆదేశాలు ఇవ్వలేమని పక్కకు
అయినా.. పట్టు వదలని అధికారులు
10 మెడికల్ కాలేజీలకు అవసరం లేకున్నా
రూ.3 కోట్లతో సీసీ కెమెరాల కొనుగోలు
వైసీపీ హయాంలో అవినీతి బాగోతం
తాజాగా వెలుగులోకి వచ్చిన వైనం
జగన్ హయాంలో రాష్ట్ర ఆరోగ్య శాఖలో జరిగిన అక్రమాలు ఇప్పుడు వెలుగులోకి వస్తున్నాయి. గత ప్రభుత్వంలో అక్రమాలు, అవినీతి ఒక్కోటీ బయటపడుతున్నాయి. ఏపీఎంఎస్‌ఐడీసీ(ఏపీ మెడికల్ సర్వీసెస్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్)లో జరిగిన ప్రతి టెండర్ ప్రక్రియలోనూ అధికారులు నిబంధనలను తుంగలో తొక్కారు. వీటిలో తాజాగా సీసీ కెమెరాల వ్యవహారం వెలుగు చూసింది.
(అమరావతి-ఆంధ్రజ్యోతి)
ఆరోగ్య శాఖలో సీసీ కెమెరాల అవినీతి వ్యవహారం తెరమీదికి వచ్చింది. ఆ శాఖ ఉన్నతాధికారులు 11 బోధనాసుపత్రులు, 10 కొత్త మెడికల్ కాలేజీలు, 17 జిల్లా ఆస్పత్రులు, 51 ఏరియా ఆస్పత్రుల్లో సీసీ కెమెరాలు బిగించాలని నిర్ణయించారు. అయితే, బోధనాస్పత్రులు, కొత్త కాలేజీలకు మినహా ఇతర ఆసుపత్రులకు సీసీ కెమెరాల అవసరం లేదు. పైగా కెమెరాలు పెట్టాలని కేంద్రం కానీ, రాష్ట్ర ప్రభుత్వం కానీ ఆదేశించలేదు. అయినప్పటికీ ఆ శాఖ ఉన్నతాధికారులు ఏదో ఒక రూపంలో జేబులు నింపుకొనే ప్రయత్నం చేశారు. ఈ నేపథ్యంలో సీసీ కెమెరాల సరికొత్త ఆలోచనను తెరమీదికి తెచ్చారు. ఏరియా ఆస్పత్రులు, జిల్లా ఆస్పత్రుల్లో దొంగల బెడద ఎక్కువగా ఉందని పేర్కొంటూ.. వాటిని అరికట్టేందుకు సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని తలపోశారు. ఈ క్రమంలో సీసీ కెమెరాల ఏర్పాటుకు ప్రతిపాదనలు పెట్టారు. నేషనల్ హెల్త్ మిషన్ నిధుల నుంచి వీటిని కొనుగోలు చేయాలని నిర్ణయించారు. అనుకున్నదే తడవుగా నేషనల్ హెల్త్ మిషన్ అధికారులు.. ఉన్నతాధికారుల ఆదేశాల ప్రకారం సీసీ కెమెరాల స్పెసిఫికేషన్ సిద్ధం చేశారు. ఆ స్పెసిఫికేషన్‌తో ఉన్న కెమెరాలు దాదాపు 3 వేల వరకు అవసరం అవుతాయని, వీటితో పాటు కంప్యూటర్లు, కెమెరాల మానిటర్స్ వంటివి కావాలని నిర్ణయించారు. వీటికి సంబంధించి వెంటనే టెండర్లు పిలవాలని రాష్ట్ర వైద్య సేవల మౌలిక సదుపాయాల అభివృద్ధి కార్పొరేషన్(ఏపీఎంఎ్‌సఐడీసీ)కి లేఖ రాశారు. ఎన్‌హెచ్‌ఎం అధికారుల విన్నపం మేరకు ఏపీఎంఎ్‌సఐడీ అధికారులు టెండర్లు ఆహ్వానించారు. టెండర్ ప్రక్రియలో ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులు ముందుగానే నిర్ణయించుకున్న కంపెనీ ఎల్-1లో రాలేదు. దీంతో ఎన్‌హెచ్‌ఎం ఇచ్చిన స్పెసిఫికేషన్‌ను మార్చేశారు. దీంతో అధికారులు కోరుకున్న కంపెనీ ఎల్-1గా ఎంపిక అయింది. అయితే, ఈ టెండర్ విషయంలో ఏపీఎంఎ్‌సఐడీసీ అధికారులు కొంత భయపడ్డారు. స్పెసిఫికేషన్ మార్చడంతో పాటు అధికారులు నిర్ణయించిన కంపెనీ టెండర్ ప్రక్రియలో సీసీ కెమెరాల ధర భారీగా నమోదు చేసింది. ఈ విషయం ఉన్నతాధికారులకు తెలిసినా బిడ్ ఫైనలైజ్ కమిటీలో ఉన్నవారు సదరు కంపెనీకి ఎల్-1 ఇచ్చేశారు. ఇది ఎప్పటికైనా తమ తలకు చుట్టుకుంటుందని ఏపీఎంఎ్‌సఐడీసీ అధికారులు టెండర్ ప్రక్రియ వరకు మాత్రమే పూర్తి చేశారు. కానీ కంపెనీకి పీవో(కొనుగోలు ఆదేశాలు) మాత్రం ఇవ్వలేదు. దీనిని ఎన్‌హెచ్‌ఎం ద్వారా తెచ్చుకోవాలని చెప్పేశారు. వాస్తవానికి ఆరోగ్యశాఖలో ఏ టెండర్ అయినా ఏపీఎంఎ్‌సఐడీసీనే పిలుస్తుంది. పీవోలు కూడా ఏపీఎంఎ్‌సఐడీసీనే ఇస్తుంది. ఈ టెండర్ విషయంలో మాత్రం ఏపీఎంఎ్‌సఐడీసీ అధికారులు తప్పుకొన్నారు. దీంతో అధికారులు పీవో నిబంధనలను పక్కన పెట్టి ఎన్‌హెచ్‌ఎం నుంచి పీవోలు ఇచ్చేశారు. ఇలా దాదాపు రూ.18.75 కోట్లకు పీవోలు జారీ చేశారు.
అర్హతలేని కంపెనీ!
సీసీ కెమెరాల టెండర్ దక్కించుకున్న విశాఖపట్నానికి చెందిన కంపెనీకి పెద్దపేరు లేదు. ఆర్థికంగా కూడా కోట్ల విలువైన టెండర్లు దక్కించుకునే అర్హత కూడా లేదు. కానీ, ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులు సదరు కంపెనీని ఎంపిక చేసుకుని, దాని ద్వారా వారి జోబులు నింపుకొనేలా వ్యవహరించారు. దానికి అనుగుణంగా ప్లాన్ మొత్తం అమలు చేసిన సదరు కంపెనీకి ఎల్-1 వచ్చేలా చేశారు. పైగా ప్రభుత్వ నిధులతోనే కెమెరాలు కొనుగోలు చేసేలా ముందుగానే 50 శాతం అంటే దాదాపు రూ.8 కోట్లు వరకు బిల్లులు చెల్లించారు.
ముందే బిల్లులు..
ప్రభుత్వం నిర్వహించిన ఏ టెండర్ ప్రక్రియలో అయినా కాంట్రాక్టర్ మొత్తం పని పూర్తి చేసిన తర్వాత బిల్లులు చెల్లిస్తారు. కానీ, సీసీ కెమెరాల టెండర్ ప్రక్రియలో మాత్రం అంతా రివర్స్‌గా జరిగిపోయింది. ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులకు చెందిన కంపెనీ కావడంతో కెమెరాలు కొనుగోలు చేసిన వెంటనే 50 శాతం, కొన్ని కెమెరాలు బిగించిన తర్వాత 25 శాతం, ఆ తర్వాత కెమెరాల నిర్వహణ నిమిత్తం క్వార్టర్‌కు, ఏడాదికి కొంచెం కొంచెం చొప్పున బిల్లులు ఇచ్చేలా నిబంధనల రూపొందించారు. ఏ టెండర్ ప్రక్రియలో కూడా ఈ విధంగా నిబంధనలు మార్చే పరిస్థితి ఉండదు. కానీ, ఎల్-1గా ఎంపికయిన కంపెనీ నుంచి అధికారులకు భారీగా ముడుపులు అందడంతో కంపెనీ ప్రతినిధులు ఎలా చెబితే అలా నిబంధనలు మార్చేశారు.
కాంట్రాక్టర్ ఇస్తాడని తెలిసినా..
ఆరోగ్యశాఖ అధికారులు అవసరం లేని మెడికల్ కాలేజీలు, ఆస్పత్రులకు కూడా సీసీ కెమెరాలు కొనుగోలు చేశారు. గత ప్రభుత్వం 17 మెడికల్ కాలేజీల నిర్మాణం చేపట్టింది. ఆయా కాలేజీల్లో ఎన్‌ఎంసీ సూచనలకు అనుగుణంగా కాలేజీల నిర్మాణం చేపట్టిన కాంట్రాక్టరే సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేశారు. ఒక్కొక్క కాలేజీని దాదాపు రూ.350 కోట్లు ఖర్చు చేసి నిర్మించారు. ఈ విషయం ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులకు తెలుసు. తెలిసి కూడా సదరు కంపెనీకి మేలు చేసి దాని ద్వారా తమ జేబులు నింపుకొనే ప్రయత్నం చేశారు. అవసరం లేకపోయినా 10 కాలేజీలకు కెమెరాలు కొనుగోలు చేశారు. ఇప్పుడా కెమెరాలు ఎక్కడ పెట్టాలో తెలియక ఉన్నతాధికారులు తలలు పట్టుకుంటాన్నారు. కాంట్రాక్టర్ ఇచ్చిన సీసీ కెమెరాలను కొత్త మెడికల్ కాలేజీల్లో ఉన్న బిరువాల్లో భద్రంగా దాచి పెట్టారు. అవసరం లేని 10 కాలేజీలకు కూడా దాదాపు రూ.2 నుంచి రూ.3 కోట్ల విలువైన కెమెరాలు కొనుగోలు చేసి ప్రజాధనాన్ని వృథా చేశారు. ఇదే సమయంలో కమీషన్లను జేబులో వేసుకున్నారు.
Updated Date - Jul 17 , 2024 | 06:07 AM